Android TV Antitrust Ruling: భారత స్మార్ట్ టీవీ మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యానికి చెల్లు.. సీసీఐ కీలక తీర్పు
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:18 AM
స్మార్ట్ టీవీ మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యం దుర్వినియోగానికి సీసీఐ బ్రేకులు వేసింది. స్మార్ట్ టీవీల్లో యాండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్, ప్లే స్వర్వీసులన్నీ కలిపి బండిల్‌గా ఇన్‌స్టాల్ చేయాలని టీవీ తయారీదార్లను పట్టుబట్టొద్దని గూగుల్‌ను ఆదేశించింది. దీంతో, వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయాలు ఎంచుకునే అవకాశం దక్కినట్టైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌పై గూగుల్ గుత్తాధిపత్యానికి బ్రేక్ పడింది. స్మార్ట్ టీవీల్లో ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్, సర్వీసులను కలిపి (బండిల్‌గా) ప్రీ ఇన్‌స్టాలేషన్‌ను తప్పనిసరి చేయొద్దంటూ గూగుల్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. మార్కెట్‌పై తన పట్టును ఇంతకాలం దుర్వినియోగపరిచినందుకు తలంటేసింది. ప్లే స్టోర్, ప్లే సర్వీసులతో పాటు యాండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను (బండ్లింగ్) తప్పనిసరిగా టీవీల్లో ఇన్‌స్టాల్ చేయాలని తయారీదారులను పట్టుపట్టొద్దని ఆదేశించింది. ఈ కేసులో రాజీ కుదుర్చుకునేందుకు గూగుల్‌కు అవకాశం కూడా ఇచ్చింది. ఇద్దరు అడ్వకేట్లు దాఖలు చేసిన పటిషన్లపై సీసీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అంగీకరించిన గూగుల్ ఇకపై ప్లే స్టోర్, ప్లే సర్వీసెస్ వినియోగానికి విడిగా లైసెన్సులు జారీ చేస్తామని పేర్కొంది.
ఏమిటీ బండ్లింగ్
ఆండ్రాయిడ్ టీవీ, ప్లే స్టోర్, ప్లే సర్వీసులు అన్నీంటిని కలిపి తమ స్మార్ట్ టీవీలకు జత చేయాల్సి రావడంతో అటు స్మార్ట్ టీవీ తయారీదార్లకు, ఇటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోయాయి. ఫలితంగా, కొత్త ఓఎస్‌ల అభివృద్ధి కుంటుపడిందని సీసీఐ అభిప్రాయపడింది. మార్కెట్‌లో పోటీని అణిచి వేసే ఈ తరహా చర్యలకు ముగింపు పలకాలని గూగుల్‌కు సీసీఐ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వినియోగదారులకు మరింత స్వేచ్ఛ లభించినట్టైంది. ఇక ఏయే బ్రాండ్స్‌లో యాండ్రాయిడ్ ఓఎస్ ఉందో చూసుకుని తమకు నచ్చినవి ఎంచుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. ప్రత్యామ్నాయ ఓఎస్‌లను, ఇతర సర్వీసులను అభివృద్ధి చేసేందుకు డెవలపర్స్‌కూ ఛాన్స్ దక్కుతుంది.
అయితే, ఆండ్రాయిడ్ టీవీ, ప్లే స్టోర్‌లు కేవలం స్మార్ట్ టీవీలకే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లో ఇవి విస్తృత వినియోగంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామం స్థానిక స్మార్ట్ టీవీ తయారీదార్లకు మేలు చేకూర్చేదే అయినా వినియోగదారులు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల మధ్య అనుసంధానత, సౌకర్యానికి ప్రధాన్యమిస్తూ యాండ్రాయిడ్ టీవీని ఎంచుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరిచినందుకు అమెరికా, ఈయూలో కూడా పలు కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి
ఈసీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రిషీకేశ్‌లో రాఫ్టింగ్.. గంగానదిలో పడి యువకుడి దుర్మరణం
Updated Date - Apr 22 , 2025 | 11:29 AM