CM Chandrababu: తప్పు చేస్తే ఊరుకోను
ABN, Publish Date - Jun 08 , 2025 | 02:54 AM
‘ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నా. మంచి చేస్తే ప్రోత్సహిస్తా. అవకాశాలు కల్పిస్తా. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా. అవసరమైతే వదులుకుంటా.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు..
ఎవరినైనా దూరం పెడతా.. వ్యవస్థకు నష్టం జరగకూడదు
తప్పు చేసే వారి కోసం పార్టీ సహా ప్రభుత్వ ప్రయోజనాలు విస్మరించను
వన్‌టైం ఎమ్మెల్యేగా ఉంటామంటే మీ ఇష్టం
ప్రతి ఆరుమాసాలకూ పనితీరుపై సర్వే
అధికారుల తీరుతోనూ ప్రభుత్వానికి చెడ్డపేరు
ఈ విషయంలో మంత్రులు బాధ్యతగా ఉండాలి
జగన్ పాలనలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ
ఆ ప్రభుత్వాన్ని భరించలేకే మనల్ని గెలిపించారు
కూటమి ఏడాది పాలనపై 12న విజయోత్సవాలు
14లోపే తల్లికి వందనం.. ఈ నెల్లోనే ‘అన్నదాత’
టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో
టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని స్పష్టీకరణ
‘‘జగన్ పాలనలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది. రాష్ట్ర ప్రజలు భయంకర పరిస్థితులు చవి చూశారు. 1995, 2014లో కూడా ఇన్ని ఇబ్బందులు చూడలేదు. రాష్ట్రం పేరు వింటేనే పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు.’’
- సీఎం చంద్రబాబు
‘‘గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనకు ఓట్లేసి గెలిపించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. శాశ్వతంగా ప్రజలు మనతో ఉండేలా చూసుకోవాలి. ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగించాలి. మొదటి సారి ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలి. విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి.’’
- సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నా. మంచి చేస్తే ప్రోత్సహిస్తా. అవకాశాలు కల్పిస్తా. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా. అవసరమైతే వదులుకుంటా.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. తప్పులు చేసే వారి విషయంలో రాజీ పడబోనని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఏ ఒక్కరి వల్లైనా వ్యవస్థకు నష్టం జరుగుతుందనుకుంటే అంగీకరించేది లేదని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఏడాది పాలనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొందరు బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ‘‘ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా అతి విశ్వాసానికి పోతే వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు వన్‌టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆలోచన. కొందరు వన్‌టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోతామని అనుకుంటే అది.. వారిష్టం’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఒకరిద్దరితోనే నష్టం
మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పనితీరుతో ప్రజలకు దగ్గరయ్యారని చంద్రబాబు తెలిపారు. వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. ఒకరిద్దరి ప్రవర్తన కారణంగా అక్కడక్కడా నష్టం జరుగుతోందన్నారు. ఒకరి కోసం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే అలాంటి నేతలను దూరంగా పెట్టడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో పాలనలో తప్పుల వల్ల, అధికారుల తీరు వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ‘‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మంచిచెడులు తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలి. పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ఉంటుంది. పనిచేయని వారి విషయంలో 1995 నాటి విధానం అమలు చేస్తా.’’ అని స్పష్టం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు నిర్వహించి స్థానిక పరిస్థితులపై చర్చిస్తానని తెలిపారు.
ఏడాది పాలనపై విజయోత్సవాలు
ఏడాది పాలనపై 12న అన్ని నియోజకవర్గాల్లో కూటమి తరఫున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏడాది పాలనపై విజయోత్సవాల్లో అన్ని స్థాయిల నేతలు భాగస్వాములు కావాలన్నారు. అదేరోజు సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ‘‘ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించాం. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.’’ అని సూచించారు. ‘‘గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది. ప్రజలు భయంకర పరిస్థితులు చవి చూశారు. 1995, 2014లో కూడా ఇన్ని ఇబ్బందులు చూడలేదు. రాష్ట్రం పేరు వింటేనే పెట్టుబడిదారులు ఎవరూ వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. అయినా సమస్యలు చూసి పారిపోలేదు. అన్నింటినీ చక్కదిద్దుకుంటూ ముందుకెళుతున్నాం.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సర్వశక్తులు ఒడ్డి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ఫలితాలు అడ్డుకోవడానికి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదు. మనం తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. గత ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలి’’ అని దిశానిర్దేశం చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించిందని, అలా అని ఎప్పుడూ వాళ్లవైపు చూడకూడదని సీఎం అన్నారు. రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఇంకా కష్టపడాలన్నారు. ‘‘కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. నేను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రమంత్రులతో సమావేశమై పరిస్థితులు, ఉన్న అవకాశాలు వివరిస్తున్నాను. మనకు పదవులు కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అందుకే చేయూతనివ్వమని కేంద్రాన్ని కోరుతున్నా.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఒకేచోట 5 లక్షల మందితో యోగాడే నిర్వహిస్తున్నామని అన్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా లక్ష చోట్ల యోగా నిర్వహిస్తామని, యోగా అందరి జీవితంలో భాగం కావాలని, ఇది మన సంపద, వారసత్వమని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యకర్తలందరూ యోగా దినోత్సవంలో పాల్గొనాలని, ఇది ఏ మతానికీ సంబంధించినది కాదని, ఆరోగ్య రక్షణ కోసం చేసేదని తెలిపారు.
బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు
పోలవరం-బనకచర్ల అనుసంధానంతో అద్భుత ఫలితాలు వస్తాయని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలగదని చంద్రబాబు తెలిపారు. గోదావరిలో వృథాగా కలిసే 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే మనం వినియోగించుకుంటామన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అందరూ తనకు ముఖ్యమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కట్టిన ఏ ప్రాజెక్టునూ టీడీపీ వ్యతిరేకించలేదని, కానీ కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు.
సీఎం చెప్పిన మరిన్ని విషయాలు
ఈ నెల 12 లేదా 14వ తేదీలోపే ‘తల్లికి వందనం’ పథకం అమలు.
ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కూడా.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు.
4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.
2027 నాటికి పోలవరం పూర్తి.
Updated Date - Jun 08 , 2025 | 08:53 AM