Railway Fare Hike: జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:44 AM
రైల్వే టిక్కెట్ల చార్జీలు జూలై ఒకటి నుంచి స్వల్పంగా పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు.
నాన్ ఏసీకి కిలోమీటరుకు పైసా..
ఏసీకైతే 2 పైసల చొప్పున పెంచే చాన్స్
న్యూఢిల్లీ, జూన్ 24: రైల్వే టిక్కెట్ల చార్జీలు జూలై ఒకటి నుంచి స్వల్పంగా పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. నాన్ ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలు కిలోమీటర్‌కు పైసా చొప్పున, అలాగే ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2పైసల చొప్పున పెంచే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అయితే సబర్బన్ రైళ్లకు, సాధారణ రైళ్లలో రెండో తరగతికి 500 కిలోమీటర్ల వరకు ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తే కిలోమీటర్‌కు అర పైసా చొప్పున పెంపు ఉంటుంది. నెలవారీ సీజన్ టిక్కెట్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు.
2013, 2020లలో పెంచిన చార్జీలతో పోల్చితే ప్రస్తుతం ప్రతిపాదించిన పెంపు చాలా తక్కువని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. 2020 జనవరి ఒకటిన సాధారణ రైళ్లలో రెండో తరగతికి కిలోమీటరుకు పైసా చొప్పున, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 2 పైసల చొప్పున పెంచారు. స్లీపర్‌కు 2 పైసలు, అన్ని ఏసీ తరగతులకు 4 పైసల చొప్పున పెంచారు. కాగా జూలై ఒకటి నుంచి తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేస్తున్నట్లు ఇటీవలే రైల్వే శాఖ ప్రకటించింది.