N Cheman Poems: ఈ రాత్రికి నది చెప్పే కథ విందామా
ABN, Publish Date - Oct 27 , 2025 | 06:05 AM
సుదీర్ఘ ఎడబాటు తర్వాత నదిని కలిశాను.. కలసినప్పుడల్లా కాళ్ళను చుట్టుకుని చల్లని ప్రేమై ముంచెత్తేది నేను తనలోకి- తను నాలోకి ప్రవాహం అయ్యేవాళ్ళము...
సుదీర్ఘ ఎడబాటు తర్వాత నదిని కలిశాను..
కలసినప్పుడల్లా కాళ్ళను చుట్టుకుని
చల్లని ప్రేమై ముంచెత్తేది
నేను తనలోకి- తను నాలోకి
ప్రవాహం అయ్యేవాళ్ళము
ఉరిమే ఉత్సాహమై
ఊళ్లను చుట్టేసిన నది
అడవిలో కాసే వెన్నెలను
వెన్నెల్లో విప్పారిన మనుషులను
తనలో నింపుకున్న నది
ఊటలై ఉరకలేసి
అడవిని చైతన్యపరిచిన నది
ప్రవాహాన్ని వేటాడిన వేటగాడి దాడికి గురై
గాయాల నడకలో ఒంటరి పాయగా
నా వైపు చూడకుండానే
దుఃఖ ప్రయాణంలో ఉన్నది
ఎడారి చేసిన గాయాలతో నేను
అడవిని తగలేసి తనలో కలిపిన
కమురువాసనతో నది
పరస్పరం కౌగిలించుకున్నాము
నది మౌనరోదన నా చెవుల్లోకి పారుతున్నది
తన కోసమే ప్రవహిస్తున్నా..
తను ఎవరో తెలియని ఈ ప్రపంచానికి
నది ఏదో చెప్పాలనుకొంటున్నది
తనకే ప్రవాహం నేర్పిన అడవి చైతన్యం గురించో
పొద్దుపొడుపు మీది ఆశతో
అనంత ప్రయాణాన్ని ప్రకటించుకున్న
వీరుల గురించో
నది ఏదో చెప్పాలనుకుంటున్నది
మీరు చూడని మీకు తెలియని
అనేక కథలు నింపుకొని ఉన్నాను
ఈ దిగ్మండలాన్ని వెలిగించే
మరుగునపడ్డ సూర్యుళ్ల కథలను దాచుకొని ఉన్నాను
నువ్వు, నీతో పాటుగా ఉన్న ఈ ప్రపంచం
నా కథ వింటారా?
ఈ రాత్రికి నా కథ చెప్పాలి
నది తెలియని ప్రపంచానికి
ప్రవాహం తెలియని అమాయకులకు
నా కథ చెప్పాలి
చివరి పొద్దు వెలుగుతున్నప్పుడే
పసికందు కళ్ళు తెరుచుకునే తొలి వెలుగులోనే
నా కథ చెప్పాలి
నేనింకా ఆగిపోలేదని..
అనేక పాయలతో ప్రవహించడానికి సిద్ధపడ్డానని
నేను చెప్పబోయే నా అనుభవాల కథ వింటారా?
ఈ రాత్రికే..
ఈ రాత్రికే..
కాలాన్ని మరిచి నిద్రించే మీ అచేతన సమయాల్లో
నా కథ చెపుతాను
కాలము, నేను, మీరు వేరు కాదని
మీరు గ్రహించే వరకు నా కథ చెపుతాను
మరి.. ఈ రాత్రికి నది చెప్పే కథ విందామా?
చెమన్
9440385563
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 27 , 2025 | 06:05 AM