Justice BR Gavai: న్యాయవ్యవస్థ తన పరిధి దాటుతోందన్న బీజేపీ నేతలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:32 PM
న్యాయవ్యవస్థ తన పరిధి దాటి కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకుంటోందన్న రాజకీయ నేతల ఆరోపణలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తొలిసారిగా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టు తన పరిధి దాటి కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో జోక్యం చేసుకుంటోందంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై తొలిసారిగా సుప్రీం కోర్టు స్పందించింది. వక్ఫ్ చట్టంపై నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పారా మిలిటరీ దళాలను దింపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Justice BR Gavai judiciary remarks Judicial Overreach).
విష్ణు శంకర్ జైన్ అనే అడ్వకేట్ పశ్చిమ బెంగాల్‌లో చెలరేగుతున్న హింసకు సంబంధించి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పారా మిలిటరీ దళాలను క్షేత్రస్థాయిలో మోహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు కేంద్రానికి సూచనలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ముర్షిదాబాద్‌లో హింస కారణంగా ఎంత మంది హిందువులు ఆ ప్రాంతాన్ని వీడాల్సి వచ్చిందో తెలిపే నివేదికను కూడా అభ్యర్థించారు.
ఈ అభ్యర్థనపై జస్టిస్ బీఆర్ గవాయ్ సూటిగా స్పందించారు. ‘‘పారా మిలిటరీ దళాలను మోహరించాలంటూ రాష్ట్రపతికి మాండమస్ రిట్‌ను మేము జారీ చేయాలని మీరు కోరుతున్నారా? ప్లీజ్.. మేము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి’’ అని తేల్చి చెప్పారు.
సుప్రీం కోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ కాబోతున్న ఒక సీనియర్ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ నేతల అసంతృప్తి సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులపై గవర్నర్ ఆమోదానికి సుప్రీంకోర్టు ఇటీవల కాలపరిమితి విధించిన ఉదంతం రాజకీయంగా కలకలం రేపిన విషయం తెలిసింది. అసెంబ్లీ పంపిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా తొక్కి పెట్టజాలరని జస్టిస్ జీబీ పార్ధీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్టికల్ 142లోని ప్రత్యేక అధికారాల కింద సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
దీనిపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఘాటుగా స్పందించారు. ‘‘సుప్రీం కోర్టు తన పరిధి దాటేసింది. ప్రతి విషయానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వస్తే ఇక పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలను మూసేయడం మంచిది’’ అని అన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కఢ్ కూడా ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. ఆర్టికల్ 142 న్యాయవ్యవస్థకు నిత్యం అందుబాటులో ఉండే ఓ అణ్వాయుధంలా మారిందని వ్యాఖ్యానించారు.
కాగా, తమ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ దూరం జరిగింది. ఇవి వారు వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలని స్పష్టం చేసింది. పార్టీకి వీటితో ఎటువంటి సంబంధం లేదని, ఈ కామెంట్స్‌కు బీజేపీ మద్దతు లేదని పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవల ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి
ఈసీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రిషీకేశ్‌లో రాఫ్టింగ్.. గంగానదిలో పడి యువకుడి దుర్మరణం