Hyderabad: సాధారణ బదిలీలు ఎప్పుడు?
ABN, Publish Date - Jun 16 , 2024 | 03:25 AM
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు సకాలంలో జరగకపోవడంతో వారంతా సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయాల్సివస్తోంది. కొందరు ఉద్యోగులు 15 ఏళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతుండగా, మరికొందరు పదేళ్లుగా, ఇంకొందరు ఐదేళ్లుగా ఒకే కుర్చీకి పరిమితమయ్యారు.
ఏళ్లుగా నిరీక్షిస్తున్న 3.50 లక్షల మంది ఉద్యోగులు
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు సకాలంలో జరగకపోవడంతో వారంతా సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయాల్సివస్తోంది. కొందరు ఉద్యోగులు 15 ఏళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతుండగా, మరికొందరు పదేళ్లుగా, ఇంకొందరు ఐదేళ్లుగా ఒకే కుర్చీకి పరిమితమయ్యారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల తరఫున సర్కారుకు పదే పదే విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నవారే లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయినా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 3.50లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి సంబంధించి సాధారణ బదిలీల ప్రక్రియను ప్రతి ఏటా చేపట్టాల్సి ఉంటుంది. కొన్ని శాఖల్లో రెండేళ్లకోసారైనా ఉద్యోగుల బదిలీ చేయాలనే నిబంధనలున్నాయి.
కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన పదేళ్లలో ఒక్కసారి మాత్రమే సాధారణ బదిలీలు చేపట్టారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 2018లో 40 శాతం మంది ఉద్యోగులకు బదిలీలు చేస్తామని చెప్పిన నాటి కేసీఆర్ ప్రభుత్వం.. కేవలం 20 శాతం మందికే అవకాశం కల్పించిందని గుర్తు చేస్తున్నాయి. ఆ తరువాత మళ్లీ బదిలీల ఊసే లేదని, గత ప్రభుత్వంలో బదిలీల కోసం పెద్దల చుట్టూ తిరిగి విసిగిపోయామని పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల తరఫున సీఎం రేవంత్‌రెడ్డితోపాటు సీఎస్ శాంతికుమారి, సీఎంవో అధికారులు, మంత్రులకు సాధారణ బదిలీల కోసం వినతి పత్రాలు సమర్పించామని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం బదిలీలు చేస్తుందని ఆశించినా స్పందన లేకపోవడం నిరాశకు గురిచేస్తోందన్నారు.
Updated Date - Jun 16 , 2024 | 03:25 AM