CM Chandrababu Naidu: రాజకీయ రౌడీలకు చెక్
ABN, Publish Date - Jun 28 , 2025 | 03:59 AM
ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్తతరం రాజకీయం వచ్చింది.
పోలీసులు ముసుగుతీసి వాళ్లను నియంత్రించాలి: సీఎం
నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్థులకు చోటులేదు
టెక్నాలజీని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు
వివేకా హత్య కేసులో నేరస్థులను పట్టించింది గూగుల్ టేకౌటే
అందుకే సాంకేతికతకు పదును పెడుతున్నా
ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పుచేసి ఎదురుదాడి చేస్తున్నారు
తెనాలి వెళ్లి రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌కు మద్దతు
దీనిపై ప్రజలు ఆలోచించాలి త్వరలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్
బాబాయిని గొడ్డలితో నరికినరికి చంపారు
ఇలా హత్య చేసిన వాళ్లు రాజకీయాలకు అర్హులా?
దీనిపై అందరూ గళం విప్పాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
మీ పిల్లలకు మీరు ఎంత ఆస్తి ఇచ్చారన్నది ముఖ్యం కాదు. ఎంత పెద్ద చదువులు చదివించారనేది కీలకం. తద్వారా రాబోయే రోజుల్లో 100 రెట్లు సంపాదించే తెలివితేటలు వాళ్లకు వస్తాయి.
కృత్రిమ మేధ వస్తే ఉద్యోగాలు పోతాయని చదువుమానేసి ఇంట్లో కూర్చోవడం కరెక్టు కాదు. దాని ద్వారా సేవలందిస్తే కోకొల్లలుగా ఉద్యోగాలు.
ఉమ్మడి రాష్ట్రంలో టెక్నాలజీపై ఎంత శ్రద్ధ పెట్టానో శాంతిభద్రతలను కాపాడేందుకు కూడా ఉక్కుపాదం మోపాను. - సీఎం చంద్రబాబు
గుంటూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ‘ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్తతరం రాజకీయం వచ్చింది. రౌడీలే రాజకీయాల్లోకి వచ్చి నేరాలు చేస్తున్నారు. పోలీసులకు ఈ సందర్భంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ముసుగు తీసి వాళ్లను నియంత్రించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజాహితం, ఆడబిడ్డల రక్షణ కోసం ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని.. రౌడీల ఆట కట్టించేందుకు టెక్నాలజీకి పదును పెడుతున్నానని.. దాని సహకారంతో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేంతవరకు వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హ్యాకథాన్’ను శుక్రవారం మధ్యాహ్నం గుంటూరులోని ఆర్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, ఐటీ నిపుణులు, కళాశాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సీబీఎన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్థులకు చోటులేదన్నారు.
‘వారం క్రితం పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో చూశారు కదా! ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెనాలి వెళ్లి రౌడీషీటర్‌కు, గంజాయి బ్యాచ్‌కు, పోలీసులపై దాడి చేసిన వాళ్లకు మద్దతు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు’ అని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలను వేధిస్తాం, చంపుతామంటే వా ళ్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. టెక్నాలజీ లేనప్పుడే వాళ్లకు తామేంటో చూపించామని.. ఇప్పు డు పకడ్బందీగా కేసు నమోదు చేసి తిరిగి అలాంటి తప్పు ఎవరూ చేయకుండా చేస్తామని తేల్చిచెప్పారు. ఈ హ్యాకథాన్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఫోర్‌సైట్ ఏఐ సీఈవో కొత్త సూర్య గుప్తా, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
బాబాయిని చంపి నాపై నిందలు..
వివేకానందరెడ్డి హత్య కేసులో నేరస్థులను ఆధారాలతో పట్టించింది గూగుల్ టేకౌట్ టెక్నాలజీనే. ఈవిధంగా టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. బాబాయిని చంపి నా మీదే నేరం మోపారు. పనికిమాలిన పేపర్, అవినీతి పత్రిక, టీవీని వినియోగించుకుని తొలుత గుండెపోటన్నారు. తెల్లవారుతూనే నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథలు అల్లారు. ఆ రోజున నేరస్థులను అరెస్టు చేసి ఉంటే మళ్లీ ఎవరైనా అలాంటి తప్పు చేసేవారా? బాబాయిని నరికిన విధానం చూస్తే ఎంత ఘోరాతిఘోరంగా హత్య చేశారో తెలుస్తుం ది. ఈ విధంగా హత్య చేసిన వాళ్లు రాజకీయాలకు అర్హులా? ప్రజలంతా గళం విప్పాలి.
స్మార్ట్‌వర్క్ ఎంతో అవసరం..
ఈ రోజున హార్డ్ వర్క్ ముఖ్యం కాదు. స్మార్ట్ వర్క్ అవసరం. అది చేయగలిగితే ప్రపంచాన్నే శాసించవచ్చు. రాబోయే రోజుల్లో డేటా పెద్ద సంపద అవుతుంది. సాదాసీదాగా ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచనకు టెక్నాలజీని జోడించి.. నాయకత్వం వహించి.. వినియోగంలోకి తీసుకొ స్తే ప్రతి ఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్లు కావచ్చు. ఇప్పటివర కు పోలీసులు సంప్రదాయంగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. దేశంలో ప్రప్రథమంగా కృత్రిమ మేధను వినియోగించుకుని ఈ హ్యాకథాన్ ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం. గతంలో డోర్‌లాక్ సిస్టమ్, పోలీసులకు బాడీ ఓన్ కెమేరాలు తీసుకొచ్చింది కూడా మేమే.
థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ
థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించు. అలానే అందుకు అనుగుణంగా స్పందించాలని విద్యార్థులకు సూచిస్తున్నాను. ఐటీ నిత్య జీవితంలో భాగమైపోయింది. సెల్‌ఫోన్ల వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి అవగాహన లేదు. ఒక సెల్‌ఫోన్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతకొచ్చన్న విషయాన్ని నేర్చుకోవాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను రాష్ట్రవ్యాప్తంగా పెట్టి.. పేరొందిన సంస్థలను భాగస్వాములుగా పెడుతున్నాం. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నా విధానం. ఇప్పటివరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేటు వ్యక్తులు ఉపగ్రహాలను పంపే పరిస్థితి వస్తుంది. ఇందుకోసం పాలసీ తీసుకొచ్చాం. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
Updated Date - Jun 28 , 2025 | 03:59 AM