ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఆలయాలకు ఆగమ స్వేచ్ఛ!

ABN, Publish Date - Feb 18 , 2025 | 03:25 AM

హిందువులున్న ప్రతి దేశంలోనూ శ్రీవారి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే తిరుపతిలో

  • వైదిక వ్యవహారాల్లో సర్కారు జోక్యం ఉండదు

  • ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం!

  • రూ.6 లక్షల కోట్ల ‘ఆలయ ఆర్థికం’

  • అర్చకుల వేతనాలు పెంచాం

  • ఆలయాల అభివృద్ధికి రూ.138 కోట్లు ఖర్చు చేశాం

  • గుళ్ల రక్షణకు ప్రత్యేక కమిటీ

  • ‘ఆలయాల సదస్సు’లో చంద్రబాబు

  • ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా పాలక కమిటీల ప్రతినిధుల రాక

  • మహారాష్ట్ర, గోవా సీఎంలు కూడా

  • ఇది వసుధైక కుటుంబ స్ఫూర్తి: ప్రధాని

ఆలయాల అభివృద్ధికి నిధుల కొరత లేదు. వాటిని వినియోగించి భక్తులకు సరైన వసతులు కల్పించడమే దేవుడికి సేవ చేసే ఉత్తమ మార్గం. ఏ ఆలయమైనా, ఏ ప్రభుత్వమైనా భక్తులు ఇచ్చే విరాళాలను వారి మనోభావాలకు అనుగుణంగానే ఖర్చుచేయాల్సి ఉంటుంది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

తిరుపతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవేంకటేశ్వరుడి ఆలయం నిర్మించాలనేది నా ఆకాంక్ష. అలాగే హిందువులున్న ప్రతి దేశంలోనూ శ్రీవారి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే తిరుపతిలో ఆలయాల మహాకుంభ్‌ ప్రారంభమవుతుండడం అదృష్టదాయకమన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి ఆశా కన్వెన్షన్‌లో అంతర్జాతీయ ఆలయాల సదస్సు-ప్రదర్శన (ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో-ఐటీసీఎక్స్‌-2025) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు రాష్ట్రప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌ కూడా హాజరయ్యారు. దేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ వంటి నాయకుడు లభించాడని, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు.


రాష్ట్రంలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని.. ముఖ్యంగా వైదిక, ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. గుళ్ల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని.. ఇటీవలే దేవదాయ శాఖ చట్టాన్ని సవరించామని తెలిపారు. అర్చకుల పారితోషికాలు పెంచామని గుర్తు చేశారు. ‘గత ఏడెనిమిది నెలల్లో ఆలయాల అభివృద్ధికి రూ.138 కోట్లు ఖర్చు చేశాం. వేద విద్య అభ్యసించిన వారికి ఆలయాల్లో పని దొరికేదాకా నెలవారీ భృతి ఇస్తున్నాం. ప్రతి ఆలయ ట్రస్టు బోర్డులో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేలా చట్టం తెచ్చాం. అన్ని గుళ్లలో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. క్యూఆర్‌ కోడ్‌తో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నాం. ఏఐ, సీసీ కెమెరాలు, డ్రోన్‌ పెట్రోలింగ్‌ వంటివి చేస్తున్నాం’ అని చెప్పారు. ఐటీసీఎక్స్‌-2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆలయాల ట్రస్టులను ఏకం చేస్తోందన్నారు. ఆలయాల ఉత్తమ నిర్వహణ, భద్రత, పారదర్శక ఆర్థిక వ్యవస్థల కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఆలయాల యాజమాన్యాలను ఒకే వేదికపైకి తెచ్చి ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సంక్షేమానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. ‘వారాణసీలో తొలి సదస్సు నిర్వహించిన ఐటీసీఎక్స్‌ రెండో సదస్సును సరైన సమయంలో తిరుపతిలో నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా ఆలయాల కమిటీలు కలుస్తుండడం గొప్ప విషయం. వర్చువల్‌గా కూడా ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రత్యక్షంగా 111 మంది వక్తలు పాల్గొని ఆలయాల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తుండడం ప్రశంసనీయం. 15 వర్క్‌షాపులతో పాటు 60కి పైగా వివిధ స్టాల్స్‌ ఏర్పాటు ఆలయాల సక్రమ నిర్వహణకు ఉపకరిస్తాయి’ అని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


ఆలయాల ఎకానమీ రూ.6 లక్షల కోట్లు!

ఆలయాలన్నీ భారతీయ సంస్కృతి, వారసత్వంతో ముడిపడి ఉన్నాయి. వాటిని అందరం కాపాడుకోవాలి. దేశంలో ఆలయాలు రూ. 6 లక్షల కోట్లతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాయి. 1985-86లో నాటి సీఎం ఎన్టీఆర్‌ తిరుమలలో ప్రారంభించిన అన్నదాన పథకం ట్రస్టుకు ఇప్పుడు రూ.3 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ చేకూరింది. నేను గతంలో టీటీడీ ద్వారా శ్రీవారి ప్రాణదాన ట్రస్టును ప్రారంభించగా.. ప్రస్తుతం దానికి రూ.440 కోట్ల విరాళాలు సమకూరాయి.

అట్టహాసంగా ప్రారంభం.. తిరుపతిలో ఐటీసీఎక్స్‌-2025 పేరిట అలయ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. టెంపుల్‌ కనెక్ట్స్‌ సంస్థ అతిరథ మహారథులు, ఆధ్యాత్మిక గురువులు, ఆలయ ట్రస్టీలు, అధికారులను ఒకచోటకు చేర్చింది. ప్రధాని మోదీ లేఖ ద్వారా తన సందేశాన్ని అందించగా.. ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. సమావేశంలో ఆధ్యాత్మికవేత్త ఆచార్యగోవింద్‌ దేవ్‌ గురూజీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సంయుక్త కార్యదర్శి ముకుంద్‌, మంత్రి అనగాని సత్యప్రసాద్‌, మహారాష్ట్ర మంత్రులు ఆశిష్‌ షెలార్‌, మేఘన బోరిద్కర్‌, గోవా మంత్రి విశ్వజిత్‌ రాణే, ఎంపీ ప్రవీణ్‌ దార్కేర్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అంత్యోదయ ప్రతిష్టాన్‌ చైర్‌పర్సన్‌ నీతాలాడ్‌ పాల్గొన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ సురేశ్‌ హవారే, గోవా పర్యాటక మంత్రి రోహన్‌, ఇస్కాన్‌ కమ్యునికేషన్స్‌ డైరెక్టర్‌ గోవిందాదాస్‌ తదితరులు పాల్గొంటారు.


అవినీతిపరులకు ఈ జన్మలోనే శిక్ష

అవినీతికి పాల్పడితే వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 27 వేల ఆలయాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఏటా 21 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారన్నారు. ఆలయాల ఉత్తమ నిర్వహణతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

ఆలయాలన్నీ హరిత ఇంధనం వినియోగించాలి. సామాజిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి. టెక్నాలజీ సాయంతో స్వయంసమృద్ధి దిశగా పయనించాలి.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

తిరుమల భక్తులు అమరావతికీ వస్తారు!

అమరావతి అన్న పేరుకు అర్థం దేవతల రాజధాని అంటూ అలాంటి అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పవిత్రంగా, ఎంతో పరిశుభ్రంగా, అన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈరోజు చెబుతున్నా.. ఏదో ఒక రోజు తిరుమలకు వచ్చే యాత్రికులు తదుపరి అమరావతినీ చూసేందుకు వచ్చే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఒక్కటిగా ఉంటేనే అందరికీ భద్రత: సావంత్‌

దేశంలో సంస్కృతులు, వేషభాషలు వేర్వేరైనా ఆలయాల సంస్కృతి ద్వారానే ప్రజలంతా కలసి ఉంటున్నారని, అందరం ఒక్కటిగా ఉంటేనే భద్రంగా ఉంటామని గోవా సీఎం సావంత్‌ తన ప్రసంగంలో తెలిపారు. ‘దేశంలో తరతరాలుగా రాజులు, చక్రవర్తులందరూ దేవుడిని నమ్మి, ధర్మాన్ని పాటించారు. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మం కొనసాగుతోంది’ అని చెప్పారు. ఆయన కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

దేవాలయాలు భారతీయ సామాజిక కేంద్రాలు: మోహన్‌ భగవత్‌

వారాణసీలో జరిగిన తొలి సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలను ఏకం చేయడంలో టెంపుల్‌ కనెక్ట్‌ కృషిని ప్రశంసిస్తూ ఆర్‌ఎ్‌సఎస్‌ ముఖ్యనేత మోహన్‌ భగవత్‌ వర్చువల్‌ ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు. ‘పూర్వకాలంలో దేవాలయాలు భారతీయ సామాజిక కేంద్రాలుగా ఉండేవి. నేడు కూడా వాటి పట్ల అపరిమితమైన విశ్వాసం ఉంది.’ అని పేర్కొన్నారు.


చిన్న ఆలయాలకు టీటీడీ చేయూత: ముకుంద్‌

కలియుగంలో ముక్తి మార్గంలో నడవడానికి భక్తి అన్నిటికంటే గొప్పదని ఆర్‌ఎస్ఎస్‌ నేత ముకుంద్‌ అన్నారు. తొలిసారిగా మన మందిరాలు, శక్తిపీఠాలను వ్యవస్థీకృత పద్ధతిలో శుద్ధి చేయడానికి టెంపుల్‌ కనెక్ట్‌ ముందుకొచ్చిందన్నారు. భక్తి విశ్వాసాలను సజీవంగా ఉంచడానికి టీటీడీ వంటి పెద్ద ఆలయాలు సహాయపడుతున్నాయన్నారు. కర్ణాటకలోని పలు ఆలయాలు కూడా ఆ దిశగా నడుస్తున్నాయని చెప్పారు.

సామాజిక సంక్షేమానికి నాంది: ప్రసాద్‌ లాడ్‌

ఎక్స్‌పో చైర్మన్‌, మహారాష్ట్ర శాసన మండలి చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ లాడ్‌ మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి ప్రతీకలైన దేవాలయ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా సామాజిక సంక్షేమానికి గణనీయమైన సహకారం అందించవచ్చని చెప్పారు. 2047 నాటికి స్వావలంబన దేశంగా మార్చేక్రమంలో ఆలయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆలయపాలనకు అంకితమైన తొలి అంతర్జాతీయ వేదికగా ఇది నిలుస్తుందన్నారు.

ఆధ్యాత్మిక పర్యాటకానికి అంతర్జాతీయ కేంద్రం: గిరేష్‌ కులకర్ణి

టెంపుల్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకుడు గిరేష్‌ కులకర్ణి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పర్యాటకానికి భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. ఈ క్రమంలో ఆలయ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, మరింత శక్తిమంతమైన కేంద్రాలుగా మార్చడం కోసం ఐసీటీఎక్స్‌ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 03:25 AM