Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై న్యూఢిల్లీలో ముగిసిన సమావేశం.. కీలక అంశాలు ప్రస్తావన
ABN, Publish Date - Jun 02 , 2025 | 06:08 PM
బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
న్యూఢిల్లీ, జూన్ 02: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు లేవనెత్తిన పలు సందేహాలకు ఏపీ అధికారులు సమాధానాలు ఇచ్చారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పలు ప్రాంతాలకు సాగు, తాగు నీరు సైతం అందించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు అత్యధిక లబ్ధి చేకూరనుంది. వీటితోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం నీటి సమస్య తీరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 80 లక్షల మంది ప్రజలకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం కలగనుందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి వరదనీటిని రాయలసీమ బేసిన్‌కు తరలించడం వల్ల కలిగే లాభాలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా వివరించారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌పై జలవనరుల శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. నదులు అనుసంధానంతోపాటు దేశంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్న వేళ.. రాయలసీమలోని జిల్లాలకు బనకచర్ల ద్వారా నీరు అందాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి వరదనీటిని సముద్రంలోకి వృథాగా పంపే కంటే.. బనకచర్ల ద్వారా రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌ను రూ.81 వేల కోట్లతో ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
వెన్నుపోటుకు.. గొడ్డలి వేట్టుకు పేటెంట్
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 02 , 2025 | 07:16 PM