Share News

CM Chandrababu: బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:35 PM

శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, కాణిపాకం, అహోబిలం, పుట్టపర్తి, కడప దర్గా.. తదితర ప్రదేశాలు మనకు పవిత్రమైన ఆస్తులని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం నుంచి బనకచర్లకు నీరు రావాలని ఆకాంక్షించారు. గోదావరి నీరు.. బనకచర్ల వరకు వస్తే కరవు అనే మాటే ఉండదన్నారు.

CM Chandrababu: బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu in Sirsailam

శ్రీశైలం, జులై 08: రాయలసీమను రతనాల సీమ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ సుభిక్షం కావాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. జులై మాసం తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటితో నిండి పోవడం శుభపరిణామమని తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలంలో 200 టీఎంసీల నీరు ఉందన్నారు. మంగళవారం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో నీటి వినియోగదారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రిజర్వాయర్లు.. ఆధునిక దేవాలయాల వంటివని అభివర్ణించారు. నీళ్లు ఇస్తే రైతులు బంగారం పండిస్తారన్నారు. సాగు బాగుండాలంటే నీళ్లు ఉండాలని చెప్పారు.


టీడీపీ హయాంలోనే..

సాగు నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఒక్క రాయలసీమలోనే రూ.12, 500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని సీఎం చంద్రబాబు వివరించారు.


అదే లక్ష్యం..

తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా తెలుగు జాతి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఒక పెద్ద వరం అని అభివర్ణించారు. గోదావరిలో 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నాయన్నారు. బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. పోలవరం పూర్తయితే తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటినే వినియోగిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.


బనకచర్ల వరకు నీరు వస్తే..

ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారబోతోందని స్పష్టం చేశారు. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, కాణిపాకం, అహోబిలం, పుట్టపర్తి, కడప దర్గా.. తదితర ప్రదేశాలు మనకు పవిత్రమైన ఆస్తులని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం నుంచి బనకచర్లకు నీరు రావాలన్నారు. గోదావరి నీరు.. బనకచర్ల వరకు వస్తే కరవు అనే మాటే ఉండదని ఆయన పేర్కొన్నారు.


ఏపీని విధ్వంసం వైపు నుంచి..

ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తాం.. అభివృద్ధి చేస్తాం.. ఆదాయం పెంచుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని చెప్పారు. వైసీపీ హయాంలో పెన్షన్లు రూ.2 వేల నుంచి రూ. 3 వేలు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని.. కానీ కూటమి అధికారంలోకి రాగానే ఆ పెన్షన్లు రూ.4 వేలు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.


మరో 75 అన్నా క్యాంటీన్లు..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని.. మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అమలు చేశామన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తున్నామని వివరించారు.


15 నుంచి మహిళలకు..

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అఖిల ప్రియ, ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

భారత్ బంద్.. ఎప్పుడంటే.. ?

ఆధార్‌తో కొత్త మొబైల్ నెంబర్‌ లింక్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 08 , 2025 | 06:13 PM