ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Rights: విద్యాహక్కు కు తూట్లు

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:31 AM

విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి.

  • 1,682 ఆర్టీఈ సీట్లు తిరస్కరణ

  • ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు

  • విద్యార్థులకు రెండో విడతలో సీట్లు

  • అడ్మిషన్లు తిరస్కరిస్తే గుర్తింపు రద్దు

  • స్కూళ్లకు సమగ్రశిక్ష ఎస్పీడీ హెచ్చరిక

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి. విద్యాహక్కు చట్టం కింద ఇటీవల పాఠశాల విద్యాశాఖ తొలి విడతలో 23,118 మందికి ఒకటో తరగతిలో సీట్లు కేటాయించింది. నిబంధనల ప్రకారం సీటు పొంది, ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా 1,682 మంది అడ్మిషన్లను కొన్ని పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌ అయుంది. విద్యాహక్కు చట్టం సీట్లను తిరస్కరించిన పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

సీట్లు ఎందుకు తిరస్కరించారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇకపై సీట్లు తిరస్కరిస్తే ఆ పాఠశాలల గుర్తింపు రద్దుచేస్తామని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు హెచ్చరించారు. చట్టప్రకారం సీట్లు కేటాయిస్తే తిరస్కరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాఠశాల విద్య జిల్లాల అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో 45 మంది, తూర్పుగోదావరిలో 38, కాకినాడలో 730, కర్నూలులో 769, నంద్యాలలో ఒకరు, ఎన్టీఆర్‌లో ఐదుగురు, శ్రీసత్యసాయిలో ఇద్దరు, తిరుపతిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, విజయనగరంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో 78 మంది విద్యార్థుల అడ్మిషన్లను పాఠశాలలు తిరస్కరించాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

చట్టమంటే లెక్కలేదా?

2011లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు పాఠశాలలు 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రైవేటు బడులు అడిగినంత కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే చెల్లిస్తారు. రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి ఈ చట్టం సీట్ల కేటాయింపు అమల్లోకి వచ్చింది. అప్పటినుంచీ ప్రైవేటు పాఠశాలలు ఈ కోటాలో సీట్లు కేటాయించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. చిన్న, మధ్య తరహా బడులు సక్రమంగానే అడ్మిషన్లు ఇస్తున్నా, భారీగా ఫీజులు వసూలు చేసే కొన్ని పాఠశాలలకు ఈ విధానం మింగుడు పడటం లేదు. రెండు ప్రధానమైన కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్లతో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని డీఈవోలు చెబుతున్నారు.

రెండో విడతలో 8,583 మందికి సీట్లు

ఈ సంవత్సరం ఆర్టీఈ సీట్ల కోసం 37,427 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 29,481 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడత లాటరీలో 23,811 మందికి సీట్లు కేటాయించారు. వారిలో 15,541 మంది ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. 161 మంది సహేతుకమైన కారణాలతో అడ్మిషన్లు పొందలేకపోయారు. కొందరు తల్లిదండ్రులు సీటు వచ్చినా తమ పిల్లల్ని చేర్చలేదు. ఇక పాఠశాలలు తిరస్కరించడంతో 1,682 మంది సీట్లు పొందలేకపోయారు. వారందరికీ రెండో విడతలో సీట్లు కేటాయించారు. వీరితో కలిపి రెండో విడత లాటరీలో 8,583 మందికి సీట్లు లభించాయి. వారిలో ఇప్పటివరకూ 7.33 శాతం మంది సీట్లు పొందారు.

ఖరారు కాని ఫీజులు

విద్యాహక్కు చట్టం ఫీజులను గత వైసీపీ ప్రభుత్వం చాలా తక్కువగా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్‌ ఇచ్చి గరిష్ఠంగా రూ.13వేలు ఫీజు ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అందుకు అంగీకరించడం లేదు. రూ.20 వేలకు పైగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఫీజులు ఎంత అనేది ఇంకా ఖరారు కాలేదు.

Updated Date - Jun 27 , 2025 | 05:31 AM