Supreme Court: ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది
ABN, Publish Date - May 06 , 2025 | 03:54 AM
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్థానం, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది.
స్వేచ్ఛగా నడుచుకోవచ్చు.. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సహా ముగ్గురికి షాక్
ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ.. అరెస్టు నుంచి
రక్షణకు కూడా తిరస్కృతి.. లాయర్ తీరుపై అసహనం
నిర్ణయాధికారం హైకోర్టుదేనని వ్యాఖ్య.. ఏదొక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
‘‘తన పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బుధవారం విచారణలో హైకోర్టు ఏదొక నిర్ణయం తీసుకోవాలి. ఈ కేసులో ఇంతకుమించి కామెంట్స్ చేయడం లేదు. నిర్ణయాధికారం హైకోర్టుదే’’
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు కీలక నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వేచ్ఛగా నడుచుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరడంతో హైకోర్టు ధర్మాసనం కేసును ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే, ఆ ముగ్గురు ఈ నెల 2వ తేదీన సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కొనుగోళ్లతో తమకెలాంటి సంబంధమూ లేదని, ఉద్దేశపూర్వకంగానే తమను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఆ మూడు పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
అయితే, ముందస్తు బెయిల్ కోసం ఎప్పుడు పిటిషన్లు దాఖలు చేశారు? కోర్టు ప్రత్యర్థులకు నోటీసులేమైనా జారీ చేసిందా? అని జస్టిస్ పార్దివాలా పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. హైకోర్టు తమ వాదనలు వినడంలేదని, అందుకే ఈ నెల 2న సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు వారు బదులిచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహిత్గీ కలుగజేసుకుని, హైకోర్టులో ఈ నెల 7న ఇదే అంశంపై విచారణ జరగనుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారమే హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం ఆసక్తి చూపలేదు. అరెస్టు చేయకుండా ఉండేందుకు స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో బుధవారమే విచారణ ఉంది కదా? అని మరోసారి జస్టిస్ పార్టివాలా ప్రశ్నించగా, అప్పటిలోగా అరెస్టు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పాలని న్యాయవాదులు పట్టుబట్టారు. ఈ క్రమంలో జస్టిస్ పార్దివాలా అసహనం వ్యక్తం చేశారు. అలా ఆదేశాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించారు. ఈ కేసులో ఇంతకుమించి ఎలాంటి కామెంట్స్ చేయడం లేదని, నిర్ణయాధికారం హైకోర్టుదేనని బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 8న చేపడతామని పేర్కొంది.
Updated Date - May 06 , 2025 | 03:55 AM