ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Quantum Leap in Amaravati: క్వాంటమ్‌ తో కొత్త శకం

ABN, Publish Date - May 04 , 2025 | 03:53 AM

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటుతో భవిష్యత్‌ టెక్నాలజీకి గడప తీసి పెట్టింది. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో అమరావతి టెక్‌ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది

  • దేశంలో తొలి క్వాంటమ్‌ వ్యాలీ అమరావతిలోనే

  • అతిపెద్ద, అత్యాధునిక ఐబీఎం సిస్టం-2 ఏర్పాటు

  • టెక్‌ వరల్డ్‌లో సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం

  • రాష్ట్రంవైపు అంతర్జాతీయ టెక్‌ నిపుణుల చూపు

  • నాలెడ్జ్‌ ఎకానమీకి కేరాఫ్‌గా మారనున్న ఏపీ రాజధాని

  • 10 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల దాకా పెట్టుబడులు

  • క్వాంటమ్‌ టెక్నాలజీతో ప్రయోజనాలెన్నో..

  • అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం... ఐబీఎం! అదే స్థాయిలో పేరుపొందిన టీసీఎస్‌! ఈ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ‘క్వాంటమ్‌ వ్యాలీ’ ఒప్పందం... టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. భారత దేశంలోనే తొలి ‘క్వాంటమ్‌ వ్యాలీ’ ఆంధ్రప్రదేశ్‌లో... అది కూడా అమరావతిలో ఏర్పాటవుతోందన్న వార్త అంతర్జాతీయ మీడియా దృష్టినీ ఆకర్షించింది. భవిష్యత్‌ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునేలా... జనవరి 1వ తేదీనే రాజధానిలో క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభం కానుంది. నిర్మాణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపడుతోంది. అసలు ఏమిటీ క్వాంటమ్‌ వ్యాలీ? టెక్నాలజీపరంగా ఎందుకు కీలకం? అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

  • క్వాంటమ్‌ టెక్నాలజీ అధునాతన సాంకేతిక అంశం కావడంతో దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. సామాన్యులకు అర్థమయ్యేలా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రయోజనాలను తెలపాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థే అమరావతిలోక్వాంటమ్‌ వ్యాలీ నిర్మాణాలను డిజైన్‌ చేస్తోంది.

  • అత్యాధునిక ఐబీఎం ప్రాసెసర్‌కు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు చేపడతారు.


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

క్వాంటమ్‌ టెక్నాలజీతో త్వరలో మరో సాంకేతిక విప్లవం రాబోతోంది. దేశంలో ఆ టెక్నాలజీకి అమరావతి తొలి వేదిక కాబోతోంది. శుక్రవారం అమరావతి పనుల పునఃప్రారంభ సమయంలోనే దీనికి కూడా ముందడుగు పడింది. 2026 జనవరి ఒకటో తేదీన క్వాంటమ్‌ వ్యాలీని ప్రారంభించేందుకు ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్‌తో పాటు ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక 156 క్యూబిట్‌ హెరాన్‌ క్వాంటమ్‌ ప్రాసెసర్‌ కలిగిన అతిభారీ క్వాంటమ్‌ సిస్టమ్‌ 2ను దేశంలోనే తొలిసారిగా ఐబీఎం సంస్థ అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. దీంతో నాలెడ్జి ఎకానమీకి కేరాఫ్‌ గా అమరావతి మారబోతోందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. విజ్ఞాన, వాణిజ్య కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ రూపుదిద్దుకోబోదని టెక్‌ పండితులు భావిస్తున్నారు. రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీకి రూపకల్పన చేసిన చంద్రబాబు... ఇప్పుడు క్వాంటమ్‌ వ్యాలీతో అమరావతిని కొత్త ‘టెక్‌’ రెక్కలు తొడుగుతున్నారని పేర్కొంటున్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిజైన్‌ ప్రత్యేకంగా ఉండబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.


క్వాంటమ్‌ టెక్నాలజీ అంటే..

భౌతిక శాస్త్ర ప్రకారం క్వాంటమ్‌ అంటే అతి సూక్ష్మ పరిమాణం. క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో ఉన్న సిద్ధాంతాలు, లక్షణాలు ఉపయోగించి రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ. సాంకేతిక విప్లవంలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ భవిష్యత్‌లో అద్భుతాలు సృష్టించబోతోంది. అత్యంత శక్తివంతమైన ప్రస్తుత కంప్యూటర్ల సామర్థ్యానికి మించి క్వాంటమ్‌ టెక్నాలజీ కంప్యూటర్లు పనిచేస్తాయి. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్‌ మెకానిక్స్‌ను ఉపయోగించి పరిష్కరించవచ్చు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌, క్వాంటమ్‌ ఆల్గొరిథమ్స్‌తో పాటు వివిధ శ్రేణులు ఉంటాయి. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ ప్రయోజనాలను పుణికిపుచ్చుకున్న క్వాంటమ్‌ కంప్యూటర్స్‌.... ప్రస్తుతమున్న అత్యాధునిక కంప్యూటర్లకంటే వేగంగా, సులువుగా జటిలమైన సమస్యలను పరిష్కరించగలవు. ఇవి ఎంత పెద్ద డేటా అయినా చిటికెలో విశ్లేషిస్తాయి. ఒక క్లాసికల్‌ కంప్యూటర్‌ ఏదైనా సమస్య పరిష్కరించడానికి రోజులకొద్దీ సమయం తీసుకుంటే... అదే సమస్యను క్వాంటమ్‌ కంప్యూటర్లు నిమిషాల్లో సాల్వ్‌ చేయగలవు.


నాలుగు సూత్రాలు...

సబ్‌ ఆటమిక్‌ పార్టికల్స్‌ అధ్యయనాన్ని క్వాంటమ్‌ మెకానిక్స్‌ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యేకమైన, ప్రాథమిక సహజమైన సూత్రాలను వెల్లడిస్తుంది. సూపర్‌ పొజిషన్‌, ఎన్‌టాంగిల్‌మెంట్‌, డీకొహెరెన్స్‌, ఇంటర్‌ఫియరెన్స్‌ అనే ముఖ్యమైన నాలుగు సూత్రాల ఆధారంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పనిచేస్తుంది.

1. సూపర్‌ పొజిషన్‌: ఒక క్వాంటమ్‌ పార్టికల్‌ లేదా వ్యవస్థ ఒకే స్థితిలో ఉండటం కాకుండా, బహుళ అవకాశాల కలయిక స్థితిలో ఉంటుంది.

2. ఎన్‌టాంగిల్‌మెంట్‌: సాధారణ సంభావ్యత అనుమతించేవాటి కన్నా ఎన్‌టాంగిల్‌మెంట్‌ ప్రాసె్‌సలో పలు క్వాంటమ్‌ పార్టికల్స్‌ అనుసంధానమై బలంగా రూపొందుతాయి.

3. డీకొహెరెన్స్‌: ఈ స్థితిలో క్వాంటమ్‌ పార్టికల్స్‌, సిస్టం క్షయం అయ్యి, నశించి లేదా మారి క్లాసికల్‌ ఫిజిక్స్‌ ద్వారా కొలవదగ్గ ఏక స్థితిలోకి వస్తాయి.

4. ఇంటర్‌ఫియరెన్స్‌: అనుసంధానమైన క్వాంటమ్‌ స్థితులు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. అంతేగాక ఎక్కువ లేదా తక్కువ సంభావ్యతను నిర్మిస్థాయి.


క్యూబిట్‌ అంటే..

ప్రస్తుతం మనం ఉపయోగించే క్లాసికల్‌ కంప్యూటర్లు 0, 1 అనే బైనరీ బిట్స్‌పై ఆధారపడి పనిచేస్తాయి. ఈ రూపంలోనే సమాచారాన్ని నిల్వ చేయడం లేదా విశ్లేషించడం చేస్తాయి. ఇక్కడ బిట్‌ విలువ సున్నా లేదా ఒకటి!. క్వాంటమ్‌ టెక్నాలజీలో ఇలాంటి బిట్‌ను క్యూబిట్‌ అని పిలుస్తారు. ఈ క్యూబిట్‌ సాధారణ బిట్‌కు భిన్నంగా ఒకే సమయంలో సున్నా లేదా ఒకటిగా వ్యవహరించగలదు. అదే విధంగా డేటాను నిల్వ చేయగలదు. సూపర్‌ పొజిషన్‌లో క్యూబిట్స్‌ అనుసంధానమైనపుడు క్వాంటమ్‌ టెక్నాలజీ విపరీతమైన వేగంతో పనిచేస్తుంది. ఒకేసారి రెండు క్యూబిట్లు నాలుగు రకాల సమాచారాన్ని లెక్కించగలవు. అలాగే నాలుగు క్యూబిట్లు 16 రకాల అంశాలను విశ్లేషించగలవు. అందుకే ఇది ఊహాతీమైన వేగంతో పనిచేస్తుంది. ఈ కంప్యూటర్లలో మరో విశేషం కూడా ఉంది. క్లాసికల్‌ కంప్యూటర్ల డేటాను క్వాంటమ్‌ సిస్టమ్‌లు విశ్లేషించగలవు కానీ, క్వాంటమ్‌ డేటాను క్లాసికల్‌ కంప్యూటర్లు యాక్సెస్‌ చేయలేవు. సమస్యలను పరిష్కరించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి సంస్థలు క్వాంటమ్‌ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 2035 కల్లా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఇండస్ట్రీ 1.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.


మరో హైటెక్‌ సిటీగా అమరావతి

  • బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌

ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీతో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ప్రజారాజధాని పునఃనిర్మాణానికి శుభసూచకమని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. దీంతో అమరావతి మరో హైటెక్‌ సిటీగా మారేందుకు అవకాశం ఉందన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2026 జనవరి నుంచి యావత్‌ ప్రపంచం అమరావతి వైపు చూస్తుందన్నారు. ఇప్పటికే గూగుల్‌, నాసా లాంటి ప్రఖ్యాత సంస్థల్లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్‌ టెక్నాలజీ హబ్‌లు ఏడు మాత్రమే ఉన్నాయని, ఆసియాలో ఇంతవరకు ఆ టెక్నాలజీపై పరిశోధనే చేయలేదన్నారు. అలాంటిది దేశంలోనే తొలిసారిగా అమరావతి ద్వారా ఆసియాకు క్వాంటమ్‌ టెక్నాలజీని చంద్రబాబు పరిచయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ సీఎం కూడా క్వాంటమ్‌ టెక్నాలజీపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. దూరదృష్టి కల సీఎం కాబట్టే చంద్రబాబు క్వాంటమ్‌ టెక్నాలజీపై మాట్లాడటమే కాదు రాజధానిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దనున్నారని కొనియాడారు. 17 రాష్ట్రాల్లో 43 పరిశోధనా కేంద్రాల ద్వారా దీనిని అనుసంధానం చేస్తారని తెలిపారు. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్‌ వ్యాలీని ప్రారంభిస్తున్నారని వెల్లడించారు.


క్వాంటమ్‌ టెక్నాలజీ ఉపయోగాలు

విస్తృత శ్రేణిలో క్వాంటమ్‌ టెక్నాలజీ వినియోగంతో వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఔషధరంగం, ఆర్థిక సేవలు, మెటీరియల్‌ సైన్స్‌ తదితర రంగాల్లో అనూహ్య పురోగతి కనిపిస్తుంది. క్లాసికల్‌ కంప్యూటర్‌ టెక్నాలజీకి లేని సామర్థ్యం దీనికి ఉండటంతో ఆప్టిమైజేషన్‌, క్రిప్టోగ్రఫీ, మెషీన్‌ లెర్నింగ్‌ మరింత మెరుగవుతుంది. దీనివల్ల ఏఐ పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా సమాచారం హ్యాక్‌ చేయలేని విధంగా మారుతుంది. అత్యంత భద్రంగా సమాచార నిల్వ, మార్పిడి జరుగుతుంది. అణు స్థాయిలో రసాయన చర్యలను విశ్లేషించడం ద్వారా కొత్త మందులను వేగంగా అభివృద్ధి చేయవచ్చు. మార్కెట్‌ అంచనా, పోర్టిఫోలియో ఆప్టిమైజేషన్‌ వంటి క్లిష్టమైన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు. వాతావరణ మార్పులు, వాటి అంచనాలు మరింత కచ్చితంగా విశ్లేషించవచ్చు. క్వాంటమ్‌ టెక్నాలజీతో విస్తృత డేటా విశ్లేషణలో పెరిగే వేగం కారణంగా పాలనలో కూడా వేగం పెరుగుతుంది. ఉదాహరణకు.. రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎంతమందికి క్యాన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉంది అనే విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. పంటలకు సోకే క్రిమికీటకాలు, వాటి ప్రభావం, నివారణపైనా రాష్ట్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. భారీ బహిరంగ సభల్లో పది లక్షల మంది హాజరైనా ఒక్కొక్కరినీ గుర్తింవచ్చు. ట్రాఫిక్‌ నియంత్రణ కూడా సలువు అవుతుంది.


ఇవి కూడా చదవండి

Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2025 | 03:53 AM