Hyderabad: అరకు టు హైదరాబాద్.. గంజాయి రవాణా
ABN, Publish Date - May 27 , 2025 | 09:15 AM
అరకు టు హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారినుంచి 3.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- నగరానికి తెచ్చి కస్టమర్లకు విక్రయం
- విక్రయిస్తున్న ముఠా అరెస్టు
- 3.80 కిలోల సరుకు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బొల్లారం పోలీసులు... నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి సరుకు స్వాధీనం చేసుకున్నారు. మరేడ్‌పల్లికి చెందిన రౌడీషీటర్ టమాట సంజయ్ అలియాస్ టునా (24), అతడి కజిన్ టమాట శివ సింగ్ అలియాస్ మనీష్ (24), సంజయ్ స్నేహితుడు జొమాటో డెలివరీ బాయ్ జ్వాలా దీపాన్షు కుమార్ అలియాస్ బ్యాడ్ బాయ్ (22), ఖమ్మం బాలాజీనగర్‌కు చెందిన రావుల నరేష్ అలియాస్ చింటూ గంజాయి దందా చేస్తున్నారు.
సంజయ్ గంజాయి కొనుగోలుకు పెట్టుబడి పెడతాడు. ఖమ్మం బాలాజీనగర్(Khammam Balajinagar)కు చెందిన రావుల నరేష్ అలియాస్ చింటూతో కలిసి శివసింగ్ అరకు వెళ్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరానికి తెస్తారు. దీపాన్షు కుమార్.. బాలాజీనగర్, యాప్రాల్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లకు విక్రయిస్తాడు. వచ్చిన డబ్బును అందరూ కలిసి పంచుకునేవారు.
ఈ విక్రయాలపై పక్కా సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బొల్లారం పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. గంజాయి విక్రయించేందుకు వచ్చిన దీపాన్షు, నరేష్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు టమాట సంజయ్, శివసింగ్‌లను అరెస్ట్ చేసి, వారి నుంచి 1.50 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News
Updated Date - May 27 , 2025 | 09:55 AM