సూపర్ 6
ABN, Publish Date - May 12 , 2025 | 12:38 AM
ఎదురుచూపులు ఫలించాయి..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. దీంతో ఇప్పటి వరకూ నామినేటెడ్ పదవులపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి కేఎస్ జవహర్ నియమితులయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వరించింది. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ చైర్మన్ పదవి మండపేటకు చెందిన జనసేన నాయకుడు
కూటమిలో పదవుల పండగ
ఉమ్మడి జిల్లాకు ఒకేసారి ఆరు పదవులు
నామినేటెడ్ పదవులు పంపకం
రాష్ట్రస్థాయి చైర్మన్లుగా నలుగురు
డీసీసీబీ, డీసీఎంఎస్‌కు ఇద్దరు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
ఫలించిన ఎదురుచూపులు
టీడీపీకి 3, జనసేనకు 2, బీజేపీకి 1
ఎదురుచూపులు ఫలించాయి..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. దీంతో ఇప్పటి వరకూ నామినేటెడ్ పదవులపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి కేఎస్ జవహర్ నియమితులయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వరించింది. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ చైర్మన్ పదవి మండపేటకు చెందిన జనసేన నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణను వరించింది. ఇక రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి రంపచోడవరానికి చెందిన చోళ్ల బొజ్జిరెడ్డి (బీజేపీ) నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి జనసేన జిల్లా అధ్యక్షుడు, కౌడా చైర్మన్ అయిన తుమ్మల రామస్వామి (బాబు)ను వరి ంచింది. తుమ్మలబాబు ప్రస్తుతం కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్, జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. తాజా పదవితో తుమ్మలకు మూడు పదవులు వరించినట్లయింది.అటు డీసీఎంస్ చైర్మన్‌గా కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పెచ్చెట్టి చంద్రమౌళికి కేటాయించారు. ఒకేసారి ఆరు పదవులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించడంతో సూపర్ సిక్స్ అంటూ కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా జవహర్
కొవ్వూరు, మే 11 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి కేఎస్ జవహర్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న జవహర్ అనూహ్యంగా 2014లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు కొవ్వూ రు ఎమ్మెల్యేగా, ఎక్సైజ్‌శాఖ మం త్రిగా పనిచేశారు.తదనంతర పరిణామాలతో కొవ్వూరు నుంచి తిరువూరు వెళ్లా రు.2019లో తిరు వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించినా దక్క లేదు.దీంతో పోటీ కి దూరంగా ఉన్నారు. ప్రసుత్తం తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జవహర్ తనయుడు కొత్తపల్లి లాల్ టీడీపీ యువజన విభాగం కార్యదర్శిగా,రాజానగరం నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నారు.ఈ పదవి దక్కడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
సమసమాజ స్థాపనకు కృషి
సామాజిక న్యాయం అందించడానికి.. సమసమాజ స్థాపనకు కృషి చేస్తా. పీ4 విధానంలో దళితుల అభివృద్ధికి సాధ్యమవుతుందని ఆశిస్తున్నా. ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు.
- జవహర్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్
ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా శేషారావు
ఉండ్రాజవరం/నిడదవోలు, మే 11 (ఆంధ్రజ్యోతి): నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డిసీ) చైర్మన్‌గా పదవి లభించింది. ప్రభుత్వం ఆదివారం వివిధ కార్పొరేషన్లకు ప్రకటించిన పదవుల్లో శేషారావుకు ఈ పదవి దక్కింది. ఈయన 1965వ సంవత్సరం జూలై 15న వేలివెన్నులో జన్మించారు. బీఏ చదివారు. తొలుత టీడీపీ ఉండ్రాజ వరం మండల అధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో వేలివెన్ను ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి సర్పంచ్ ఆరేపల్లి వెంకట్రావు పదవిలో ఉండగా మరణించడంతో శేషారావు ఇన్‌ఛా ర్జి సర్పంచ్‌గా కొనసాగారు. 2000 నుంచి 2009 వరకు సర్పంచ్ పదవికి జరిగిన ఎన్ని కల్లో మూడు సార్లు విజయం సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసారు. 2009లో సర్పంచ్‌గా పదవిలో ఉండగా నిడదవోలు నియోజకవర్గం కొత్తగా ఏర్పడిం ది. నాడు తొలిసారి నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మె ల్యేగా విజయం సాధిం చి శాసనసభలో అడుగుపెట్టారు. రెండో సారి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మూడో సారి ఓటమి చెందారు.అప్పటి నుంచి నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ పదవి రావడం పట్ల నియోజవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు శేషారావుకు అభినందనలు తెలిపారు.
సంతోషంగా ఉంది..
పార్టీ ఇచ్చిన పదవిని అంకితభావంతో నిర్వహిస్తా. ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ పదవి రావడం సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబు , సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు.
- బూరుగుపల్లి శేషారావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్
ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బొజ్జిరెడ్డి
రంపచోడవరం, మే 11(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగపరంగా జ్యుడీ షియల్ అధికారాలు కలిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా రంపచోడవరం నియోజకవ ర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత చోళ్ల బొజ్జిరెడ్డిని కూటమి ప్రభుత్వం నియమించింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం బోలగొండలో కొండ రెడ్డి తెగకు చెందిన ఈయన గిరిజన సంక్షేమశాఖలో ఉపా ధ్యాయుడిగా తన కెరీర్ ప్రారం భించారు.ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీ నామాచేసి 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున రంపచోడవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు.అనంతరం బీజేపీలో కీలకంగా ఉంటూ ప్రస్తుతం అల్లూజిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతు న్నారు.కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని బొజ్జిరెడ్డికి కేటాయించారు.
సమస్యలు పరిష్కరిస్తా..
గిరిజన హక్కుల పరిరక్షణకు పాటు పడతా.. గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి సాగిస్తా.ఈ పదవిని అప్ప గించి నందుకు ప్రధాని మోదీ, పురందేశ్వరి, సీఎం చంద్ర బాబుకు కృతజ్ఙతలు.
- చోళ్ల బొజ్జిరెడ్డి,రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్
డీసీఎంఎస్ చైర్మన్‌గా చంద్రమౌళి
అమలాపురం, మే 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా అమలాపురం మండలం పేరూరు గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడి సామాజికవర్గానికి చెందిన ఆయన్ను ఈ పదవిలో నియమించడం ద్వారా కోనసీమ జిల్లాలోని బీసీ సామాజికవర్గానికి న్యాయం చేసినట్టయింది.చంద్రమౌళి 1964 ఆగస్టు 27న జన్మించారు. బీఏ చదివిన ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి గ్రామ, మండల, ఉమ్మడి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా బీసీసెల్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు, ఆ తరువాత రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పలు పర్యాయాలు సేవలందించారు.అల్లవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కూడా మౌళి పనిచేసి టీడీపీ కి విశిష్ట సేవలందించారు. చంద్రమౌళికి బీసీ కోటాలో డీసీఎంఎస్ పదవిని కేటాయించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.ఉమ్మడి జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులతో పాటు మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా వారికి ఉన్నతమైన సేవలను అందించడమే లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి వెల్లడించారు. డీసీఎంఎస్ ఆస్తుల పరిరక్షణ, రైతులకు సేవ అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
డీసీసీబీ చైర్మన్‌గా తుమ్మల బాబు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి జనసేన జిల్లా అధ్యక్షుడు, కౌడా చైర్మన్ అయిన తుమ్మల రామస్వామి (బాబు)ను వరించింది. తొలుత డీసీసీబీ చైర్మన్ పదవికి పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జి మర్రెడ్రి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపించింది.ఆఖర్లో అను హ్యంగా ఈయనకు పదవి దక్కలేదు. అయి తే ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్‌లాంటి పెద్ద పదవిని మర్రెడ్డి చేపట్టలేరనే వాదన ప్రధానంగా పార్టీ అధినేత వద్ద వ్యక్తమైందని సమాచారం.దీంతో మర్రెడ్డికి అవకాశం చేజారిపోయినట్లయిందని పలువురు జనసేన నేతలు విశ్లేషించారు. అదే సమయంలో కౌడా చైర్మన్ తుమ్మలబాబును పిలిపించి ప్రస్తు తం డీసీసీబీ వందల కోట్ల అప్పుల్లో ఉన్నందున దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన విషయాన్ని వివరించి ఈయన పేరును ఖాయం చేసినట్లయింది. ఇదిలాఉంటే తుమ్మలబాబుకు తాజా కుర్చీతో కలిపి మొత్తం మూడు పదవులు చేతిలో ఉండడంపై జనసేన వర్గాలే విస్తుపోతున్నాయి. త్వరలో కౌడా కు కొత్త నేతను ఎంపిక చేస్తారని సమా చారం.కౌడా చైర్మన్ కుర్చీ టీడీపీకి ఇవ్వవచ్చనే ప్రచారం ఇరుపార్టీల్లో వ్యక్తమవుతోంది.
బాధ్యతగా చేస్తా
ఈ పదవిని సమర్ధవంతంగా నిర్వహిస్తా. పార్టీ అధిష్టానం ఉంచిన గురుతర బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించగలననే నమ్మకం, విశ్వాసం ఉంది.
- తుమ్మల బాబు
ఏపీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా లీలాకృష్ణ
మండపేట, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆశలు ఫలిం చాయి. ఎదురుచూపులకు ఫలితం దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన మండపేట నియోజకవర్గ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణను రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది.వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి న ఆయన ఇంటర్ చదివారు. భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు.తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. 1995- 2004 వరకు వల్లూరు సొసైటీ అధ్యక్షుడిగా పనిచే శారు.రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా 2000 నుంచి 2007 వరకు,పీసీసీ కార్యదర్శిగా 2011 నుంచి 2014 వరకు, మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు. 2015- 2019 వరకు మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా కొనసాగారు. 2019లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.2019లో మండపేట నియో జకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జిగా ఉన్నారు.ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర సాగు నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.
సాగునీటి పారుదల అభివృద్ధికి కృషి
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు.నాపై ఎంతో నమ్మ కంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తా.సాగునీరు సరఫరాపై దృష్టి పెడతా. సాగునీటి వ్యవస్థలో మార్పులు చేర్పులపై నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటా .
- లీలాకృష్ణ, ఏపీఎస్‌ఐడీసీ చైర్మన్
Updated Date - May 12 , 2025 | 12:38 AM