ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Year Ender 2025 - ISRO: అంతరిక్ష రంగం.. ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు

ABN, Publish Date - Dec 31 , 2025 | 09:03 AM

భారత్ ఈ ఏడాది అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను అందుకుంది. ఇస్రో సారథ్యంలో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. త్వరలో కొత్త ఏడాదిలో కాలుపెడుతున్న వేళ ఈ ఏడాది సాధించిన విజయాలను తరచి చూసుకుంటే..

India's Achievments in Space Sector 2025

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ అద్భుత పురోగతిని సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సారథ్యంలో నూతన సాంకేతికతల అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో స్పేస్ విజన్-2047 దిశగా కీలక పురోగతి సాధించింది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సంక్లిష్ట సాంకేతికతలపై పట్టు సాధించడం, మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు, కమర్షియల్ శాటిలైట్ ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది.

స్పేడెక్స్

అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, మానవసహిత యాత్రల కోసం ఇస్రో ఈ ఏడాది స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని (స్పేడెక్స్) విజయవంతంగా నిర్వహించింది. రెండు వ్యోమనౌకలను విజయవంతంగా అనుసంధానించింది. తద్వారా డాకింగ్ టెక్నాజీ అభివృద్ధిలో కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షంలో జీవ శాస్త్ర పరిశోధనల్లో కూడా ఇస్రో ఈ ఏడాది గొప్ప విజయాన్ని సాధించింది. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) పేరిట చేపట్టిన ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలో అలసంద విత్తనాలు మొలకెత్తేలా చేయగలగడం ఇస్రో సాధించిన కీలక విజయం. ‘అంతరిక్షంలో జీవం మొలకెత్తింది’ అని అప్పట్లో ఇస్రో ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది.

ఆదిత్య ఎల్-1

సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 శాటిలైట్ కీలక సమాచారాన్ని పంపించింది. ఈ డేటాని ఇస్రో ప్రపంచంతో షేర్ చేసింది. తద్వారా సూర్యుడి అధ్యయనానికి సంబంధించి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించింది.

భూపరిశీలన కోసం ఇస్రో పంపించిన శాటిలైట్స్ ఎనలేని సేవ చేశాయి. ముఖ్యంగా ఎర్త్‌ అబ్జర్వేషన్ శాటిలైట్స్ సమాచారం, క్రాప్ గ్రోత్ మోడల్స్ ద్వారా ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి 122 మిలియన్ టన్నులు ఉంటుందని ఇస్రో లెక్క కట్టగలిగింది. నాసాతో కలిసి ఇస్రో చేపట్టిన నిసార్ శాటిలైట్ ప్రయోగం కూడా ఎర్త్ అబ్జర్వేషన్‌కు సంబంధించి కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, హిమానీనదాల్లో మార్పులను మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు నిసార్ శాటిలైట్‌తో అవకాశం దక్కింది.

బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన ఎల్‌ఎమ్‌వీ3- ఎమ్6 ద్వారా ఇస్రో తాజాగా 6,100 కేజీల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇంత భారీ ఉపగ్రహాన్ని భారతీయ రాకెట్ ద్వారా ప్రయోగించడం ఇదే తొలిసారి.

అంతరిక్ష పరిశోధనకు మౌలిక వసతుల ఏర్పాటు

రాకెట్ ప్రయోగాలకు సంబంధించి శ్రీహరి కోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆమోదం తెలిపింది. కొత్త తరం రాకెట్స్, మానవసహిత అంతరిక్ష యాత్రలకు అనుకూలంగా ఈ ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనున్నారు. చిన్న శాటిలైట్ ప్రయోగాల అవసరాలకు అనుగుణంగా కులశేఖరపట్టనంలో ఎస్ఎస్ఎల్‌వీ లాంచ్ ప్యాడ్ నిర్మాణం ఈ ఏడాది మరింత వేగవంతమైంది. ఈ ఏడాది శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 ద్వారా సెమీ క్రయోజెనిక్ ఇంజెన్ పవర్ హెడ్‌లో హాట్ టెస్టుల నిర్వహణ, మార్గమధ్యంలో సీ25 క్రయోజనిక్ ఇంజన్ రీస్టార్ట్ సాంకేతికతను పరీక్షించింది. తద్వారా మరింత బరువైన పేలోడ్స్ మోసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.

మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా ఏర్పాట్లు

మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా ఇస్రో ఈ ఏడాది ముందడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల భద్రత కోసం ఉద్దేశించిన క్రూ మాడ్యుల్ పారాషూట్ వ్యవస్థను దిగ్విజయంగా పరీక్షించింది. ఇక యాక్సియమ్-4 మిషన్ ద్వారా ఇస్రో వ్యోమగామి శుభాన్షూ శుక్లా అంతరిక్ష యాత్రకు అవసరమైన శిక్షణ, అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో వ్యోమగాముల ఆరోగ్యంపై అధ్యయనం కోసం శ్రీ చిత్ర తిరుణాళ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో ఇస్రో జట్టు కట్టింది. లద్దాఖ్‌లోని సోకార్ వ్యాలీలో నిర్వహించిన అనలాగ్ మిషన్స్ ద్వారా వ్యోమగాములపై అంతరిక్ష యాత్రల ప్రభావాన్ని కూడా అధ్యయనం చేసింది.

అంతరిక్ష రంగంలో స్వావలంబన

అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన లక్ష్యానికి భారత్ ఈ ఏడాది మరింత చేరువైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ప్రత్యేక విక్రమ్3201, కల్పన3201 32-బిట్ ప్రాసెసర్లను ఆవిష్కరించింది. అంతరిక్షంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇస్రో.. స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్‌వీ) సాంకేతికత బదిలీ ఒప్పందంపై సంతకాలు చేసింది.

అంతర్జాతీయ సహకారం

అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారం దిశగా భారత్ ఈ ఏడాది గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఇక సిడ్నీలో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రొనాటికల్ కాంగ్రెస్ సమావేశాల్లో భారత్ తన విజయాలను సగర్వంగా ప్రదర్శించింది. 2047 నాటికి అంతరిక్ష రంగంలో మేటి శక్తిగా నిలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్లానింగ్ తదితర అంశాలపై సమాలోచనలు జరిపేందుకు స్పేస్ డిపార్ట్‌మెంట్.. చింతన్ శివిర్-2025ని కూడా నిర్వహించింది. ఇలా భారత్ ఈ ఏడాది అంతరిక్ష రంగంలో అనేక విజయాలతో అంతర్జాతీయంగా తన సత్తా చాటుకుంది.

ఇవీ చదవండి:

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

బంగారం కొనుగోళ్లు.. డిజిటల్ గోల్డ్‌కు జైకొట్టిన జెన్ జీ

Updated Date - Dec 31 , 2025 | 10:34 AM