Pawan Kalyan: నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ABN, Publish Date - May 29 , 2025 | 07:19 AM
సమాజంలో మన ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కంబాలదిన్నె కేసు నిందితుడ్ని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కడప జిల్లా కంబాలదిన్నె నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సమాజం మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉందని, దోషులకు కఠిన శిక్షలు విధించడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలను నివారించగలమని పవన్ అభిప్రాయపడ్డారు.
చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే అకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. 'నాలుగు రోజుల క్రితం YSR కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టి, హత్య చేయడం, అది కూడా బంధువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నాను. ఈ వార్త నా హృదయాన్ని కకావికాలం చేసింది. సమాజంలో మన ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉంది'. అని పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నానని చెప్పిన పవన్.. 'గతంలో కథువాలో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అని కోరుకున్నాను. అయినా ఇలాంటివి జరుగుతున్నాయంటే నిందితుల్లో.. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన కారణం కావొచ్చు. ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి POCSO కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు'. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయ శాఖ, పోలీస్ డీజీపీ, హోంశాఖ మంత్రి అనితను డిప్యూటీ సీఎం కోరారు. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను.. అని పవన్ హామీ ఇచ్చారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..
Updated Date - May 30 , 2025 | 02:55 PM