Simhachalam: అడ్డగోలుగా కట్టేశారు
ABN, Publish Date - May 02 , 2025 | 04:50 AM
సింహాచలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రాయింగ్ లేకుండా, సిమెంట్ పిల్లర్లే లేకుండా నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ప్లాన్ లేకుండా, ఆమోదాలు లేకుండా, హడావిడిగా నిర్మాణం చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది.
డ్రాయింగ్ లేదు..ఉత్తర్వులూ లేవు
నోటి మాటతోనే అంతెత్తు గోడ కట్టారు
సిమెంట్ పిల్లర్లు లేకుండానే ‘మమ’
ఈవో ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోని కమిషనర్
అయినా హడావుడిగా 5 రోజుల్లో నిర్మాణం పూర్తి
సింహాచలంలో ఇంజనీరింగ్ విభాగం నిర్వాకమిదీ
ప్లాన్ మార్చారు.. ప్రాణాలపైకి తెచ్చారు : విచారణ కమిటీ
(విశాఖపట్నం,అమరావతి-ఆంధ్రజ్యోతి)
సింహాచలంలో దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి చందనోత్సవం వేళ జరిగిన పెను విషాదం పరాకాష్ఠగా నిలిచింది. ఏడుగురి ప్రాణాలు బలి తీసుకున్న రిటైనింగ్ వాల్ (సంరక్షణ గోడ) నిర్మాణానికి ఎటువంటి అధికారిక ఉత్తర్వులూ లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి ఇంజనీరింగ్ అధికారులు డ్రాయింగ్ కూడా గీయలేదు. చందనోత్సవం నిర్వహిస్తున్నందున అక్కడ అత్యవసరంగా గోడ నిర్మించాలని, వెంటనే పనులు చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. ఆ నోటి మాట ప్రకారం కాంట్రాక్టర్ రాత్రికి రాత్రి పనులు చేపట్టి నాలుగు రోజుల్లో పూర్తిచేశారు. గోడ నిర్మాణం చేపట్టాలంటే నిబంధనల ప్రకారం మధ్యలో కనీసం రెండు సిమెంట్ స్తంభాలైనా నిర్మించాల్సి ఉంది. కానీ ఒక్క సిమెంట్ స్తంభం కూడా వేయకుండా, సిమెంట్ ఇటుకలు పేర్చేసి మమ అనిపించారు. ఆ గోడ పక్క నుంచే రూ.300 టికెట్ క్యూలైన్ ఏర్పాటుచేశారు. నాణ్యత లేకుండా నిర్మించిన ఆ గోడ వర్షానికి నాని కూలిపోయింది. అమాయకులైన భక్తులు బలి అయిపోయారు.
ప్రతిపాదనలను ఆమోదించకముందే..
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ‘జోడుభద్రాలు’గా వ్యవహరిస్తారు. కొండ పైనుంచి స్వామివారిని ఊరేగింపుగా ఆ మార్గంలోనే కిందికి మెట్ల మార్గం ద్వారా తీసుకువస్తారు. ఉత్సవం నేపథ్యంలో అటు వైపు రాకపోకలు సాగించడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని వైదిక పెద్దలు కోరగా, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు ఆ పనులను ‘ప్రసాద్’ పథకం కింద చేయాలని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థను కోరారు. వీటి ఆమోదం కోసం ఈవో త్రినాథ్ (సెలవుపై అమెరికా వెళ్లారు) ఫైల్‌ను విజయవాడ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌కు పంపించారు. దానిని వారు ఇంకా పరిశీలించలేదు. ఆమోదం తెలపలేదు. అయితే ఉత్సవం ఉన్నందున వెంటనే గోడ నిర్మాణం పూర్తిచేయాలని దేవస్థానం అధికారులు కోరడంతో ఏపీటీడీసీ అధికారులు కాంట్రాక్టర్‌తో చేయించారు. ఈ పనులను దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలి. కానీ వారు ఆ పని చేయలేదు. ఏపీటీడీసీ ఇంజనీర్లు కూడా చూసుకోవాలి. వారూ పరిశీలించలేదు.
నిబంధనలు పాటించకుండా, నాణ్యత లేకుండా పూర్తిచేశారు. గత వారం రోజులుగా ఇక్కడే ఉన్న దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడా తాను ఆమోదం ఇవ్వని పనులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించలేదు. ప్రస్తుతం ఆలయ ఇన్‌చార్జిఈవోగా సుబ్బారావు ఉన్నారు. ఆయనను పక్కన పెట్టుకొని ఉత్సవాన్ని కొందరు పెద్దలే నిర్వహించారు. ఇప్పుడు తప్పు జరగడంతో నెపం ఎవరిపైకి నెట్టాలా? అని చూస్తున్నారు. కొందరు కలెక్టర్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ‘ప్రసాద్’ పనులను గత ఆరు నెలల్లో నాలుగుసార్లు సమీక్షించిన కలెక్టర్‌కు ఈ విషయం తెలియదా?...అని వాదిస్తున్నారు. ఈ గోడ నిర్మాణం పని ఐదు రోజుల క్రితం చేపట్టారు. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పలేదు. దేవస్థానం రోజువారీ వ్యవహారాలు, ఉత్సవం పనులు ఈవో, ఇంజనీరింగ్ అధికారులు చూసుకుంటారు. క్యూలైన్లు, వసతులు వంటి ఏర్పాట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షించారు. అందులో ఈ గోడ విషయం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. చందనోత్సవం బుధవారం జరుగుతుందనగా, కలెక్టర్ మంగళవారం కూడా కొండపైకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. అప్పుడు అక్కడకు ఈవో గానీ, దేవదాయ శాఖ కమిషనర్ గాని రాలేదు. ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. ఇది కూడా ఆ రోజు చర్చనీయాంశంగా మారింది.
కాంక్రీట్ పిల్లర్లు లేకుండా గోడ ఎలా కట్టారు?
అనుమతులు తీసుకున్నారా? .. నాణ్యతకు సంబంధించిన పరీక్షలు చేయించారా?
అధికారులను ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ
బదులివ్వలేకపోయిన పర్యాటక, దేవదాయ శాఖల ఇంజనీర్లు
సింహగిరిపై గోడకూలిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ గురువారం విచారణను ప్రారంభించింది. మునిసిపల్ పరిపాలన, అర్బన్ డెవల్‌పమెంట్ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ చైర్మన్‌గా, ఐజీ ఆకే రవికృష్ణ, నీటి పారుదల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి 72 గంటల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీంతో గురువారం ఉదయం విచారణ కమిటీ సింహగిరికి చేరుకుని తొలుత వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంది. అనంతరం ఘటనా స్థలికి చేరుకుని దేవదాయ శాఖ, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులను విచారించింది. గోడ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు?, ఎన్ని రోజుల్లో పూర్తిచేశారు? ప్రణాళికలో అందుకు సంబంధించిన ప్లాన్ ఉందా? గోడ నిర్మాణానికి దేవదాయ శాఖ లేదా పర్యాటక శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉన్నాయా? గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజనీర్లు ఎవరు? నాణ్యతకు సంబంధించిన పరీక్షలు చేయించారా? అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉందా? అంటూ ప్రశ్నించారు. గోడ నిర్మాణంలో కనీస నిబంధనలుగా చెప్పబడే కాంక్రీట్ పిల్లర్లు లేకపోవడం గురించి కమిటీ చైర్మన్ ప్రశ్నించగా, పనులు పర్యవేక్షించిన పర్యాటక శాఖ డీఈఈ స్వామి సరైన బదులివ్వలేక నీళ్లు నమిలారు.
దేవదాయ శాఖ అధికారులను ఇదే విషయం ప్రశ్నించగా, ప్రతిపాదనలు కమిషనర్‌కు పంపామని, ఉత్సవం సందర్భంగా తాత్కాలిక గోడ నిర్మించాల్సి వచ్చిందని బదులిచ్చారు. అసలు ఎటువంటి ప్లాన్ లేకుండా అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేపట్టారని కమిటీ చైర్మన్ నిలదీశారు. ఉత్సవం పేరుతో తొందర పెట్టడంతో నిర్మాణం చేపట్టానని, దానికి అధికారుల మౌఖిక అదేశాలు మినహా ఎటువంటి ప్లాన్ కానీ ఉన్నతాధికారుల అనుమతులు కానీ లేవని కాంట్రాక్టర్ బదులిచ్చారు. అనంతరం కాటేజీకి వెళ్లి అధికారులతో కమిటీ విచారణ కొనసాగించింది.
ప్లాన్ మార్చారు..
ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన నిర్మాణాల ప్లాన్‌ను దేవదాయ శాఖ అధికారులు పూర్తిగా మార్చేశారు. కాంట్రాక్టర్‌కు ముందు ఇచ్చిన ప్లాన్‌కు ఇప్పుడు నిర్మాణాలు చేస్తున్న ప్లాన్‌కు సంబంధం లేదు. గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన విచారణ కమిటీ ఈ విషయం గుర్తించింది. ఎక్కడైతే గోడ కూలిందో అక్కడ స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయంలోకి తీసుకువెళ్లేందుకు మెట్ల మార్గం ఉంది. ఈ మార్గాన్ని రెండు చేయాలని దేవదాయ శాఖ అధికారులు కాంట్రాక్టర్‌కు చెప్పారు. అప్పుడు ప్లాన్‌లో గోడ నిర్మాణం లేదు. అయితే, మెట్ల విషయంలో మార్పును అర్చకులు, వైదిక కమిటీ అంగీకరించలేదు. అయినా, కుడి, ఎడమ వైపు మెట్ల నిర్మాణం చేశారు. వాటి మధ్య ఖాళీలో హడావిడిగా గోడ కట్టారు. ఆ గోడే భక్తులపై కూలిందని విచారణ కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇవే వివరాలను నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదించాయి.
చేయనంటే ఒత్తిడి పెట్టారు: కాంట్రాక్టర్
‘చందనోత్సవం సందర్భంగా జోడుభద్రాలు వద్ద గోడ నిర్మించాలని అధికారులు కోరారు. ఇంత తక్కువ సమయంలో నేను కట్టలేనని, చేయనని చెప్పాను. కానీ దేవస్థానం, పర్యాటక శాఖల అధికారులు ఒత్తిడి పెట్టడం వల్లే చేశాను.’ అంటూ ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు గురువారం త్రిసభ్య కమిటీ ముందు వెల్లడించారు. ఘటన జరిగిన స్థలంలోనే త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. ఎవరు ఒత్తిడి పెట్టారని అధికారులు గుచ్చి గుచ్చి అడిగితే.. దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ వైపు ఆయన చూపించారు.
ఆ గోడలో దమ్ము లేదు
టెంట్ వేయడానికి మేకులు
దీంతో మరింతగా బలహీనం
సబ్ కాంట్రాక్టర్‌తో హడావిడిగా పనులు
ప్రభుత్వానికి నివేదించిన నిఘా వర్గాలు
సింహగిరిపై జరిగిన దుర్ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి గోడ నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే కారణమని నిఘా వర్గాలు తేల్చినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక పంపినట్టు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిఘా వర్గాలు పంపిన నివేదికలో వివరాలిలా ఉన్నాయి. కొండ పైనుంచి వర్షం నీరు రాకుండా ఉండేందుకు మెట్లకు ఆనుకుని గోడ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. గోడ నిర్మాణం పనిని కాంట్రాక్టర్ ఆగమేఘాల మీద పూర్తిచేసి గత నెల 28న దేవస్థానం అధికారులకు అప్పగించారు. చందనోత్సవం రోజు రూ.300 టిక్కెట్ల క్యూలో వేచి ఉండే భక్తులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్‌లను ఏర్పాటుచేశారు.
టెంట్ ఏర్పాటుకోసం కొత్తగా కట్టిన గోడకు మేకులు కొట్టి కర్రలు పెట్టారు. అప్పుడే కట్టిన గోడ కావడంతో అది కొంత బలహీనపడింది. అదే సమయంలో వర్షం కురవడం, గాలి కూడా వీయడంతో క్యూలైన్‌పై ఏర్పాటుచేసిన టెంట్ గాలికి పైకి లేచిపోవడంతో గోడకు మేకులు కొట్టి వేసిన కర్రలు ఊగసాగాయి. మరోవైపు గోడ అడ్డుగా ఉండడంతో కొండపై నుంచి వచ్చే వర్షం నీరు గోడ పునాదుల నుంచి కిందకు ప్రవహించింది. దీనివల్ల గోడ మరింత బలహీనమై ఒక్కసారిగా క్యూలైన్‌లో ఉన్న వారిపై కూలిపోయింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను మరొకరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చారని కూడా నిఘా అధికారులు నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ
Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్
Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి
Updated Date - May 02 , 2025 | 04:50 AM