AP Pension: జోరుగా పెన్షన్ల పంపిణీ.. 84 శాతం పూర్తి
ABN, Publish Date - May 31 , 2025 | 12:06 PM
AP Pension: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి, మే 31: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) ఉదయమే పింఛన్ల పంపిణీ షురూ కాగా.. ఇప్పటి వరకు 84 శాతం మేర పంపిణీ పూర్తి అయ్యింది. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 50.98 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను అందజేశారు. మొత్తం 63 లక్షల మందికి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,717 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 89.38 శాతం మేర పంపిణీ పూర్తి అయ్యింది.
ఉదయం 8.30 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరుకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు.
టీ కాచిన హోంమంత్రి
అటు అనకాపల్లి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి.. ముందుగా నక్కపల్లి మండలం ఉద్ధండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆపై ఉద్ధండపురం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్‌లను పంపిణీ చేశారు హోంమంత్రి అనిత. ఈ సందర్భంగా గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. ఇటీవలే నాగేశ్వరరావు ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే ఉద్ధండపురంలో ఆవాల గోవిందు ఇంటి వద్ద హోంమంత్రి స్వయంగా టీ కాచి.. కుటుంబ సభ్యులకు టీ ఇచ్చారు. అనంతరం రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని హోంమంత్రి అనిత ప్రారంభించారు.
నంద్యాలలోని బనగానపల్లె మండలం పలుకురు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వెంకటాపురం కాలనీలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి
విజయవాడలో యోగాంధ్ర.. పాల్గొన్న రైతులు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 12:14 PM