Share News

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

ABN , Publish Date - May 27 , 2025 | 05:07 AM

ఒక అందమైన వస్త్రం.. దాన్ని ధరించిన వారి అందాన్ని మరింత పెంచుతుంది. తెలంగాణ చేనేత వస్త్రాలు మాత్రం అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయి అని ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ అన్నారు.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

  • చేనేత వస్త్రాలు.. దారాలతో అల్లిన అద్భుత కథనాలు

  • ప్రపంచంలో ఎక్కడా లేని ఆవిష్కరణలు ఇక్కడ చూశా

  • నా డిజైన్లలో తెలంగాణ వస్త్రాల పాత్ర ఎంతో కీలకం

  • ‘ఆంధ్రజ్యోతి’తో ‘మిస్‌ వరల్డ్‌-25’ డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘ఒక అందమైన వస్త్రం.. దాన్ని ధరించిన వారి అందాన్ని మరింత పెంచుతుంది. తెలంగాణ చేనేత వస్త్రాలు మాత్రం అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయి’ అని ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ అన్నారు. గత ఏడాది ముంబైలో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీలకు డిజైనర్‌గా పనిచేసిన ఈమె.. ప్రస్తుతం తెలంగాణ వేదికగా జరుగుతున్న పోటీలకూ అధికారిక డిజైనర్‌గా ఉన్నారు. 108 దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులందరికీ ఇక్కడి చేనేత వస్త్రాలతో అధునాతన డిజైన్లను రూపొందిస్తూ.. తెలంగాణ కళను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ డిజైన్ల రూపకల్పన కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆమె.. చేనేత కళాకారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక్కడి కళను నిశితంగా పరిశీలించానని, కళాకారుల సృజనాత్మకతకు ముగ్ధురాలినయ్యానని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.


పోచంపల్లి, గద్వాల్‌ చీరలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది?

తెలంగాణ చేనేత సంప్రదాయాలతో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఇవి కేవలం వస్త్రాలు మాత్రమే కాదు.. దారాలతో అల్లిన అద్భుత కథనాలు. ప్రతి నూలు పోగు వెనకా ఓ కథ ఉంటుంది. పోచంపల్లి ఇక్కత్‌, దాని సంక్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ కిటుకు కాలానికతీతంగా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్న నమూనా. కాటన్‌ బాడీలు, సిల్క్‌ బోర్డర్ల ప్రత్యేకమైన కలయికకు ప్రసిద్ధి చెందిన గద్వాల్‌ పట్టు.. సౌకర్యం, అద్భుతమైన కళకు ప్రతీక. మెరిసే పట్టు, గీసిన నమూనాలతో నారాయణపేట చీరలు గొప్ప సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ నేతల మెళకువలను అర్థం చేసుకోవడం నా ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడింది.

ఇక్కడి నేత వస్త్రాలను ఎప్పుడైనా మీ కలెక్షన్లలో ఉపయోగించారా?

దక్షిణ భారత హాఫ్‌ చీరల సొగసును ఉత్తర భారత లెహంగాల గొప్పతనంతో కలిపే ఫ్యూజన్‌ ఎంసెంబుల్స్‌ని రూపొందించడానికి నేను పోచంపల్లి ఇక్కత్‌, నారాయణపేట చీరలను ఇప్పటికే పలుమార్లు ఉపయోగించాను. మిస్‌ వరల్డ్‌-2025 కోసం నా డిజైన్లలో తెలంగాణ సంప్రదాయ నేత వస్త్రాలను చేర్చే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా.


తెలంగాణ ఫ్యాషన్‌ సంస్కృతిలో మీకు నచ్చిన అంశాలు?

అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరల తయారీ నేను ఎక్కడా వినలేదు. ఇది ఇక్కడి కళాకారుల అద్భుత సృజనాత్మకతకు ప్రతీక. అలాగే చీరల తయారీలో బంగారం ఉపయోగించడం కూడా తెలంగాణ కళాకారులకు మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తే అనేకమంది నమ్మలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని ఆవిష్కరణలు ఇక్కడ గమనించా. తెలంగాణ ఫ్యాషన్‌ సంస్కృతి, సంప్రదాయం, ఆవిష్కరణలు అద్భుతం. ఇక్కడి కళాకారుల సృజన నన్నెంతగానో ఆకట్టుకుంది.

మీలాంటి డిజైనర్లు సంప్రదాయ తెలంగాణ దుస్తుల పునరుద్ధరణ లేదా ప్రపంచీకరణకు ఎలా సహాయపడగలరు?

సంప్రదాయం, ఆధునికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో డిజైనర్లు కీలక పాత్ర పోషిస్తారు. సంప్రదాయ తెలంగాణ దుస్తులకు విస్తృత ప్రాచుర్యం కల్పించవచ్చు. ఉదాహరణకు పోచంపల్లి ఇక్కత్‌ను ఆధునిక పెళ్లి వేడుకల్లో పరిచయం చేయవచ్చు. నారాయణపేట చీరలను సాయంత్రం వేళ ధరించే దుస్తుల్లో చేర్చడం ద్వారా వాటిని ప్రపంచవ్యాప్తం చేయొచ్చు.


రాష్ట్ర కళాకారులు, నేత కార్మికులు అంతర్జాతీయ ఫ్యాషన్‌ పరిశ్రమలో ఎలాంటి పాత్ర పోషించగలరు?

తెలంగాణ కళాకారులు, నేత కార్మికులు గొప్ప వారసత్వానికి వెన్నెముకలాంటివారు. హస్తకళ, నవీన ఆవిష్కరణలపై శ్రద్ధ వారిని అంతర్జాతీయ ఫ్య్యాషన్‌ పరిశ్రమలో ముందు వరుసలో నిలుపుతుంది. ప్రపంచం కోరుకునే డిజైన్లు రూపొందించడంతోపాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకుంటే తెలంగాణ కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతారు.

తెలంగాణ సంప్రదాయ దుస్తులను భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం ఉందా?

కచ్చితంగా ఉంది. ఇది ఇప్పటికే ప్రారంభమైంది. మిస్‌ వరల్డ్‌-2025 కోసం నేను పోచంపల్లి ఇక్కత్‌, నారాయణపేట చీరలు వంటి తెలంగాణ సంప్రదాయ దుస్తులను నా డిజైన్లలో గర్వంగా ప్రదర్శించా. ఈ వస్త్రాలు భారతదేశ వారసత్వాన్ని ప్రదర్శించడమేగాక ప్రపంచ వేదికపై వాటి ప్రత్యేకతను కూడా చాటాయి. మిస్‌వరల్డ్‌ పోటీలతో తెలంగాణ వస్త్రాలు ఇక అంతర్జాతీయ వేదికలపై తరచూ కనిపిస్తాయి. అయితే, తెలంగాణ వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి బహుముఖ విధానం అవసరం. తొలుత ఇక్కడి ఘనమైన చరిత్రను తెలియజేయాలి. కళాకారులు, ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం కీలకం.


తెలంగాణ వస్త్రాల్లో మిమ్మల్ని ప్రేరేపించే అంశాలేమిటి?

పోచంపల్లి ఇక్కత్‌.. శక్తిమంతమైన ఎరుపు, నలుపు, తెలుపు రంగులు నా అనేక డిజైన్లకు స్ఫూర్తిగా నిలిచాయి. గద్వాల్‌ పట్టులోని బంగారు జరీ పని వైభవాన్ని తెలియజేస్తుంది. ఈ అంశాలు నా డిజైన్లలో రంగులు, ఎంబ్రాయిడరీ పద్థతులను ప్రభావితం చేస్తాయి.

ఇంత వైవిధ్యమైన పోటీల కోసం డిజైన్‌ చేస్తున్నప్పుడు సవాళ్లేంటి?

విభిన్న పోటీదారుల కోసం డిజైన్‌ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యాలను సాంస్కృతిక సున్నితత్వాలతో సమతుల్యం చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి డిజైన్‌ విభిన్నంగా ఉండేలా చూడడం పెద్ద సవాలే. దీనికోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నా. యూర్‌పకు చెందిన ఒక పోటీదారు పోచంపల్లి ఇక్కత్‌ గౌను ధరించి.. ‘ఇది చరిత్రలో ఒక భాగంలా అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించడం మరపురాని క్షణం. మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు డిజైనింగ్‌ సమయంలో భారతీయ వస్త్రాల గొప్పదనాన్ని తెలియజేస్తూ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే డిజైన్లను రూపొందించడంపైనే ఎక్కువగా దృష్టి సారించా. చారిత్రక డిజైన్లకు సంప్రదాయ వస్త్రాలను చేర్చడంతో మిస్‌ వరల్డ్‌ ప్రతినిధులు ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడి వస్త్రాలతో పోటీదారుల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. తెలంగాణ వారసత్వ కళను ప్రపంచ వేదికపై ప్రదర్శించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 06:00 AM