Jagan Security Plea: జగన్ జెడ్‌ప్లస్ భద్రత పిటిషన్‌పై వివరాలు ఇవ్వండి
ABN, Publish Date - May 10 , 2025 | 04:36 AM
జెడ్‌ప్లస్ భద్రత పునరుద్ధరణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్ర హోంశాఖతోపాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది
కేంద్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశం
సమయం కావాలన్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్
తదుపరి విచారణ వేసవి సెలవుల తరువాతకి వాయిదా
అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్, ఎన్‌ఎస్‌జీ, రాష్ట్ర హోం ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తనకు జెడ్‌ప్లస్ భద్రత పునరుద్ధరించేలా, ఎన్‌ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణనలోకి తీసుకొనేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇటీవల ఘటనలు చూస్తే పిటిషనర్ భద్రత, స్వేచ్ఛ ప్రమాదంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖకు వినతులు సమర్పించామన్నారు. భద్రత కుదింపుపై హైకోర్టులో గతంలో ఓ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. కేంద్ర హోంశాఖ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. భద్రత విషయంలో పిటిషనర్ గత వ్యాజ్యంలో కూడా కేంద్ర హోంశాఖను ప్రతివాదిగా చేర్చారన్నారు. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు.
Updated Date - May 10 , 2025 | 04:36 AM