CM Chandrababu: మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:43 AM
మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనను కవర్ చేస్తూ, వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.
న్యూస్ కవరేజ్‌కు వెళ్లినవారిని కొట్టడం హేయం
వైసీపీ నాయకులు దగ్గరుండి దాడి చేయించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం
‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్ శివకుమార్‌కు ఫోన్‌లో
పరామర్శ.. అందుతున్న చికిత్సపై ఆరా
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనను కవర్ చేస్తూ, వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్‌ను అడిగి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివకుమార్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శివకుమార్‌పై దాడి ఘటనను ఖండిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్టు చేశారు. ‘చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన ఫొటోగ్రాఫర్‌పై తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపర్చడం అమానుషం. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ చెబుతుంటే, చాలా బాధ అనిపించింది. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. శివకుమార్‌పై దాడిచేసినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, శివకుమార్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోను చేసి పరామర్శించారు. శివకుమార్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి, జీడీనెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, టీడీపీ నాయకులు, సీపీఐ నేతలు ఆస్పత్రిలో శివకుమార్‌ను పరామర్శించి.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పోలీసుల అదుపులో నిందితులు
నారాయణస్వామి అనుచరుడు సహా ఇద్దరిపై కేసు
పరారీలో ప్రధాన నిందితుడు ప్రకా్‌శ్ ఆచారి
తిరుపతి, నెల్లూరుల్లో నిరసన ప్రదర్శనలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను కొట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు గుర్తించారు. చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి అనుచరుడు చక్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడు వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 118(1),115/2,324/4 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ అనుచరుడు ప్రకాశ్ ఆచారి దాడికి నాయకత్వం వహించినట్టు గుర్తించారు. అతడు పరారీలో ఉన్నాడు. చంద్ర (పలమనేరు), మో హన్ (జీడీ నెల్లూరు) పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, శివకుమార్‌పై దాడిని నిరసిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జర్నలిస్టులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. నెల్లూరులో నిరసన ప్రదర్శన చేశారు.
Updated Date - Jul 11 , 2025 | 02:46 AM