Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..
ABN, Publish Date - Jun 11 , 2025 | 10:03 AM
Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.
Nellore Dist: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Ex Minister Kakani Govardhan Reddy) పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టు (Krishna Patnam port)లో అనధికార టోల్ గేటు(Toll Gate) ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలుచేసిన వైనం తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. కంటైనర్ క్యారియర్ వాహానాల నుంచి భారీగా వసూళ్లు... ఒక్కో వాహనం దగ్గర రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వసూళ్లు చేసేవారని.. రూ. 44 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది. దీనిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఏ1గా కాకాణి, మరో పది మంది అనుచరులపై కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ నాయకుల అక్రమ దందా..
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎత్తివేయడానికి, వేల మంది కార్మికులు వీధిన పడడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల అక్రమ దందా కూడా ఒకటని పోర్టు ఉద్యోగుల వాదన. ఎప్పుడైతే ఎగుమతి, దిగుమతి కంపెనీలకు వాహనాల అద్దెను విపరీతంగా పెంచారో.. అవి భరించలేక తమ కార్యకలాపాలకు చెన్నై పోర్టుపై ఆధారపడడం మొదలు పెట్టాయి. ఫలితంగా కృష్ణపట్నం పోర్టుకు వచ్చే కంటైనర్ల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. దీంతో కంటైనర్ టెర్మినల్ లాభసాటిగా లేదని పోర్టు యాజమాన్యం దీనిని ఎత్తివేసింది. కేవలం బొగ్గు, బూడిద దిగుమతి, ఎగుమతుల టెర్మినల్‌గా మార్చేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టుపై ఆధారపడిన వందలాది ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఉపాధి కోల్పోయాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం.. కాకాణి ఓడిపోవడంతో దందా ఆగిపోయింది.
వైసీపీ అధికారంలో ఉండగా..
అయితే వైసీపీ నాయకుల అక్రమ వసూళ్ల కారణంగా నష్టపోయిన ట్రాన్స్‌పోర్టర్ షేక్ ఫరీద్ అనే వ్యక్తి.. వారి అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా తనలాంటి ఎందరో ట్రాన్స్‌పోర్టర్లు నిలువునా మునిగిపోయామని అందులో తెలిపారు. అంతే కాదు.. కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో వైసీపీ నాయకులు ఎంత దండుకున్నదీ ఉప్పందించారు. వైసీపీ అధికారంలో ఉండగా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు.. ఫరీద్ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం కాకాణి నేతృత్వంలోనే జరిగిందని గుర్తించారు. (ఏ-1)గా కాకాణి, ఆయన అనుచరులు 10 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇప్పటికే కాకాణీపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, రవాణా.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫొటోల మార్ఫింగ్ తదితర కేసులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
మూడో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...
For More AP News and Telugu News
Updated Date - Jun 11 , 2025 | 10:19 AM