ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD Goshala: గోశాలపై గోల

ABN, Publish Date - Apr 18 , 2025 | 03:36 AM

తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. భూమనకు గోశాల సందర్శనలో ఆటంకం కలగడంతో తీవ్ర ఆరోపణలు, నిరసనలు చోటుచేసుకున్నాయి.

ప్రదర్శనగా బయలుదేరిన భూమన

నేతలు మాత్రమే రావాలన్న పోలీసులు

రోడ్డుపై పడుకుని భూమన నిరసన

‘నిర్బంధం’ అంటూ హడావుడి

పోలీసుల నిబంధనలు పాటిస్తూ

గోశాలకు వెళ్లిన కూటమి నేతలు

తమలాగే రావాలని భూమనకు ఫోన్‌

మళ్లీ బల ప్రదర్శనకు వైసీపీ ప్రయత్నం

తిరుపతిలో రోజంతా హైడ్రామా

తిరుపతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై అటు వైసీపీ, ఇటు కూటమి నేతల మధ్య ‘సవాళ్లపర్వం’ నడిచింది. దీనిపై గురువారం తిరుపతిలో హైడ్రామా నెలకొంది. పోలీసుల సూచన మేరకు కూటమి నేతలు మాత్రమే గోశాల సందర్శనకు వెళ్లగా... టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మందీ మార్బలంతో ప్రదర్శనగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయంటూ భూమన ఆరోపించడంతో... గోశాలకు వచ్చి చూడాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. దీనికి స్పందించిన భూమన తాను గురువారం వస్తానని ప్రకటించగా, దీనిని కూటమి నేతలు స్వాగతించారు. అయితే... ‘ఒకేసారి రెండు పార్టీల నేతలు గోశాలకు వెళ్లకూడదు. మందీమార్బలంతో కాకుండా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మాత్రమే రావాలి’ అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధనరాజు స్పష్టం చేశారు. కూటమి, వైసీపీ నేతలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించారు. అధికార పార్టీ నేతలు దీనిని పాటించగా, మందీమార్బలంతో బయలుదేరిన వైసీపీ నేతలు హైడ్రామా నడిపించారు.

భారీ ప్రదర్శనగా...

గురువారం ఉదయం వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భూమన నివాసానికి చేరుకున్నారు. వారందరితో కలిసి భూమన ప్రదర్శనగా ఎస్వీ గోశాలకు బయలుదేరారు. ఇంతమందిని అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. గోశాలలోకి ప్రవేశాన్ని అడ్డుకోబోమని, అయితే ఐదుగురు, వారి వ్యక్తిగత గన్‌మెన్‌కు మాత్రమే అనుమతి ఉందని ముందస్తుగా జారీ చేసిన ఆదేశాలను గుర్తుచేశారు. గోశాల వద్దకు గుంపులుగా రావద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, తమను గోశాలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తన ఇంటి ముందే నేతలు, శ్రేణులతో కలిసి భూమన రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ‘మీ సవాల్‌కు స్పందించి నేను గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి చెప్పారు.

గోశాలకు రమ్మని భూమనకు సవాల్‌ విసిరి.. చివరకు ఆయన వెళ్లే సమయానికి అడ్డుకుంటారా అంటూ రోజా తదితరులు విమర్శించారు. పలువురు నేతలు రాజకీయ ఆరోపణలు చేశారు. ఈ విధంగా 45 నిమిషాలకుపైగా నిరసన కొనసాగించారు. భూమనను హౌస్‌ అరెస్టు చేశారంటూ వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. తాము ఎవరినీ నిర్బంధించలేదని... గోశాలకు ప్రదర్శనగా వెళ్లేందుకు మాత్రమే నిరాకరించామని స్పష్టం చేశారు.


గోశాలకు వెళ్లిన కూటమి నేతలు

మరోవైపు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు(తిరుపతి), పులివర్తి నాని (చంద్రగిరి), బొజ్జల సుధీర్‌ రెడ్డి(శ్రీకాళహస్తి), మురళీకృష్ణ (పూతలపట్టు), థామస్‌ (గంగాధర నెల్లూరు), గురజాల జగన్మోహన్‌ (చిత్తూరు)తోపాటు టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, జనసేన, బీజేపీ నేతలు ఉదయం 9.10గంటలకు గోశాల చేరుకున్నారు. ఆవులను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వీరు గోశాలలో ఉన్నంతసేపూ పోలీసు యంత్రాంగం వెన్నంటే ఉంది. గోశాల నుంచే ఎమ్మెల్యేలు నాని, సుధీర్‌ రెడ్డి భూమనకు ఫోన్‌చేసి ఆహ్వానించారు. అసత్య ఆరోపణలు చేసి ఇంట్లో ఉండటం కాదని, గోశాలకు రావాలని కోరారు. అప్పటికే నిరసన నుంచి ఇంట్లోకి వెళ్లిన భూమన.. మళ్లీ భారీగా శ్రేణులతో కలిసి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల చాలెంజ్‌పై తాను స్పందించానని, వారు అక్కడ ఉన్నప్పుడే తనను అనుమతించాలని భూమన పోలీసులను కోరారు. మధ్యాహ్నం 1.26గంటలకు కూటమి ఎమ్మెల్యేలు, నేతలు గోశాల సందర్శన పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, భూమన సవాల్‌ను స్వీకరించి తాము వచ్చామని, గోశాలపై వైసీపీ నేతల ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని విమర్శించారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని నేతలు ఆరోపించారు.

గోడ దూకి వచ్చా: ఎంపీ గురుమూర్తి

ఇదిలా ఉంటే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి మాత్రం గోశాలకు చేరుకున్నారు. గోశాలకు రాకుండా కరుణాకర్‌ రెడ్డిని అడ్డుకున్నారని, తాను వేరేదారిలో గోడదూకి రావాల్సి వచ్చిందని ఎంపీ చెప్పారు. కారులో నేరుగా గోశాలకు వచ్చి గోడదూకి వచ్చానని చెప్పడమేంటని కూటమి ఎమ్మెల్యేలు నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలారు. గోడ దూకి రావడం అంటే ప్రధాన గేటు నుంచి కాకుండా వేరే గేటు నుంచి వచ్చానని సమర్థించుకున్నారు. మీతోపాటు ఒక వైసీపీ కార్పొరేటరు కూడా దర్జాగా గోశాలకు వచ్చినప్పుడు కరుణాకర్‌ రెడ్డి రావడానికి అడ్డంకులు ఏమిటని కూటమి నేతలు నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో ఎస్పీ జోక్యం చేసుకుని ఎంపీని అక్కడినుంచి పంపేశారు. తర్వాత కొద్దిసేపటికి కూటమి ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


జగన్‌.. మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: దారూనాయక్‌

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు ఎం.దారూనాయక్‌ అన్నారు. ‘వైసీపీని ప్రజలు ఛీ కొట్టడంతో జగన్‌ తన ఉనికిని చాటుకోవడానికి కుల రాజకీయాలకు తెరదీశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌ మరణాన్ని హత్యగా చిత్రీకరించి క్రిస్టియన్‌లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. తిరుమలలో గోవులు చనిపోయాయంటూ మరో కుట్రకు తెర లేపారు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో ద్వంద్వ వైఖరి అవలంభించి తిరిగి ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వైసీపీ నాయకులు కుట్రలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదు’ అని దారూనాయక్‌ హెచ్చరించారు.

పోలీసులు అనుమతించలేదు: భూమన

గోశాలకు తనను పోలీసు అధికారులు అనుమతించలేదని మీడియా సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. తనను అర్ధరాత్రి నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మించిపోయింది లేదని రేపు, ఎల్లుండి ఎప్పుడు రమ్మన్నా కేవలం ఐదుగురితోనే వస్తామని, గోశాలలో పూడ్చిపెట్టిన గోవులను చూపెడతామని భూమన పేర్కొన్నారు.


ఐదేళ్లు దోచుకున్న భూమన, వైవీ

శ్రీవారిని అపకీర్తిపాలు చేసేందుకు అసత్య ఆరోపణలు: ఎంఎస్‌ రాజు

మడకశిర టౌన్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఐదేళ్లపాటు దోచుకొన్న భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి శ్రీవారిని అపకీర్తి పాలు చేసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఆయన మాట్లాడారు. ‘‘టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన అసత్య ఆరోపణలు చేశారు. వైసీపీ ఉనికిని కాపాడుకునేందుకు తిరుపతిలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. నీతి, నిజాయతీ, దమ్మున్న వ్యక్తి అయితే కూటమి ఎమ్మెల్యేల సవాలును స్వీకరించేవారు. గోశాలను పరిశీలించేందుకు అనుమతి ఇస్తామని, పేర్లు ఇవ్వాలని తిరుపతి ఎస్పీ, డీఎస్పీ చెప్పినా, రాజకీయం చేసేందుకే గురువారం రోడ్లపై నిరసనకు దిగారు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీవారిపట్ల గౌరవం పెంచేందుకు, వైసీపీ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను సరిచేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. మాజీ మంత్రి రోజా ఒక మహిళ అయి ఉండి ‘ఆడంగి వెధవలు’ అని సంబోధించడం భావ్యం కాదు. గోవులు మరణించాయని అసత్య ప్రచారాలు మానుకోవాలి. శ్రీవారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి దోచుకున్న వారికి కాలం తగిన బుద్ధి చెబుతుంది’’ అని ఎంఎస్‌ రాజు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 03:36 AM