-
Ex Harvard Worker: షాకింగ్.. శవాల్ని తల, చర్మం, చేతులు.. ఇలా పార్టుల్లెక్కన అమ్మేవాడు
ABN, Publish Date - May 25 , 2025 | 12:54 PM
శవాల తలలు, మెదళ్ళు, చర్మం, చేతులు, ముఖాలు ఇలా.. పార్టు పార్టులుగా మానవ శరీర అవశేషాల్ని దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఇలా దాదాపు రూ.32 లక్షల వరకూ గడించాడు. చివరికి అతని పాపం పండింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని సుప్రసిద్ధ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన ఒక మాజీ కార్మికుడి షాకింగ్ దుష్టాంతం వెలుగులోకి వచ్చింది. 57 ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్ అనే ఈ మాజీ కార్మికుడు తాను పనిచేసిన సదరు మెడికల్ స్కూల్ నుంచి శవాల తలలు, చర్మం, ఇతర శారీరక అవశేషాల్ని దొంగిలించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఈ అమ్మకాలకి సంబంధించి మరో నిందితురాలిగా ఉన్న సెడ్రిక్ లాడ్జ్ భార్య డెనిస్ లాడ్జ్ ఇప్పటికే తన నేరాన్ని అంగీకరించగా, తాజాగా సెడ్రిక్ కూడా తాను చేసిన తప్పును కోర్టు ముందు ఒప్పుకున్నాడు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చురీలో మేనేజర్‌గా పనిచేసిన సమయంలో, సదరు విద్యాసంస్థకు వైద్య పరిశోధనల నిమిత్తం డోనర్లు ఇచ్చిన మృతదేహాలకు సంబంధించి మానవ తలలు, మెదళ్ళు, చర్మం, చేతులు, ముఖాలు ఇలా.. పార్టు పార్టులుగా అవయవాలను దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేవాడు సెడ్రిక్. 57 ఏళ్ల ఈ సెడ్రిక్ లాడ్జ్ పెన్సిల్వేనియాలోని ఫెడరల్ కోర్టు ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. వైద్య పరిశోధన, విద్య కోసం హార్వర్డ్‌కు విరాళంగా ఇచ్చిన శవాల నుండి దొంగిలించిన మానవ అవశేషాలను అంతర్రాష్ట్ర రవాణా ద్వారా అమ్మినట్టు అంగీకరించాడు.
2018 - మార్చి 2020 కాలంలో సెడ్రిక్ లాడ్జ్ ఈ శవాల అవశేష అమ్మకాలు సాగించాడు. అప్పటికే విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించిన వాటిని గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ప్రాసిక్యూటర్ల వాదన ప్రకారం, లాడ్జ్.. బోస్టన్‌లోని మార్చురీ నుండి దొంగిలించిన అవశేషాలను మొదట న్యూ హాంప్‌షైర్‌లోని గోఫ్స్‌టౌన్‌లో ఉన్న తన ఇంటికి తరలించేవాడు. అతను, అతని భార్య డెనిస్ లాడ్జ్, ఆ తర్వాత శరీర భాగాలను రాష్ట్ర సరిహద్దుల్లోని కొనుగోలుదారులకు విక్రయించేవారు. కొన్నిసార్లు వాటిని నేరుగా రవాణా చేసేవారు. లేదంటే కొనుగోలు దార్లు వాళ్ల ఇంటికి వచ్చి శరీర అవశేషాల్ని పట్టుకెళ్లేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మార్చురీ దగ్గరే బాడీ పార్ట్స్ ఇచ్చేసేవాడు లాడ్జ్. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, పెన్సిల్వేనియా అంతటా విస్తరించి ఉంది.
ఫెడరల్ నేరారోపణ ప్రకారం పెన్సిల్వేనియాలోని డెనిస్ అనే వ్యక్తి లాడ్జ్‌కు మూడేళ్లలో శరీర అవశేషాలు కొనుక్కున్నందుకుగాను $37,355.16 (దాదాపు రూ. 32 లక్షలు) చెల్లించాడు. పేపాల్ ద్వారా చెల్లింపులు జరిపాడు. చెల్లింపులకు గుర్తుగా "హెడ్ నంబర్ 7", "బ్రయియియియిన్స్" వంటి గుర్తులు పెట్టుకున్నాడు. ఈ నేరానికి గాను సెడ్రిక్ లాడ్జ్ ఇప్పుడు గరిష్టంగా 10 సంవత్సరాల ఫెడరల్ జైలు శిక్ష అనుభవించడమే కాకుండా జరిమానా సైతం కట్టాల్సి ఉంటుంది. ఫెడరల్ చట్టాలు, మార్గదర్శకాల ఆధారంగా చీఫ్ US జిల్లా జడ్జి మాథ్యూ W బ్రాన్ శిక్షను నిర్ణయిస్తారు. ఈ కేసులో ఇంకా చాలా మందిపై అభియోగాలు మోపబడ్డాయి. కొందరు నేరాన్ని ఇప్పటికే అంగీకరించారు. జాషువా టేలర్, ఆండ్రూ ఎన్సానియన్, జెరెమీ పౌలీ వంటి కొంతమంది ఈ దందాలో కొనుగోలుదారుల జాబితాలో ఉన్నారు.
జాషువా టేలర్ కూడా నేరాన్ని అంగీకరించాడు. అయితే, అతనికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు. ఆండ్రూ ఎన్సానియన్ సైతం నేరాన్ని అంగీకరించాడు. మాథ్యూ లాంపికి 15 నెలల జైలు శిక్ష విధించబడింది. ఏంజెలో పెరెరాకు 18 నెలల జైలు శిక్ష పడింది. అయితే, లాడ్జ్ నుండి అవశేషాలను కొనుగోలు చేసినట్లు ఆరోపించబడుతున్న మరో నిందితురాలు కత్రినా మాక్లీన్ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించింది. ఆమె పై కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఈ ఘటనతో ప్రఖ్యాత హార్వర్డ్ విద్యాసంస్థ దిగ్భ్రాంతికి గురైంది. "ఇతరులకు వైద్యం చేయడానికి, సేవ చేయడానికి అంకితమైన మా క్యాంపస్‌లో ఇంత ఆందోళన కలిగించే విషయం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాం" అని మెడిసిన్ ఫ్యాకల్టీ డీన్ జార్జ్ డేలీ, మెడికల్ ఎడ్యుకేషన్ డీన్ ఎడ్వర్డ్ హండర్ట్ గతేడాది విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.
చాలా మంది డోనర్లు తాము చనిపోయాక తమ భౌతిక కాయాల్ని హాస్పిటల్స్‌కు డొనేట్ చేయడం పరిపాటి. భారత్ లోనూ ఈ సంప్రదాయం ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. ఈ డెడ్ బాడీస్‌ని వైద్య విద్యార్థులు తమ ప్రయోగాలకు ఉపయోగించుకుంటారనే సంకల్పంతో వీటిని దానం చేస్తుంటారు. ఇలా.. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి కూడా చాలా మంది తాము బ్రతికుండగానే తమ డెడ్ బాడీలను రాసిస్తుంటారు. తాము చనిపోయిన తర్వాత తమ మృతదేహాల్ని సదరు మెడికల్ స్కూల్స్ తీసుకోవాలని అందులో పేర్కొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News
Updated Date - May 25 , 2025 | 01:48 PM