ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly Elections 2024: ఎవరిది వెన్నుపోటు

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:20 AM

వైసీపీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పును ‘వెన్నుపోటు’గా అభివర్ణించడం ప్రజాస్వామ్యానికి అపమానమని విమర్శలు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జరిగిన అట్టడుగులు, నిర్బంధాలపై ప్రజా అసంతృప్తి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

  • ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరణ

  • సరిగ్గా ఏడాది కిందట వైసీపీ పాలనకు తెర

  • కూటమి సర్కారుకు పట్టం కట్టిన జనం

  • నేడు ‘వెన్నుపోటు దినం’ అంటున్న వైసీపీ

  • ఒక్క చాన్స్‌ అంటూ వచ్చి ఐదేళ్లు విధ్వంసం

  • నిర్బంధం, కక్ష సాధింపులే అజెండాగా పాలన

  • మద్యం నుంచి ఇసుక దాకా ముడుపులే

  • పశ్చాత్తాపానికి బదులు ప్రజలపైనే జగన్‌ పగ

మోసం, ద్రోహం, పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి, అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది కచ్చితంగా వెన్నుపోటే అవుతుంది. కానీ.. ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీకే చెల్లింది.

  • సరిగ్గా ఏడాది కిందట...

2024 జూన్‌ 4వ తేదీ! ఆ రోజు...

ఐదేళ్ల జగన్‌ పాలన అంతమైన రోజు!

ఐదేళ్ల నిర్బంధానికి తెరపడిన రోజు!

స్వేచ్ఛకు పడిన ‘సర్కారీ సంకెళ్లు’ తెగిన రోజు!

నోరుతెరిచి మాట్లాడలేని భయం మాయమైన రోజు!

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెలువడిన రోజు!

  • కానీ...

ఈ రోజును వైసీపీ ‘వెన్నుపోటు దినం’ అని పిలుస్తోంది!

జనం ఇచ్చిన తీర్పును ‘వెన్నుపోటు’గా అభివర్ణిస్తోంది!

ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తోంది!

అసలు... వెన్నుపోటు ఎవరిది?

2019 ఎన్నికల ముందు అమరావతికి జైకొట్టి

అధికారంలోకి రాగానే మూడుముక్కలాట మొదలుపెట్టిన వాళ్లది కదా!

ఐదు నక్షత్రాల హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం కనిపించకుండా చేస్తామని చెప్పి... అదే మద్యంతో ముడుపుల మూటలు కట్టుకున్న వాళ్లది కదా!

కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో ఐదేళ్లపాటు రాష్ట్రం మొత్తాన్ని భయం అంచున నిలబెట్టిన

నాటి పాలకులది కదా!

వెన్నుపోటు ఎవరిది?

వెన్నుపోటు దినం జరపాల్సింది ఎప్పుడు?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘ప్రజాతీర్పును శిరసావహిస్తాం! మాలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం! నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం!’’... ఎన్నికల్లో ఓటమిపాలైన ఏ పార్టీ అధినేత అయినా చెప్పే మాటలివి! కానీ... వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరే వేరు! గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన ‘జూన్‌ 4’ను ఆయన ‘వెన్నుపోటు దినం’గా జరుపుకొంటున్నారు. తీర్పు చెప్పిన ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనని ప్రజాస్వామ్య వాదులు పేర్కొంటున్నారు.


ఏది వెన్నుపోటు...

మోసం, ద్రోహం, పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి, అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది కచ్చితంగా వెన్నుపోటే అవుతుంది. కానీ.. ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీకే చెల్లింది. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా... 93 శాతం స్ట్రైక్‌ రేటుతో 175 స్థానాలకు 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అతి భారీ మెజారిటీలు కట్టబెట్టారు. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి... ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ఇది... ఐదేళ్ల జగన్‌ అరాచక, నిర్బంధ పాలనపై జనం ఇచ్చిన తీర్పు! దీనినే జగన్‌ ఇప్పుడు ‘వెన్నుపోటు’గా అభివర్ణిస్తున్నారు.

ఐదేళ్ల వెన్నుపోట్ల పాలన...: వెన్నుపోటు దినంగా ప్రకటించాల్సి వస్తే... అందుకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2019 మే 30వ తేదీనే ఎంచుకోవాలని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ‘దేశమంతా మెచ్చుకునేలా పాలన సాగిస్తా’ అని చెప్పిన జగన్‌... ఐదేళ్లపాటు రాష్ట్రంలో నిరంకుశ, అరాచక, విధ్వంసపాలన సాగించారు. జగన్‌, ఆయన అనుచరగణం వెన్నుపోట్లను మచ్చుకు కొన్ని గుర్తు తెచ్చుకుంటే...

  • అధికారం చేపట్టిన వెంటనే ‘ప్రజావేదిక’ను కూల్చివేసి... తన పాలన ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు.

  • జగనన్న కాలనీల పేరుతో ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామంటూ ఊదరగొట్టి... ఎకరం పదీ ఇరవై లక్షలు కూడా చేయని పొలాలను రూ.50 లక్షలకు కొనుగోలు చేసి వందలకోట్లు కుమ్మేశారు. భూముల మెరక పేరుతోనూ డబ్బులు దండుకున్నారు. నివాసయోగ్యం కాని స్థలాలను అప్పగించి పేదలకు వెన్నుపోటు పొడిచారు.

  • మద్యం పాలసీని ముడుపులకు వీలుగా మార్చేశారు. నాసిరకం మద్యంతో వందల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు.

  • నిరుద్యోగులకు దారుణంగా వెన్నుపోటు పొడిచారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి... చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు.

  • ఉద్యోగం అంటే నెలకు రూ.5వేలు ఇచ్చే ‘వలంటీరు’ అనే కొత్త అర్థాన్ని ఇచ్చారు. వారిని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారు.

  • అమరావతికి వెన్నుపోటు పొడిచారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. అప్పటికే జరిగిన వేలకోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఆపివేశారు.

  • పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టారు.

  • రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో విధ్వంసానికి తెరలేపారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి కారణమయ్యారు. ఇతర ప్రాజెక్టులను గాలికొదిలేశారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, ఈ ఘటన దేశానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉందని కేంద్రమే ప్రకటించింది.

  • వ్యవసాయ రంగానికీ జగన్‌ వెన్నుపోటు పొడిచారు. వైసీపీ పాలనలో సుమారు 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూముల రీసర్వే పేరుతో కొత్త చిచ్చు పెట్టారు. దశాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న ఒకరి భూములను మరొకరి ఖాతాల్లో వేసేసి రైతులను క్షోభపెట్టారు.

  • ఇసుకనుంచీ డబ్బు పిండుకున్నారు. జిల్లాల వారీగా నేతలకు క్వారీలు అప్పగించి... వారి నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేశారు.


రాజకీయ అరాచకం...

టీడీపీ కార్యకర్తల నుంచి నేతల దాకా అందరూ జగన్‌ కక్ష సాధింపులకు లక్ష్యమయ్యారు. పైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్న 2 రోజులకే మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శ్రీకాకుళంలో అరెస్టు చేసి సుమారు 450 కి.మీ. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమ హత్య కేసు బనాయించి జైలుకు పంపారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలు పాలు చేశారు. సామాన్యులనూ జగన్‌ వదిలిపెట్టలేదు. కరోనా సమయంలో మాస్క్‌లు ఏవని నిలదీసిన దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ నుంచి... సోషల్‌ మీడియా పోస్టు ఫార్వర్డ్‌ చేసిన వృద్ధురాలు రంగనాయకమ్మ మొదలు ఎందరో బాధితులు. దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్‌ డెలివరీ చేసినా దిక్కులేదు. ఇసుక మాఫియాను నిలదీసిన మరో దళిత యువకుడికి శిరోముండనం చేసినా పట్టించుకోలేదు. అంతెందుకు... కొవ్వూరులో ఇసుక తవ్వుకునేందుకు ప్రతినెలా రూ.25 కోట్లు కట్టలేక వైసీపీకి చెందిన ప్రేమ్‌రాజ్‌ అనే కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి తెచ్చారు.

నిర్బంధం వీడిన రోజు...

2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను ఓర్పుతో భరించిన ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పారు. వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ప్రజల్లో నిగూఢంగా దాగున్న వ్యతిరేకత బద్దలైంది. అది 2024 జూన్‌ 4న ఎన్నికల ఫలితాల రోజున వెల్లడైంది. ఈ రోజును వైసీపీ ‘వెన్నుపోటు దినం’ అంటోంది. వెరసి... ఈ తీర్పును జగన్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారని అర్థమవుతోంది.

Updated Date - Jun 04 , 2025 | 06:11 AM