International Yoga Day: యోగ భాగ్యం..
ABN, Publish Date - Jun 21 , 2025 | 05:48 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగరతీర నగరం ముస్తాబైంది. శనివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ సుమారు 30 కి.మీ. పొడవునా యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేడే యోగాంధ్ర కార్యక్రమం
విశాఖలో ప్రధాన కార్యక్రమం ప్రధాని రాక
సాగర నగరిలో 5 లక్షల మందితో యోగా
ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు నరేంద్ర మోదీ కితాబు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాం: చంద్రబాబు
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం! మన దేశంలో ప్రధాని మోదీ పాల్గొనే ప్రధాన కార్యక్రమానికి విశాఖపట్నమే వేదిక! ప్రధాని మోదీ శుక్రవారమే విశాఖకు విచ్చేశారు. శనివారం సాగర తీరం వెంబడి కిలోమీటర్ల పొడవునా లక్షల మందితో యోగా నిర్వహించి రికార్డులు బద్దలు కొట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వెరసి, దేశం చూపు మొత్తం ఏపీ వైపే!
విశాఖపట్నం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగరతీర నగరం ముస్తాబైంది. శనివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ సుమారు 30 కి.మీ. పొడవునా యోగాసనాలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యాసంస్థలు, మైదానాలు, తదితర ప్రాంతాల్లో దాదాపు 5లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేస్తారు. ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ కొనసాగే ఈ మెగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖ చేరుకున్నారు.
కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీభరత్‌తో మాటామంతీలో మోదీ పాల్గొన్నారు. యోగాంధ్రతో ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేశారని ప్రధాని కొనియాడారు. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ మోదీ ప్రశంసించారు. ప్రధానమంత్రి, ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్‌రోడ్డులో కాళీమాత ఆలయ సమీపంలో ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికకు అభిముఖంగా సముద్రంలో నిలిపిన ఆరు యుద్ధనౌకలపై తూర్పు నౌకాదళం సిబ్బంది యోగాసనాలు వేస్తారు. డార్నియర్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. ప్రముఖుల రాక నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
18 క్రీడా మైదానాల్లో ప్రదర్శనలు
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డుతో పాటు మొత్తం 18 క్రీడా మైదానాల్లో యోగా ప్రదర్శనకు ఏర్పాట్లుచేశారు. ఏయూ మైదానం, చినగదిలి గోల్ఫ్ మైదానం, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, గీతం స్టేడియం, రైల్వే స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా మరికొన్నింటిని గుర్తించారు. వీటికి అదనంగా మరో 30 ప్రాంతాల్లోనూ యోగా చేస్తారు.
లక్షన్నర ప్రదేశాల్లో యోగా: కృష్ణబాబు
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1.5 లక్షల ప్రదేశాల్లో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని యోగాంధ్ర- 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఉదయం విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యకమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు పాల్గొంటారని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రదర్శనలు జరుగుతాయని, ఈ కార్యక్రమంతో సరికొత్త రికార్డు నమోదు కానుందని పేర్కొన్నారు. గతంలో సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో లక్షన్నర మంది యోగా ప్రదర్శనలో పాల్గొని రికార్డు సృష్టించారని, ఇప్పుడు దానిని అధిగమిస్తూ విశాఖలో 3లక్షల మందికి పైగా పాల్గొనేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. శుక్రవారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25వేల మంది సూర్య నమస్కారాలు చేయడం ద్వారా రికార్డు సృష్టించామని తెలిపారు.
మోదీకి ఘన స్వాగతం
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ నుంచి ఐఎన్‌ఎస్ డేగా (నేవీ ఎయిర్‌స్టేషన్)కు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేశ్, వంగలపూడి అనిత, డోలా డీబీవీ స్వామి, నారాయణ, సత్యకుమార్, ఎంపీలు దగ్గుపాటి పురందేశ్వరి, శ్రీభరత్, సీఎం రమేశ్, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్డుమార్గాన తూర్పు నౌకాదళం ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని ఐఎన్‌ఎస్ చోళాలో బస చేశారు.
భారీగా ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా ప్రదర్శనకు భారీగా ఏర్పాట్లు చేశారు. గిన్నిస్ రికార్డు నెలకొల్పే దిశగా ఒక్క బీచ్ రోడ్డులోనే 3.6 లక్షల మందితో యోగాసనాలు వేయించాలనేది లక్ష్యం. ఇందుకోసం ఈ ప్రాంతాన్ని 326 కంపార్టుమెంట్లుగా విభజించారు. ఆర్‌కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకూ ప్రతి కంపార్టుమెంట్‌కు కేవలం 1,000 మందినే అనుమతిస్తారు. వాటిలో తర్ఫీదు పొందినవారు మాత్రమే యోగాసనాలు వేస్తారు. ఇక వుడా పార్క్ నుంచి భీమిలి వరకూ మిగిలిన కంపార్టుమెంట్లను రెండు రకాల సైజుల్లో సిద్ధం చేశారు. ఒకదానిలో 672 మంది, మరోదానిలో 1,350 మంది పడతారు. ఎవరెవరు ఏయే కంపార్టుమెంట్‌ల్లోకి వెళ్లాలనేది వార్డు, గ్రామ సచివాలయాలతో మ్యాపింగ్ చేశారు. సచివాలయాల సిబ్బందికి వారిని తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించారు. ప్రతి కంపార్టుమెంట్‌కు గెజిటెడ్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్, ముగ్గురు యోగా డిమాన్‌స్ట్రేటర్లు, పది మంది వలంటీర్లు, తాగునీటి సరఫరాకు ఒక ఇన్‌చార్జి, ఆహారం సరఫరాకు ఒకరు, పర్యవేక్షణకు ఇద్దరు సూపర్‌వైజర్లు, శానిటేషన్‌కు నలుగురు, రెండు టాయిలెట్లకు ఒకరు చొప్పున క్లీనర్, ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశ వర్కర్, నలుగురు కలాసీలను కేటాయించారు. వీరంతా ఆ కంపార్టుమెంట్‌లో ఆసనాలు వేసే వారికి సేవలు అందిస్తారు.
నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
అమరావతి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం వరకే బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు యోగా నిర్వహించాలని, ఆ ఫొటోలను లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. 8 నుంచి 9గంటల వరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందించాలని, 9 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించి, మధ్యాహ్న భోజనం తర్వాత పాఠశాలలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
Updated Date - Jun 21 , 2025 | 05:48 AM