AP High Court: వారికి ఎస్సీ హోదా వర్తించదు
ABN, Publish Date - May 02 , 2025 | 05:06 AM
క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా ఉండదని, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. పాస్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది
క్రైస్తవంలోకి మారగానే దానిని కోల్పోతారు
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు
ఫిర్యాదుదారు పాస్టరు.. ఆయన ఫిర్యాదు
చెల్లదు.. స్పష్టంచేసిన హైకోర్టు
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ఎస్సీలు క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదా కోల్పోతారని, వారు ఎస్పీ,ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి కుల వ్యవస్ధ దూరమని పేర్కొంది. చర్చిలో పాస్టర్‌గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు క్రైస్తవ మతంలోకి మారి గత పదేళ్లుగా తాను పాస్టర్‌గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అధికారులు కుల ధ్రువీకరణపత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారు ఆ చట్టం కింద రక్షణ పొందలేరని తెలిపింది. ఫిర్యాదుదారు చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల పై ఎస్సీ,ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.
గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో వారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించారని పేర్కొంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై చందోలు పోలీసులు 2021 జనవరి 26న ఎస్సీఎస్టీచట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో రామిరెడ్డి, ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకురాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం హిందూమతాన్ని పక్కనపెట్టి ఇతర మతాలను స్వీకరించినవారికి ఎస్సీ హోదా వర్తించదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ
Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్
Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి
Updated Date - May 02 , 2025 | 05:06 AM