NTR District TDP: కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:36 AM
NTR District TDP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
ఎన్టీఆర్ జిల్లా, జూన్ 16: ఎన్టీఆర్ జిల్లాలో మరో మున్సిపాలిటీని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీ (Kondapalli Municipality) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. చైర్మన్‌గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. అయితే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (MLA Vasanta Krishna Prasad) దగ్గరుండి మరీ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో తీర్పు ఫలితం అధికారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్‌ను తెరిచి.. ఫలితాలను ప్రకటించారు అధికారులు. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికాసేపట్లో కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్ పర్సన్‌లుగా కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొండపల్లి మున్సిపాలిటీకి మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో 14 టీడీపీ, 14 వైసీపీ సరి సమానంగా కైవసం చేసుకున్నాయి. అలాగే ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సీట్లు 15కు చేరాయి. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ సొంతమైంది. మరోవైపు 14 మంది వైసీపీ కౌన్సిలర్లకు గాను కేవలం 8 మంది సభ్యులు మాత్రమే హాజరవగా.. మిగిలిన వారు గైర్హాజరయ్యారు.
జోగి.. నోరు అదుపులో పెట్టుకో: వసంత కృష్ణప్రసాద్
కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్‌కు వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకో జోగి అంటూ హెచ్చరించారు. జగన్ సీఎం అని, జోగి ఇంకా మంత్రి అని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైఎస్ చైర్మన్స్ తమ వారే అని జోగి వాగుతున్నారని మండిపడ్డారు. ఏనుగులు వెలుతుంటే కుక్కలు మొరుగుతున్నాయని... వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీకి సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. ‘సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉంటే రండి మేము తలుచుకంటే జోగి ఇల్లు భూస్థాపితం చేస్తాం’ అని హెచ్చరించారు. ఐదేళ్లు జగన్ మూడు రాజధానులు అని నాటకం ఆడారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 16 , 2025 | 02:47 PM