Year Ender 2025: ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 02:18 PM
ఈ ఏడాది ఏఐ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏఐ రంగంలో సంభవించిన ముఖ్యమార్పులు ఏవో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఏఐ రంగంపై చర్చ పతాకస్థాయికి చేరిందని చెప్పక తప్పదు. ఏఐ సామర్థ్యాలపై కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అనేక కొత్త మోడల్స్ రంగ ప్రవేశం చేసి టెక్ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏఐ టూల్స్ సామర్థ్యాలు బాగా పెరగడంతో మనుషుల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మిన్నంటింది. మరి ఈ ఏడాది ఏఐ రంగంలో చోటుచేసుకున్న టాప్ పరిణామాలు ఏంటో ఓసారి చెక్ చేసుకుందాం (AI Top Developments in 2025)
నిత్యజీవితంలో భాగమైన ఏఐ
ఒకప్పుడు ఏఐ అంటే ఒక ప్రయోగాత్మక అంశంగానే ఉండేది. కానీ ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ప్రయోగాత్మక దశను దాటి రోజువారీ జీవితంలో ఒక భాగమయ్యే దశకు చేరుకున్నాయి. వ్యాపార కార్యకలాపాలతో పాటు శాస్త్రపరమైన పరిశోధనలకు కూడా కీలకంగా మారాయి. తాజా మోడల్స్ తార్కిక శక్తి పెరగడంతో సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించే స్థాయికి ఏఐ టూల్స్ చేరుకున్నాయి. డిజిటల్ ప్రపంచంలో వేళ్లూనుకున్నాయి.
అమెరికా ఆధిపత్యానికి సవాలు
ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా తన డీప్‌సీక్ ఆర్ 1 ఓపెన్ సోర్స్ మోడల్‌తో సవాలు చేసింది. తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన ఈ మోడల్ పనితీరులో మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలిగింది. దీంతో, ఏఐ రంగంలో కలకలం రేగింది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా షేర్లు భారీగా పతనమైన ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి.
రీజనింగ్ మోడల్స్ రాక
ఇటీవల విడుదలైన అనేక రీజనింగ్ మోడల్స్‌లో తార్కిక సామర్థ్యాలు బాగా మెరుగయ్యాయి. ఫలితంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో అవి మరింత రాటుదేలాయి. ఇంటర్నేషనల్ మాథ్ ఒలింపియాడ్‌లో కొన్ని ఏఐ మోడల్స్ గోల్డ్ లెవెల్ సామర్థ్యాన్ని కనబరిచాయి.
ఏఐపై భారీగా పెట్టుబడులు
సాంకేతిక రంగంలో భవిష్యత్తు అంతా ఏఐదే అన్న భావం బలపడింది. దీంతో ఏఐకి కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పెట్టుబడులు 1 ట్రిలియన్ డాలర్లను దాటాయి. పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్‌కు అవసరమైన డేటా సెంటర్ల నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ పరిణామాలు విద్యుత్ లభ్యత, పర్యావరణ సుస్థిరతపై ఆందోళనకు దారి తీశాయి.
ఏఐతో భావోద్వేగ అనుబంధం
సామాజిక సంబంధాలు బలహీనపడుతున్న ఆధునిక సమాజంలో ఏఐతో మానసిక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్న జనాల ఉదంతాలు ఈ ఏడాది ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఇవి కొన్నిసార్లు అవాంఛనీయ పరిణామాలకు దారి తీయడం, న్యాయస్థానంలో కేసులు వంటివి చోటుచేసుకున్నాయి. ఏఐతో మానసిక బంధంతో కలిగే అనార్థాలపై కూడా చర్చ మొదలైంది.
ఏఐ ఆధారిత కంప్యూటర్లు
ఏఐ సాంకేతికత సాధారణ కంప్యూటర్లలోనూ వేళ్లూనుకుంటోంది. ఏఐ వినియోగానికి అనుకూలమైన 3డీ చిప్ డిజైన్ ఆర్కిటెక్చర్లు వంటివి ఏఐని సామాన్యులకు మరింత చేరువ చేశాయి.
ఏజెంటిక్ ఏఐ
కంప్యూటర్ ఎంతటి వేగవంతమైనదైనా మనుషుల తార్కిక శక్తికి సాటిరాదు. మనుషుల మార్గనిర్దేశకత్వం లేనిదే కంప్యూటర్‌ల పని సులువు కాదు. అయితే, ఇలాంటిదేమీ లేకుండా అన్ని కోణాల్లో విషయాలను అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పనులను చక్కబెట్టగలిగే ఏజెంటిక్ ఏఐ దిశగా కీలక పురుగోతి నమోదైంది. ఈ మోడల్స్ వాస్తవ ప్రపంచంలో తమ సత్తా చూపించే రోజులు మరింత దగ్గరయ్యాయి.
హెల్త్‌కేర్ రంగంలో ఏఐ
మెడికల్ ఇమేజింగ్, రోగ నిర్ధారణ, బయాలాజికల్ ఏజింగ్ వంటి అంశాల్లో ఏఐ రాటుదేలింది. పర్యావరణ మార్పులు, పరిశోధనలో కూడా ఏఐ మోడల్స్ తమ సామర్థ్యాలను పెంచుకున్నాయి. విజన్-లాంగ్వేజ్-యాక్షన్ ఆధారిత మోడల్స్ రాకతో రోబోటిక్స్ రంగం కూడా మంచి పురోగతి సాధించింది.
ఏఐపై ప్రభుత్వ నిఘా
వ్యాపార రంగంలో ఏఐ వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఏఐ నియంత్రణపై దృష్టి సారించాయి. ముఖ్యంగా జనాలతో భావోద్వేగ బంధాల కోసం ఉద్దేశించిన ఏఐ మోడల్స్‌పై నియంత్రణ కోసం చైనా ఇప్పటికే నిబంధనలు కూడా రూపొందించింది.
ఇవీ చదవండి
క్రైమ్ ఇయర్‌గా 2025.. జనాన్ని భయపెట్టిన మర్డర్ కేసులు ఇవే..
ఈ ఏడాది జనాలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు