Power Sector: విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:20 AM
విద్యుత్తు రంగంలో వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయం కోసం అపెక్స్ కమిటీ(తెలంగాణ పవర్ ప్లానింగ్ కో-ఆర్డినేషన్ కమిటీ-టీజీపీపీసీసీ)తో పాటు పవర్ ట్రేడింగ్ కమిటీ, బ్యాలెన్సింగ్ అండ్ సెటిల్‌మెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగంలో వ్యూహాత్మక ప్రణాళిక, సమన్వయం కోసం అపెక్స్ కమిటీ(తెలంగాణ పవర్ ప్లానింగ్ కో-ఆర్డినేషన్ కమిటీ-టీజీపీపీసీసీ)తో పాటు పవర్ ట్రేడింగ్ కమిటీ, బ్యాలెన్సింగ్ అండ్ సెటిల్‌మెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ జీవో నెం.33ను జారీ చేశారు. ఇదివరకు అపెక్స్ కమిటీలో ముగ్గురు మాత్రమే(ట్రాన్స్‌కో, ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు) ఉండేవారు. తాజాగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శికి కమిటీ చైౖర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక ముందు ఏ విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగినా... ఆ ఒప్పందంపై ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి విధాన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పవర్ ట్రేడింగ్ కమిటీ చైౖర్‌పర్సన్‌గా ట్రాన్స్‌కో డైరెక్టర్(ఫైనాన్స్) ఉండనున్నారు. బ్యాలెన్సింగ్ సెటిల్‌మెంట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ట్రాన్స్‌కో డైరెక్టర్(కమర్షియల్) వ్యవహరిస్తారు.
దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్
దేవాదాయ శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శైలజా రామయ్యర్ కమిషనర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా ఆమె ఇప్పటికే దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.