Pawan Kalyan, Deputy CM: పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:59 AM
మాది మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం.. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం గుర్తుపెట్టుకోండి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అధికారం పోయినా వారిది రౌడీయిజమే
అసాంఘిక చర్యలను అసలు సహించం
మాది మంచి ప్రభుత్వం.. మెతకది కాదు
మళ్లీ ఆ ప్రభుత్వం రావడం కల్ల
మా ఐక్యతను ఎవరూ చెడగొట్టలేరు
తాటాకు చప్పుళ్లకు భయపడం
అధికారం పోయినా వారిది రౌడీయిజమే
విపక్షంలో ఉన్నా మూర్ఖపు వైఖరి మారలేదు
కూటమి కనీసం 15-20 ఏళ్లుండాలి
‘సుపరిపాలనలో తొలి అడుగు’లో తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ‘మాది మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం.. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం గుర్తుపెట్టుకోండి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఇది ఈ సభకు సందర్భం కాకపోయినా చెబుతున్నాను. మేం దెబ్బలు తిని వచ్చాం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం. రాజ్యాంగ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారిపై వెంటనే న్యాయపరిధిలో, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని అధికారులకు సూచించారు. పోలీసు అధికారులు మమ్మల్ని నిలువరిస్తే వెంటాడతామని, విదేశాల్లో ఉన్నా వెంటాడతామని బెదిరిస్తూ జగన్ అండ్ కో ప్రకటనలు చేస్తున్న ప్రకటనలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఏ మాత్రం సహించబోమని తేల్చిచెప్పారు. ‘గొంతుకలు కోస్తాం, కుత్తుకలు కోస్తామని బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు. మీలాంటి వారిని ఎదుర్కొనే ఇక్కడికి వరకూ వచ్చాం. ఇలాంటి పిచ్చి, పనికిమాలిన బెదిరింపులు చేయొద్దు.. తాటాకుల చప్పుళ్లకు ఇక్కడెవరూ భయపడరు. సంస్కారం, గౌరవం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా శాంతిభద్రతలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా ఊరుకునే ప్రసక్తి లేదు. మళ్లీ ఆ ప్రభుత్వమే వస్తుందని అధికారుల్లో చాలా మందికి ఒక ఆలోచన ఉండవచ్చు. కానీ ఆ ప్రభుత్వం రాదు.. రావట్లేదు.. మీకు నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
కూటమి రాకపోతే..
2019లో ప్రభుత్వం మారగానే నిర్మాణాత్మక వ్యవస్థ స్థానంలో విధ్వంస పాలన మొదలైంది. ఐదేళ్లు రౌడీ మూకలు, వారికి వంతపాడే అధికారులతో రాష్ట్రం విలవిల్లాడింది. కూటమి ప్రభుత్వం రాకపోతే రాష్ట్రం ఎలా ఉండి ఉండేదో మనందరం ఆలోచించాలి. నన్ను, చంద్రబాబు, లోకేశ్‌ను, ఎవరినైనా ఏదో నెపంతో జైలులో పెట్టాలన్న ఆలోచనలో ఉండేవారు. మా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారు. వీటన్నింటి నేపథ్యంలోనే టీడీపీ బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటైంది. ఏపీకి సుపరిపాలన అందించాలని, పరిపాలనలో జవాబుదారీతనంతో బాధ్యతతో ముందుకు వెళ్లాలని కలిసి ముందుకొచ్చాం. ప్రజలు గుర్తించి ఆదరించి అండగా నిలబడ్డారు. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఈ మార్పు తీసుకురావడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రజల రుణం తీర్చుకునేందుకు మోదీ మార్గనిర్దేశంలో, అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. విద్యా మంత్రి లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం. కొన్ని పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్లుపెట్టడం వ్యక్తిగతంగా నచ్చాయి. పథకాల అమలు సాధ్యమా అని ఎన్నికల ముందు చంద్రబాబును అడిగేవాడిని. ఆయన మాత్రం అభివృద్ధి చేస్తే సంక్షేమ పథకాలు అమలు చేయగలమని చెప్పారు.
ఆ మాటలు సినిమాల్లో బాగుంటాయ్
మీరు రోడ్ల మీదకు వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతులు కోస్తామంటే.. ఇవి సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి. నేనూ సినిమాల నుంచి వచ్చిన వాడినే.. ఇలాంటివి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలుకు కాలు.. మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం. శాంతిభద్రతలు క్షీణిస్తే సహించబోమని ప్రజలందరికీ గట్టిగా తెలియజేస్తున్నాం. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దు.
Updated Date - Jun 24 , 2025 | 05:59 AM