Pilli Manikyala Rao: సింగయ్య భార్యతో నేర రచయితల స్ర్కిప్ట్ చదివిస్తారా
ABN, Publish Date - Jul 03 , 2025 | 07:06 AM
జగన్‌రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. సింగయ్య మృతి కేసుతోపాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదు అని పిల్లి మాణిక్యాలరావు అన్నారు.
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. సింగయ్య మృతి కేసుతోపాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదు’ అని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలా జగన్ వ్యవహరించాడనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్ర్కిప్ట్ చదివించారు. ఆమె అబద్ధాలు మాట్లాడలేక తడబడుతుంటే పక్కన వైసీపీ మూకలు లోకేశ్ మనుషులు వచ్చి బెదిరించారని చెప్పాలంటూ స్ర్కిప్ట్ చదివిస్తున్నారు. జగన్‌రెడ్డి ఎంత దుర్మార్గుడో వివేకా హత్య కేసు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా?’ అని ప్రశ్నించారు.
సింగయ్య మృతిలో కుట్ర: వర్ల రామయ్య
‘సింగయ్య మృతిలో కుట్ర ఉంది. సమగ్ర దర్యాప్తు జరిగితే కుట్ర బయటపడుతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే కోర్టులను ఆశ్రయిస్తున్నారు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్ పల్నాడు పర్యటనలో మానవత్వాన్ని కోల్పోయారు. ఆయన నిర్లక్ష్యానికి దళిత వృద్ధుడు బలయ్యాడు. జరిగిన నేరమంతా డ్రైవర్ మీద తోసేయాలని చూస్తున్నారు. అతను ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు జగన్ రెడ్డే’ అని వర్ల అన్నారు. కాగా, తన కారు కిందపడి చనిపోయిన సొంత పార్టీ కార్యకర్త సింగయ్య కుటుంబంతో జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సింగయ్య భార్యను అడ్డంపెట్టుకుని తాడేపల్లి పెద్దలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఆమెను వైసీపీ వారు బెదిరించి అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 07:06 AM