AP News: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:43 AM
Minister Lokesh: ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఇంకా..
Delhi: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ (Union Minister Mansukh Mandaviya)ను కలిసారు. అమరావతి (Amaravati)లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ (Sports City) నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అమరావతి (Amaravati)లో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని లోకేష్.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు.
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..
క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత నందించాలని, కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపం నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్‌లో హాకీ, షూటింగ్‌లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరా..
తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరానని మంత్రి లోకేష్ తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్‌ను తిరుపతిలో నెలకొల్పాలని కోరాన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్‌లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. తాను చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారని, ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారని, ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారని లోకేష్ తెలిపారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు అందజేశానని మంత్రి లోకేష్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం..
For More AP News and Telugu News
Updated Date - Jun 19 , 2025 | 12:16 PM