ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: జగన్‌కు స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చిన మంత్రులు..

ABN, Publish Date - Apr 30 , 2025 | 09:57 PM

పరామర్శ నెపంతో శవ రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. జగన్ రెడ్డి హయాంలో బాధితులకు ఎంత పరిహారం అందిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి,

అమరావతి, ఏప్రిల్ 30: సింహాచలంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన దుర్ఘటనపై నీచమైన రాజకీయాలు చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. పరామర్శ నెపంతో శవ రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. జగన్ రెడ్డి హయాంలో బాధితులకు ఎంత పరిహారం అందిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుందన్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిందని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా, బాధితులకు అండగా నిలవకుండా.. జగన్ స్వార్థపూరిత శవ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


బెంగళూరు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టిస్తున్నారని, తన ఐదేళ్ల పాలనలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. ఎన్నడూ తాడేపల్లి నుంచి బయటకు రాని జగన్, ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు, శవ రాజకీయాలు చేసేందుకు బయటకు వస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వాన్ని, పోలీసులను దూషించడం జగన్‌కు అలవాటైపోయిందన్నారు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులను పరామర్శించేందుకు కనీసం వెళ్లారా అని ప్రశ్నించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 112 మంది మరణించినప్పుడు ఎందుకు పరామర్శించలేదని జగన్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వారికి ఎలాంటి పరిహారం అందించారు.. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం ఘటనలో 27 మంది చనిపోయినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. విశాఖపట్నం హిందూస్తాన్ షిప్‌యార్డ్‌లో క్రెయిన్ కూలిన ఘటనలో 11 మంది మరణించినప్పుడు జగన్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నాడని మంత్రి నిలదీశారు. కచ్చలూరు బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు చివరి చూపు కూడా దక్కకుండా చేసిన జగన్ రెడ్డి అసమర్థతను ఎవరు మరచిపోగలరన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపెనీ ఇచ్చిన పరిహారాన్ని తానిచ్చినట్టు గొప్పలు చెప్పుకున్న జగన్‌ను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇస్తానని చెప్పిన జగన్, ఆ మాట ఎక్కడ నెరవేర్చాడని ప్రశ్నించరు. జగన్ రెడ్డి నీచమైన రాజకీయాలు చూసి ప్రజలు విసిగిపోయారని.. ఇకనైనా మానవీయంగా ఆలోచిస్తేనే జగన్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హితవు చెప్పారు.


మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా తీవ్రంగా స్పందించారు..

ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోతే అక్కడకి వెళ్లి శవ రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు మంత్రి అనగాని సత్యప్రసాద్. టీటీడీని అప్రదిష్టపాలు చేద్దామని ప్రయత్నించి విఫలమైనప్పటికీ జగన్ రెడ్డికి ఇంకా బుద్ది రాలేదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకుందామనే దురాశే తప్ప హిందూ ధర్మంపై వైసీపీకి ఎటువంటి చిత్తశుద్ది లేదన్నారు. తన పాలనా కాలంలో అంతర్వేది, రామతీర్ధం దుర్ఘటనలను మరిచిపోయావా జగన్ రెడ్డి అని సూటిగా ప్రశ్నించారు మంత్రి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి అనుయాయులకు దొచి పెట్టారని జగన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. జగన్ పాలనలోనే కచ్చలూరు బోటు మునిగిపోయి, అన్నమయ్య డ్యాం కూలిపోయి, విశాఖ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. ఇలా అనే ప్రమాదాల్లో వందలాది మంది చనిపోవడానికి జగన్ దరిద్రపు పాదమే కారణం అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా దుర్ఘటన జరిగితే తమ ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది.. వెనువెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. బాధితులకు నష్టపరిహారం అందించడంతోపాటు ఘటనపై విచారణ కమిటీని వేసి 72 గంటల్లో నివేదిక ఇవ్వమని కోరామన్నారు.


మంత్రి ఆనం ధ్వజం..

వైఎస్ జగన్ తీరుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి చెందం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ. 3 లక్షలు పరిహారం ప్రకటించిందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు నష్టపరిహారాన్ని ప్రకటించిందన్నారు. ఇలాంటి విషాదకర ఘటన జరిగినప్పుడు హుందాగా ప్రవర్తించాల్సిందిపోయి.. క్షుద్ర రాజకీయాలకు తెరలేపడం ఏంటని జగన్‌ను ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో శవ రాజకీయం చేయడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ హాయంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని.. ఏనాడైనా, ఎక్కడికైనా వెళ్లి పరామర్శించారా అని ప్రశ్నించారు. జగన్ కాదు కదా.. జగన్ మంత్రివర్గంలోని మంత్రులు కూడా వెళ్లలేదని విమర్శించారు. నాడు ప్రజలను పట్టించుకోని జగన్.. నేడు వచ్చి శవ రాజకీయం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన వారు ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. జగన్ ఇంకా అధికారంలో ఉన్నానని భ్రమలో బతికేస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. ఘోరంగా ఓడగొట్టి ఇంటికి పంపించేశారని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంత్రి ఆనం గుర్తు చేశారు. వైసీపీ ఉనికి కోసం, పార్టీ మనుగడ కోసం తమను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకున్న క్రిమినల్ జగన్ అని.. తమను విమర్శించే స్థాయి తనకు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న జగన్‌కు ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని అన్నారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 30 , 2025 | 09:57 PM