Year Ender 2025: 2025లో కారు స్పీడుకు బ్రేక్ వేసిన హస్తం.. జూబ్లీహిల్స్‌లో నవీన్ విజయం
ABN, Publish Date - Dec 31 , 2025 | 03:41 PM
2025 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.
2025 సంవత్సరంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఎన్నికను అటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో వ్యూహాలు రచించింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు స్వయంగా ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఆ పార్టీ నేతలు బరిలోకి దిగారు.
అభ్యర్థుల ఎన్నిక...
మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. స్వయంగా గులాబీ బాస్ సునీతకు బీఫామ్ అందజేయడంతో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.40 లక్షల చెక్కును కూడా అందజేశారు. మరోవైపు ఈ ఎన్నికలను కీలకంగా భావించిన కాంగ్రెస్ పార్టీ యువ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. అలాగే బీజేపీ కూడా ఎన్నో చర్చోపచర్చల అనంతరం తమ పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో మూడు పార్టీలు కూడా పోటాపోటీగా తమ అభ్యర్థులను నిలబెట్టి... గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాయి.
విస్తృత ప్రచారం
ఇక మూడు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఓటర్లను తమవైపుకు లాక్కునేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమను గెలిపిస్తే నియోజవకర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేసింది. అలాగే బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేతల పర్యటనలు, రోడ్‌షోలు, భారీ ప్రచారం ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చాయి.
నవీన్ ఘన విజయం
ఇక ప్రచారం ముగిసిన తర్వాత నవంబర్ 11న ఎన్నిక జరిగింది. నవంబర్ 14 ఓట్లను లెక్కించారు. ఫలితాల కోసం మూడు పార్టీలు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. చివరకు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టితో గెలుపొందారు. మొత్తం 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. అయితే బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం ఊహించని ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి.
Updated Date - Dec 31 , 2025 | 05:00 PM