Tirumala: తిరుమల.. ప్రాచీన అవశేషాచల పుట్ట..
ABN, Publish Date - Sep 21 , 2025 | 01:50 PM
కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం గలది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకుని, ఆదిమ మానవుల సంచారం దాకా... పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకుని కనిపిస్తాయి.
తిరుమల: కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం గలది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకుని, ఆదిమ మానవుల సంచారం దాకా... పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకుని కనిపిస్తాయి.
తిరుమలకు ఉత్తరంగా చక్రతీర్థానికి సమీపంలోని సహజ శిలాతోరణం ఓ భౌగోళిక అద్భుతం. ప్రపంచం మొత్తం మీద ఈ తరహా సహజ శిలాతోరణాలు రెండు మాత్రమే వుండగా అందులో ఇదొకటి. 250 కోట్ల ఏళ్లనాటి క్వార్ట్జ్ రాళ్ళు సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్నాయి. అప్పర్ ప్రోటెరోజోయిక్ కాలం (సుమారు 160 కోట్ల సంవత్సరాల కిందట)లో ఈ రూపం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పాతిక అడుగుల వెడల్పు, అంతే పొడవు, పది అడుగుల ఎత్తు కలిగిన ఈ భౌగోళిక విశేషాన్ని భారత ప్రభుత్వం జాతీయ స్మాకర చిహ్నంగా పరిగణిస్తోంది.
యుద్ధగళ తీర్థం...
తిరుమలకు ఉత్తర దిక్కున యుద్ధగళ తీర్థం వుంది. తలకోన కొండపై నుంచి కాలినడకన 14 గంటలు వెళితే ఈ తీర్థానికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద విశాలంగా విస్తరించివున్న రాతి బండపై ఆదిమ మానవులు చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆ ప్రాంతం ప్రాచీన కాలంలో మానవ ఆవాసంగా వుండేదని ఇవి చెబుతున్నాయి. ఈ బొమ్మలు క్రీస్తు పూర్వం 500-క్రీస్తు శకం 600 నడుమ కాలానికి చెందినవిగా భావిస్తున్నారు.
పితృగళ తీర్థంలోనూ ..
అన్నమయ్య జిల్లా కోడూరు సమీపంలోని మాధవరం నుంచి తిరుమలకు వెళ్ళే అటవీ మార్గంలో తిరుమలకు ఉత్తరం వైపున పితృగళ తీర్థం ఉంది. ఇక్కడ జలపాతం పక్కన నిలువురాతి బండలపై ఆదిమ మానవులు రకరకాల బొమ్మలు చెక్కారు. అందులో మనుషుల బొమ్మలు కూడా వున్నాయి. వీటిని కూడా తొలి చరిత్ర యుగపు మానవులు గీసిన బొమ్మలుగా నిపుణులు గుర్తించారు.
ఈతకాయల మండపం
శేషాచలానికి తూర్పున కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు చేరుకునే నడకదారిలో ఒక మండపం కనిపిస్తుంది. దీనిని ఈతకాయల మండపం అంటారు. శతాబ్దాల తరబడీ శ్రీవారి భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఇది ఉపయోగపడింది.
శిథిల మండపాలు
తిరుమల నుంచి డబ్బా రేకుల కోనకు వెళ్ళే మార్గంలో పార్వేట మండపం దాటి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే శిఽథిలమైన మండపాలు కొన్ని కనిపిస్తాయి. పూర్వకాలంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, వంటలు చేసుకునేందుకు ఈ సత్రాలను ఉపయోగించి ఉండచ్చు. అక్కడ స్నానాలు, తాగునీటి అవసరాలు తీర్చడానికి నిర్మించిన కోనేరు కూడా శిఽథిలమై ఉంది.
రాతి యుగం నాటి సమాధులు
చంద్రగిరి సమీపంలోని మల్లయ్యపల్లి వద్ద రాతి యుగం నాటి మానవుల సమాధులున్నాయి. నలు చదరాల్లాంటి రాళ్ళ వరుసలను ఒకదానిపై ఒకటి పేర్చి, వాటి పైభాగంలో భారీ బండను ఉంచారు. వీటిని పాండవ గుళ్ళు, ఖైరన్లు, డాల్మన్లు అనే పేర్లతో వ్యవహరిస్తారు. వీటిని ప్రాచీన మానవుల సమాధులుగా గుర్తించారు. రాళ్ళ స్థంభాల పైభాగంలో అమర్చిన వెడల్పాటి భారీ సైజు రాతి పలక కింది భాగంలో ప్రాచీన మానవులు చిత్రించిన ఆయుధాలు, జంతువులు, మనుషుల బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి.
ఘంటా మండపం
తిరుమల శ్రీవారి మెట్టు అగ్ర భాగాన శిఖరం అంచున గంభీరంగా నిలిచివున్న ఘంటా మండపం కూడా ప్రాచీన కట్టడమే. చంద్రగిరి కేంద్రంగా యాదవ రాజులు, విజయనగర రాజులు సుదీర్ఘ కాలం పాలించారు. తిరుమల కొండపై శ్రీవారికి నైవైద్యం పెట్టిన తర్వాతే వీరు భోజనం చేసేవారు. నైవేద్యం పూర్తయిన విషయం తమకు తెలిసేలా ఇక్కడ భారీ గంట ఏర్పాటు చేశారు. ఆ గంట మోగగానే చంద్రగిరి కోట లోని సిబ్బంది తామూ గంట మోగించేవారు. ఆ తర్వాతే రాజులు భోజనం చేసేవారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఇదే అలవాటు పాటించేవారు.
- శివప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 01:51 PM