Weather Department : బలహీనపడిన అల్పపీడనం
ABN, First Publish Date - 2024-12-27T04:07:28+05:30
పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది.
నేటి నుంచి స్వల్పంగా తగ్గనున్న రాత్రి ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. దీనిపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం మాత్ర ం కొనసాగుతోంది. వారం నుంచి కోస్తాలో వర్షాలు, ముసురుకు కారణమైన అల్పపీడనం బలహీనపడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా తగ్గింది. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కావలిలో 70, టంగుటూరులో 63.5, కొత్తపట్నంలో 60.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఎగురవేసిన భద్రతా సూచికలు శుక్రవారం ఉపసంహరించనున్నట్టు పేర్కొంది. శుక్రవారం నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని అంచనా వేసింది.
Updated Date - 2024-12-27T04:11:36+05:30 IST