Hyderabad: కొట్టేసింది ఒకరు.. జల్సా చేసింది మరొకరు
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:01 AM
ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి ఓ గ్రూపు దోపిడీ చేస్తే, ఆ డబ్బును ఎత్తుకెళ్లి జల్సా చేశారు. ఈ కేసులో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ మీడియాకు మంగళవారం వివరాలు వెల్లడించారు.
- వ్యాపారి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
- 18మంది అరెస్ట్
- రూ.43.21 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్: ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి ఓ గ్రూపు దోపిడీ చేస్తే, ఆ డబ్బును ఎత్తుకెళ్లి జల్సా చేశారు. ఈ కేసులో పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్(North Zone DCP Rashmi Perumal) మీడియాకు మంగళవారం వివరాలు వెల్లడించారు. రెండు గ్రూపులు ఈ దోపిడీకి పాల్పడ్డాయి. ఒక గ్రూప్‌నకు, మరో దానికి పరిచయం లేదు. మొదటి గ్రూప్‌లో ఉన్న చంద్రశేఖర్ వర్మ, నాగరాజు కుమార్ వర్మ ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వారు. మార్కెట్ కంటే 5శాతం తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని వ్యాపారులను దోచుకోవడం వీరి ప్లాన్.
దీనిలో భాగంగా నాగరాజు కుమార్ వర్మ బంగారం వ్యాపారులతో పరిచయం ఉన్న సురేష్, బొడ్డు ప్రవీణ్‌చారి, మీసాల కేశవులు, టిజిఎస్పీ కానిస్టేబుల్ (కర్నూల్), బొల్లెపెల్లి విజయ్ శేఖర్ రాజు, రెహ్ని వినోద్ కుమార్, లింగం పెల్లి, తేజ, భూక్య రాంబాబు నాయక్, సుంకరిపల్లి భాను ప్రకాశ్, షేక్‌నబీ, కెల్ల ఉమా మహేష్, మంత్రి వెంకటేష్, శ్రీకాంత్, సాయిబాబాలతో కలిసి దోపిడీకి పథకం వేశారు. దీనిలో భాగంగా బంగారం వ్యాపారి హరిరామ్‌ను కలిసి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించారు. నగదు కోసం హరిరామ్ ఆఫీసుకు వెళ్లారు.
అక్కడ హరిరామ్ వీరికి రూ.72.76 లక్షల నగదు చూపిస్తుండగా, ముఠాలోని సుంకరిపల్లి భాను కొందరు సభ్యులతో కలిసి అక్కడకు వచ్చి పోలీసులమని బెదిరించి నగదు, ఫోన్లతో ఉడాయించారు. భాను, మరొకరితో కలిసి డబ్బుతో బైక్‌పై వెళ్తుండగా వెహికల్ రికవరీ ఏజెంట్లు రోషన్ సునీల్, చేపూరి సురేందర్ వారిని ఆపారు. ఆ బైకుపై ఈఎంఐ పెండింగ్ ఉందని తనిఖీ చేయగా బ్యాగులో డబ్బులున్నాయి. దీంతో రికవరీ ఏజెంట్లు ఆ డబ్బు లాక్కొని పారిపోయారు.
వారు కొంత మంది ఏజెంట్లు, స్నేహితులతో డబ్బును పంచుకుని గోవా వెళ్లి పబ్‌ల్లో ఎంజాయ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. రెండు గ్రూపులకు చెందిన 18 మంది ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.43.21 లక్షల నగదు, 57.193 గ్రాముల బంగారు నగలు, రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 23 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 10మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 25 , 2025 | 10:01 AM