ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: ఇది డబుల్‌ పవర్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 05:34 AM

డబుల్‌ ఇంజన్‌ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదని.. ఇంత సంక్షోభంలోనూ ఊహించినదాని కంటే ఎక్కువే చేశామని తెలిపారు.

రాజకీయ పాలనతోనే అభివృద్ధి

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి

నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదే

మనందరి ఉమ్మడి టార్గెట్‌ 2029, 2047

3 పార్టీలు అధికారంలో ఉన్నా ఏ సమస్యా రాలేదు

సహకరిస్తున్న పవన్‌, కేంద్రం, పురందేశ్వరికి థ్యాంక్స్‌

వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

పట్టణాల్లో 2 సెంట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు

ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం

యోగా డే స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్ర

‘సుపరిపాలనలో తొలి అడుగు’

కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • ‘డబుల్‌ ఇంజన్‌’ సత్తా చాటాం.. అన్నీ చేసేశామని చెప్పడం లేదు

  • కానీ ఊహించినదానికంటే ఎక్కువే చేశాం: ముఖ్యమంత్రి

అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఇంజన్‌ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదని.. ఇంత సంక్షోభంలోనూ ఊహించినదాని కంటే ఎక్కువే చేశామని తెలిపారు. ఈ పదవి తనకు కొత్త కాదని, నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. ప్రతిసారీ సమర్థంగా సుపరిపాలన అందించానన్నారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌.. అంటే రాజకీయ పాలనతోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం వెలగపూడి సచివాలయం వద్ద ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రులందరితోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఏడాది పరిపాలన, సాధించిన ప్రగతిపై సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న యోగా డేను సునాయాసంగా నిర్వహించిన స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని, మనందరి ఉమ్మడి లక్ష్యం 2029 ఎన్నికలు, విజన్‌-2047 కావాలని పిలుపిచ్చారు. నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.

వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 శాతం వృద్ధిరేటు సాధించాలని స్పష్టంచేశారు. ఓటు విభజన జరుగకూడదని తాను, పవన్‌ కల్యాణ్‌ చెప్పామని.. గెలుపు తమ కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసమని పిలుపునిచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకెళ్లాయని వివరించారు. మూడు పార్టీలూ కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్యా రాలేదని చెప్పారు. దీనికి సహకరిస్తున్న ప్రధాని మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వల్లే గాడిన పెట్టగలిగామని తెలిపారు. ‘నాకు సీఎం పదవి కొత్తకాదు. క్లిష్ట సమయాల్లో పరిస్థితులను చక్కదిద్దిన అనుభవం నాది. 1995లో సీఎం అయ్యేనాటికి ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది. జీతాలివ్వలేని పరిస్థితి ఉన్నా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించాను. 2014లో రాష్ట్ర విభజన జరిగి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. బస్సులో ఉండి పాలన చేసి 13.5ు వృద్ధి రేటు సాధించాం. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది.. ఇప్పటి వరకు ఏం చేశాం. ఇంకా ఏం చేస్తామో సమీక్షించుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టాం’ అని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఎంత కష్టమైనా హామీల అమలు..

కూటమి ప్రభుత్వంపై ఆశలు చాలా ఉన్నాయి. కానీ సర్కారుకు అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎన్డీయే పనిచేస్తోంది. ప్రజల ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. సూపర్‌-6తో పాటు మరికొన్ని హామీలిచ్చాం. ఎంత కష్టమైనా అమలు చేస్తాం. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలి. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది. 2022-23 నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే 4 సంతకాలు పెట్టాం. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. 203 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నాం.

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్ల సాయం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు కేటాయించింది. విశాఖ రైల్వే జోన్‌ పనులు జరుగుతున్నాయి. తల్లికి వందనం హామీని పూర్తిగా నిలబెట్టుకున్నాం. అడ్మిషన్లు పూర్తయ్యాక ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకూ ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇంటి జాగా.. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయిస్తాం. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ధనవంతుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు. పేదవాడు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాడు. సమాజం అండతో పైకి వచ్చినవారు తిరిగి సమాజానికి ఇవ్వాలి. పీ-4ను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి. ధనికులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు భాగస్వాములు కావాలి.

ఆ ఐదేళ్లు అణగదొక్కడమే..

గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానాన్ని కలిగించారు. ఎక్కడ చూసినా వేధింపులు, అణగదొక్కే ధోరణులే. ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించారు. రూ.10 లక్షల కోట్లు అప్పుచేశారు. అన్ని వ్యవస్థలనూ కుదేలు చేసి వెళ్లిపోయారు. ఒక్క మైనింగ్‌ శాఖలోనే రూ.10 వేల కోట్ల ఆదాయం పోయింది. ఒప్పందం చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ను వాడకపోవడంతో రూ.9వేల కోట్లు అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. పట్టుదలతో మనల్ని ఎనుకున్న ప్రజలకు న్యాయం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. నియోజకవర్గాలకు పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టిన ఘనత పవన్‌ కల్యాణ్‌కు దక్కుతుంది. అన్ని స్కూళ్లలో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌లు పెట్టిన ఘనత లోకేశ్‌కు లభిస్తుంది.

12.20 శాతం వృద్ధిరేటు సాధించాం...

కష్టాలు వెంటాడుతున్నా 12.2 శాతం వృద్ధిరేటు సాధించాం. విజయవాడ, విశాఖ మెట్రోలకు అనుమతులు వస్తున్నాయి. మద్యం, ఇసుక విధానాలు కొత్తవి తెచ్చాం. ముందుకొచ్చిన పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటి వరకు 31 పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చాం. కొత్తగా రోడ్లు వేశాం. పాడైన రోడ్లకు మరమ్మతులు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలి. ప్రభుత్వ నిర్ణయాలను యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయాలి. రూ.9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాం. కంపెనీలు వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.

గంజాయి అమ్మితే కఠిన చర్యలు...

వైసీపీ హయాంలో గంజాయిని పెంచి పోషించారు. మేమొచ్చాక గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించాం. గంజాయి పండించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా సరే గంజాయి ఇప్పించినా, గంజాయి సేవించినా అదే వారికి చివరి రోజు అవుతుంది. లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో ఉండాలి. ఆడబిడ్డలకు రక్షణ ఉండితీరాలి. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటే కుదరదు.

అసాధ్యమన్నారు..

విశాఖలో అంతర్జాతీయ యోగా డేను 5 లక్షల మందితో నిర్వహించాలనుకున్నప్పుడు మొదట్లో అసాధ్యమన్నారు. కలెక్టర్‌ కూడా వందల మందితో ముగిద్దామని చెప్పారు. కానీ మంచి ప్రణాళికతో అదే కలెక్టర్‌ 3 లక్షల మందితో విజయవంతంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అందరూ ఆంజనేయస్వామి లాంటివారే. వారి శక్తి నాకు తెలుసు. ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటే మన పనులు కూడా ఆ దిశగా ఉంటాయి.

మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం

ప్రపంచంలో ఎక్కడా సక్సెస్‌ కాని మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చి.. పోయిన ఐదేళ్లూ మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అలాంటి రాజధానిని తిరిగి గాడిలో పెట్టాం. అధికారంలోకి వచ్చిన 3,4 నెలల్లోనే రూ.15 వేల కోట్లు తెచ్చి పట్టాలెక్కించాం. మొన్న మే 2వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కీలకమైన మౌలిక సదుపాయాలను మరో మూడేళ్లలో పూర్తి చేస్తాం. మూడేళ్ల తర్వాత మళ్లీ మీరే వచ్చి ప్రారంభించాల్సి ఉంటుందని ఆ రోజునే ప్రధానికి చెప్పాను. అనుకున్నట్లుగానే మూడేళ్లలో పూర్తి చేస్తాం. రాజధాని స్వయంపోషక ప్రాజెక్టు. 28 వేల మంది రైతులు 34 వేల ఎకారాల భూమిని భూ సమీకరణలో ఇచ్చారు. వారికి డెవల్‌పచేసిన ప్లాట్లు తిరిగి ఇచ్చాం. ప్రభుత్వ అవసరాలు, రైతులకు ఇచ్చిన భూములు పోగా మిగిలిన ల్యాండ్‌ బ్యాంకుతో ఆర్థిక సమతుల్యత సాధించవచ్చు. రాజధాని అభివృద్ధి జరిగాక మిగిలిన భూమిని అమ్మి, దాంతో నిధులు తిరిగి బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

బనకచర్లతో ఇబ్బందేమీ లేదు...

గోదావరి మిగులు జలాలు రెండు రాష్ట్రాలూ వాడుకోవచ్చని సీఎం తెలిపారు. ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని, 2 రాష్ట్రాలు ఎంతగా వాడుకున్నా.. 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలవన్నారు. ‘పోలవరం-బనకచర్ల అనుసంధానంతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. గోదావరి జలాల వినియోగంతో 2రాష్ట్రాలు బాగుపడతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి నీటి సమస్య తీరుతుంది. దక్షిణ భారతంలో నీటి సౌలభ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీయే. నదులను అనుసంధానిస్తే సుభిక్షంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయేలా చేసింది’ అని ఆక్షేపించారు.

స్వర్ణాంధ్ర 2047కి సై

స్వర్ణాంధ్ర 2047 అమలు కోసం యంత్రాంగం సిద్ధం చేశాం. ఏపీలో ప్రస్తుత తలసరి ఆదాయం రూ.2.6 లక్షలు ఉంది. 2047 నాటికి రూ.55 లక్షలు కావాలి. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ తగ్గింది. ఒకసారి జీఎ్‌సడీపీ పెరిగితే నిరంతరం రెవెన్యూ పెరుగుతుంది. 2029 నాటికి తలసరి ఆదాయం, జీఎ్‌సడీపీ బాగా పెరగాలి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో జనాభా బాగా పెరుగుతోంది. మిగతా రాష్ట్రాల్లో పెరుగడం లేదు. పిల్లలను భారంగా భావించకూడదు. వాళ్లను ఆస్తిగా పరిగణించాలి. ప్రస్తుతం వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 503 సేవలు అందిస్తున్నాం. త్వరలోనే 703కి పెంచుతాం. ఇప్పుడు చేయాల్సింది హార్డ్‌ వర్క్‌ కాదు. స్మార్ట్‌ వర్క్‌. ఈ ఏడాది చేసిన పనులను మరో నాలుగేళ్లు కొనసాగిద్దాం. మనిషికి తనకున్న శక్తి సామర్థ్యాలపై అనుమానముంటుంది. కానీ తెలివితేటలు ఆచరణలో పెడితే అద్భుతాలు జరుగుతాయి. రూ.28 వేల కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించాం. దీర్ఘకాలిక పెండింగ్‌ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాం. ఇరిగేషన్‌ బిల్లులు, కేంద్ర పథకాల బిల్లులు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులున్నా పెండింగ్‌ కేంద్ర పథకాలను ప్రారంభించాం. ఎన్ని మార్గాలుంటే అన్నీ మార్గాలనూ అవలంబిస్తున్నాం.

ఇన్ని చేశాం కాబట్టే ఒక్క సంవత్సరంలోనే రికవరీ దశకు వచ్చాం. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన లిక్కర్‌ పాలసీ తెచ్చాం. భ్రష్టు పట్టిన ఇసుక విధానం స్థానంలో పేదలకు ఇసుక ఉచితంగా అందేలా చేస్తున్నాం. వైసీపీ వాళ్లు తారుమారు చేసిన ల్యాండ్‌ రికార్డులన్నీ సరిచేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో సగానికిపైగా వాటికి సంబంధించే ఉంటున్నాయి. ఇంకో ఏడాదిపాటు అధికారులు పట్టుదలగా పనిచేసి వాటిని ప్యూరిఫై చేసి ఆన్‌లైన్‌ రికార్డులు తయారు చేయాలి. లిక్కర్‌ షాపుల్లో గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. రైతులకు అన్నదాతా సుఖీభవ ఇవ్వడానికి క్యాలెండర్‌ సిద్ధం చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇప్పటికే ఇచ్చాం. రూఫ్‌టాప్‌ సోలార్‌ కింద 20 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆదరణ కింద బీసీలు, ఎస్సీలకు 50 యూనిట్లు పవర్‌లూమ్స్‌కు, 200 యూనిట్లు చేనేతలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. చేనేతపై జీఎస్టీ రద్దు చేశాం. విజయవాడ, విశాఖ పట్నం మెట్రోలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా.. కోస్తాంధ్రను ఆక్వా కల్చర్‌ హబ్‌గా మారుస్తాం.

Updated Date - Jun 24 , 2025 | 05:57 AM