Anam Ramanarayana Reddy: ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తప్పవు
ABN, Publish Date - Jul 08 , 2025 | 08:31 PM
కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.
అమరావతి, జులై 08: ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా.. ఆ పార్టీ నేతల వైఖరితోపాటు భాషలో ఏ మాత్రం మార్పు రాలేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం మంగళవారం అమరావతిలో కాస్తా ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళా శాసనసభ్యురాలి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.
మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడే సంస్కృతి తగదంటూ వైసీపీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. మహిళల ఆత్మగౌరవాన్ని వైసీపీ నేతల మాటలు తూట్లు పొడుస్తున్నాయనడంలో సందేహమే లేదన్నారు. వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ అగ్రనాయకత్వానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.
మరోవైపు ఇదే అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆడబిడ్డల పట్ల రోజు రోజుకు దిగజారి పోయి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఇంత వరకు జగన్ రెడ్డి స్పందించక పోవడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. జగన్ రెడ్డి మద్దతుతోనే మహిళల పట్ల వైసీపీ నేతలు ప్రేటేగిపోయి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. యావత్ మహిళా లోకానికి బేషరతుగా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ జగన్ రెడ్డిని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు.
ఇంకోవైపు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలకి నిరసనగా నెల్లూరు రూరల్‌లోని గాంధీ రోడ్డులో మాజీ మేయర్ భానుశ్రీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకి వ్యతిరేకంగా వారంతా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి వారు వినతిపత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 08 , 2025 | 08:38 PM