Rayapati Sailaja: ప్రభుత్వం మారినా మహిళలను తిట్టే సంస్కృతి పోలేదు..
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:06 PM
Rayapati Sailaja: జర్నలిస్టు ముసుగులో మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు.
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి మహిళల (Amaravati womens)పై సాక్షి మీడియా (Sakshi media)లో ప్రసారమైన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ (AP Womens Commission Chairperson) రాయపాటి శైలజ (Rayapati Sailaja) తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాలపై దాడి చేయడం గత ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు.
మహిళలకు క్షమాపణ చెప్పలేదు...
జర్నలిస్టు, ఎర్నలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని, మనస్ఫూర్తిగా వారు క్షమాపణ చెప్పారని ఎవరికీ అనిపించలేదని రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు క్షమాపణ చెప్పలేదని.. వాళ్ల యాజమాన్యానికి క్షమాపణ చెప్పారని.. సిగ్గు లేకుండా వాళ్ల వ్యాఖ్యలు సమర్ధించుకున్నారని, ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుందని అన్నారు. కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, ఏపీ శాట్ ఇచ్చిన డేటా ప్రకారం జిల్లాల వారీగా సెక్స్ వర్కర్లు ఉన్నారో గణాంకాలు ఇచ్చిందన్నారు.
నీచమైన ముద్ర వేస్తారా...
రాజకీయ కారణాలతో ఒకే ప్రాంతానికి ఆపాదించి నీచమైన ముద్ర వేస్తారా.. పబ్లిక్ డిబేట్‌లో ఉద్దేశపూర్వకంగా ఆ పదాలు వాడారని, అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారని రాయపాటి శైలజ అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత అమరావతి అభివృద్ధి చెందుతుందని, ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలను నీచంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అన్నవారు.. అనిపించిన వారు.. ప్రచారం చేసిన వారు.. అందరూ శిక్షార్హులేనని ఆమె పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నడిపే ఇటువంటి చానల్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జగన్‌ను, భారతీ రెడ్డిని అన్నారని ఎదురు దాడి చేస్తారా.. అనకూడని మాటలు అన్నప్పుడు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు.
ఒక పధకం ప్రకారం, కుట్రతో వ్యాఖ్యలు..
కృష్ణంరాజు చాలా సార్లు ఇలా వాగినప్పుడు... పదేపదే అతన్ని ఎందుకు పిలుస్తున్నారని రాయపాటి శైలజ ప్రశ్నించారు. సాక్షి యాజమాన్యం , ఆ జర్నలిస్టు క్షమాపణ చెప్పలేదని.. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రెస్ కౌన్సిల్‌కు కూడా సాక్షిపై లెటర్ రాస్తామని, ఆ ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని కోరతామని చెప్పారు. రాజకీయ పార్టీలు ఛానల్స్, ఆయా యాజమాన్యాలు రాజకీయంగా విమర్శించుకోవాలని, అనవసర విషయాల్లో మహిళలను కించ పరిస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. గత ఐదేళ్లు వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు మహిళా కమిషన్ పని తీరు వేరుగా ఉంటుందని శైలజ అన్నారు. ఒక పథకం ప్రకారం, కుట్రతో వ్యాఖ్యలు చేశారు కాబట్టే పారిపోయారని, ఫ్యామిలీని వదిలి ఎంత దూరం వెళతారని అన్నారు.
ఎవరు చేయించారో అందరికీ తెలుసు..
సాక్షి ఛానల్ ఎవరిది... అందులో వచ్చిందంటే... ఎవరు చేయించారో అందరికీ తెలుసునని, అమరావతి మహిళలపై వారికి ద్వేషం ఉందని రాయపాటి శైలజ అన్నారు. నోరు జారి అన్నమాట కాదని.. వెటకారంతో చర్చను కొనసాగించారని దుయ్యబట్టారు. వివరణలో కూడా వాళ్ల యాజమాన్యానికి క్షమాపణ చెప్పిన ఆ వ్యక్తి, మహిళలకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. తన సొంత కారులో తిరిగినా.. చుడీదార్ వేసుకున్నా.. తనపై ట్రోల్ చేస్తున్నారని.. ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని.. డీజీపీ ద్వారా ఇప్పటికే పోలీసు పరంగా చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాసి ఆ ఛానల్, పేపర్‌ను రద్దు చేసేలా చేయాలన్నారు. మహిళా కమిషన్‌కు ఉన్న అధికార పరిధిలో తమవంతు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తాము పోలీసులు ద్వారా వారిపై చర్యలు తీసుకుంటామని. నోటీసులు పంపి... వారి ఉద్దేశాలను తెలుసుకుంటామన్నారు. తప్పు అని తేలితే పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిని కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
For More AP News and Telugu News
Updated Date - Jun 09 , 2025 | 01:51 PM