AP SC sub-categorization: వర్గీకరణకు జై డీఎస్సీకి సై
ABN, Publish Date - Apr 18 , 2025 | 03:50 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కి మార్గం సుగమమవ్వగా, వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు చేశారు.
ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ 20 లేదా 23న నోటిఫికేషన్?
అమల్లోకి వచ్చిన వర్గీకరణ
కేబినెట్ తీర్మానించిన రెండు రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర
డీఎస్సీ నోటిఫికేషన్‌కు మార్గం సుగమం
16,347 టీచరు పోస్టుల భర్తీకి శ్రీకారం
నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు
వయోపరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట
42 నుంచి 44 ఏళ్లకు పెంపు
స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా విడుదల కానున్న ప్రకటన
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేసింది. దీనిపై ఆర్డినెన్స్ జారీ అయింది. ఎస్సీ కులాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ, దానికి అనుగుణంగా రిజర్వేషన్లను పంచే ‘వర్గీకరణ’పై గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి వచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో... మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమమైంది. ఈనెల 20 లేదా 23వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వెంటనే గవర్నర్ ఆమోదానికి పంపింది. గురువారమే గవర్నర్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల ఉప వర్గీకరణ ఆర్డినెన్స్ - 2025 జారీ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున, వర్గీకరణను వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినందున ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం గ్రూప్-1 కేటగిరీకి చెందిన రెల్లి, 12 ఉపకులాలకు ఒక శాతం... గ్రూప్-2కు చెందిన మాదిగ, 18 ఉప కులాలకు 6.5 శాతం... గ్రూపు-3కు చెందిన మాల, 29 ఉప కులాలకు 7.5 శాతం చొప్పున, మొత్తం 15 శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు. మూడు ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అవలంబిస్తారు. ఈ విధానాన్ని ఒక్కొక్కటి 1 నుంచి 100 సంఖ్యతో రెండు సైకిల్స్ అమలు చేయాలి. ఆర్డినెన్స్ జారీ నేపథ్యంలో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం సచివాలయానికి వచ్చి సీఎస్ విజయానంద్‌కు ఽకృతజ్ఞతలు తెలియజేశారు.
డీఎస్సీకి రెడీ.. నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్‌తో లైన్‌క్లియర్ అయ్యింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డీఎస్సీపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసిన వెంటనే నోటిఫికేషన్ జారీచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23 మంచి రోజులు కావడంతో... ఆ తేదీల్లోనే నోటిఫికేషన్ జారీచేయాలని భావిస్తున్నారు.
నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనే జిల్లాలవారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డీఎస్సీతో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వయోపరిమితి పెంపు
డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత గరిష్ఠ వయోపరిమితి ప్రస్తుతం 42ఏళ్లుకాగా దానిని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డీఎస్సీకి మాత్రమే వరిస్తుందని స్పష్టంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 03:59 AM