Hyderabad: విద్యాసంస్థలే టార్గెట్.. జోరుగా డ్రగ్స్ దందా..
ABN, Publish Date - Sep 09 , 2025 | 07:37 AM
ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో, సంపన్నులు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మాత్రమే రహస్యంగా వినియోగించే మాదక ద్రవ్యాలు ఇప్పుడు పాఠశాలలకు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను విస్మయానికి గురి చేస్తోంది.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.
- ఫుడ్ డెలివరీ, కొరియర్ సర్వీస్‌ల ద్వారా ఎంట్రీ
- వరుస ఘటనలతో విస్తుపోతున్న పోలీసులు
- పిల్లల భవిష్యత్తు తలుచుకొని బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ సిటీ: ‘ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో, సంపన్నులు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మాత్రమే రహస్యంగా వినియోగించే మాదక ద్రవ్యాలు ఇప్పుడు పాఠశాలలకు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను విస్మయానికి గురి చేస్తోంది.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలన్నా, విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దాలన్నా.. అది ఉపాధ్యాయులకే సాధ్యమవుతుందని ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తూ.. యువత భవిష్యత్తును భయపెడుతున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఈ డ్రగ్స్ మహమ్మారి. మత్తులో గ్రూపు తగాదాలు, కొట్లాటలకు దిగుతుండడం, జీవితాన్ని దుర్భరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతోంది.
యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న స్మగ్లర్స్
అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం.. స్మగ్లర్స్ అవతారం ఎత్తుతున్న ముఠాలు మాదక ద్రవ్యాలను దేశంలోకి సరఫరా చేస్తున్నాయి. కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న యువకులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నారు. అలా మెల్లగా వారిని వ్యసనపరులుగా మార్చి, యువశక్తిని నిర్వీర్యం చేసి, వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరణ
గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు వాటిని తెప్పించుకోవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు చూసి పోలీసులే విస్తుపోయారు. కొద్దిరోజుల క్రితం ఓ యూనివర్సిటీలో డ్రగ్స్ వినియోగిస్తున్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా క్యాంపస్ హాస్టల్లోనే ఉంటున్నారు. బయటకు వెళ్లే మార్గం లేకపోయినా డ్రగ్స్ ఎలా వినియోగిస్తున్నారని పోలీసులు ఆరా తీయగా, ఫుడ్ డెలివరీ, కొరియర్ సర్వీ్‌సల ద్వారా డ్రగ్స్, గంజాయి తెప్పించుకుటున్నట్లు పోలీసులు గుర్తించారు.అవసరమైనప్పుడు వాట్సాప్‌ల్లో కోడ్ భాషల్లో ఆర్డర్ చేస్తున్నారు.
ఆ తర్వాత బయట ఉన్న స్మగ్లర్స్ ఇలాంటి సర్వీ్‌సలను ఎంచుకొని, అనుమానం రాకుండా సరుకును యూనివర్సిటీల్లోకి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 50 మంది విద్యార్థులను నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
- నాలుగు రోజుల క్రితం శంకర్‌పల్లి పరిధిలోని ఓ యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి వినియోగిస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన కలిగించింది.
- ఇటీవల సర్వీస్ అపార్ట్‌మెంట్లలో జల్సాలు చేస్తూ పొరుగు రాష్ట్రానికి చెందిన కొంతమంది యువకులు పోలీసులకు చిక్కారు. వెలుగులోకి వచ్చిన రెండు ఘటనల్లో సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీటెక్ చదువుకుంటున్న విద్యార్థులూ ఉన్నారు. వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి సిటీ వస్తున్న యువకులు బెంగళూరు, గోవా స్మగ్లర్స్‌తో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని కొరియర్ సర్వీస్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు విచారణలో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News
Updated Date - Sep 09 , 2025 | 07:37 AM