Rain Alert: నేడు సీమ, ఉత్తర కోస్తాలో వర్షాలు
ABN, Publish Date - May 02 , 2025 | 04:53 AM
రాజస్థాన్ నుంచి కేరళ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించడంతో, కోస్తా, రాయలసీమలో గురువారం వర్షాలు కురిశాయి. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగుతో కూడిన వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 41-42.5 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది
అమరావతి, విశాఖపట్నం, మే 1(ఆంధ్రజ్యోతి): రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరట్వాడా, కర్ణాటక మీదుగా కేరళ వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా గురువారం వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 54, కడప జిల్లా అట్లూరులో 36.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా దరిమడుగులో 42.4, కడప జిల్లా ఖాజీపేటలో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో భిన్నవాతావరణం నెలకున్న నేపథ్యంలో శుక్రవారం కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పగటి ఉష్ణోగ్రతలు 41-42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Updated Date - May 02 , 2025 | 04:53 AM