Hyderabad: కలెక్షన్ బాయ్.. కథలే వేరయా..
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:20 AM
వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న కొందరు డబ్బు కాజేసేందుకు రకరకాల కథలను తెరపైకి తెస్తుంటారు. మరికొందరు తమకున్న కష్టాలనుంచి బయటపడొచ్చని డబ్బుతో సహా పరారవుతుంటారు.
- డబ్బు కాజేసే నాటకమాడినట్టు పోలీసుల గుర్తింపు
- ఇద్దరి అరెస్ట్
- రూ.17 లక్షలు రికవరీ
- మరో ఘటనలో రూ.6.42లక్షల స్వాధీనం
హైదరాబాద్ సిటీ: వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న కొందరు డబ్బు కాజేసేందుకు రకరకాల కథలను తెరపైకి తెస్తుంటారు. మరికొందరు తమకున్న కష్టాలనుంచి బయటపడొచ్చని డబ్బుతో సహా పరారవుతుంటారు. నగరంలో ఇటువంటివే గురువారం జరిగిన రెండు ఘటనలపై పోలీసులు నిగ్గు తేల్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి గురువారం మీడియాకు చోరీ కేసు వివరాలు వెల్లడించారు.
మలక్‌పేట(Malakpet)కు చెందిన గోపాల్ తపారియా ఓ చిట్‌ఫండ్స్ పేరుతో ఆబిడ్స్, రాణిగంజ్ ప్రాంతాల్లో చిట్టీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద ఆరు నెలలుగా మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన జతిన్‌రాజ్ యాదవ్ (22) కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జతిన్‌రాజ్ తన యజమాని డబ్బులు కాజేయాలని పథకం వేసి, స్నేహితుడు సౌద అభిలా్‌ష(మలక్‌పేట)తో కలిసి అదనుకోసం ఎదురుచూశాడు.
ఈ నెల 25న జూబ్లీహిల్స్‌లో ఉన్న పంకజ్ అగర్వాల్ వద్ద నుంచి డబ్బు తెమ్మని యజమాని జతిన్‌ను పంపడంతో ఇదే అదనుగా భావించాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో పంకజ్ అగర్వాల్ నుంచి తీసుకున్న డబ్బును జతిన్ తన స్నేహితుడికి అప్పగించాడు. ఆ తర్వాత యజమానికి ఫోన్ చేసి తాను హిమాయత్‌నగర్ సమీపంలో ఉన్నానని, మరో 10 నిమిషాల్లో కార్యాలయానికి వస్తానని రాత్రి 8.10 గంటల సమయంలో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో అనుమానించిన యజమాని గోపాల్, జతిన్ తండ్రికి ఫోన్ చేశాడు.
ట్యాంక్‌బండ్‌పై జతిన్ బైక్‌కు ప్రమాదం జరిగిందని, అతడు ఆస్పత్రిలో ఉన్నాడని, డబ్బు ఎవరో కాజేశారని తెలిపాడు. దాంతో గోపాల్ వెంటనే దోమల్‌గూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, స్థానికుల సమాచారం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు కాజేసే ప్రయత్నంలో భాగంగానే జతిన్ రోడ్డుపై పడిపోయి యాక్సిడెంట్ జరిగిందంటూ నాటకమాడుతున్నాడని పోలీసులు గుర్తించారు. విచారించగా నేరం ఒప్పుకోవడంతో అతని ఇంట్లో దాచిన రూ.14.50 లక్షలను, స్నేహితుడి వద్ద దాచిన రూ.2.50లక్షలు, రెండు ఫోన్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జతిన్‌ను, అభిలా్‌షను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
మరో ఘటనలో..
యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూ డబ్బుతో పరారైన కలెక్షన్ ఏజెంట్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, శాలిబండ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్సర్ (45) కొంత కాలంగా ఓ జువెలరీ షాప్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలైన అఫ్సర్ యజమాని డబ్బు కాజేయాలని పథకం వేసుకున్నాడు. బిల్లుల వసూళ్లలో భాగంగా పలు ప్రాంతాల్లోని బంగారు నగల దుకాణాల నుంచి వసూలు చేసిన రూ.7లక్షలు తీసుకొని పరారయ్యాడు. జువెలరీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫలక్‌నుమా ప్రాంతంలో అఫ్సర్ ఉన్నట్లుగా సమాచారమందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, శాలిబండ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ. 6.42 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 27 , 2025 | 10:20 AM