Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్ వల్లే ‘బనకచర్ల’ గొడవ
ABN, Publish Date - Jun 28 , 2025 | 04:35 AM
బనకచర్ల ప్రాజెక్టు వివాదానికి బీఆర్‌ఎస్సే కారణమని భారీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
కమీషన్ల కోసమే గోదావరిపై కాళేశ్వరం నిర్మాణం: మంత్రి ఉత్తమ్
పాలకవీడు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టు వివాదానికి బీఆర్‌ఎస్సే కారణమని భారీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు న్యాయం జరిగేదాకా ఆ ప్రాజెక్టుపై పోరాడతామని తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో రూ.350కోట్లతో చేపడుతున్న జాన్‌పహాడ్ జవహర్, బెట్టెతండా ఎత్తిపోతల పథకాల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు బదులుగా గోదావరిపై దేవాదుల, సీతారామ, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే బనకచర్ల వివాదం ఉండేదికాదన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు వృథా చేసిందని, అదే డబ్బును గోదావరిపై ఇతర ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే రాష్ట్రం సస్యశామలం అయ్యేదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల ప్రయోజనాల కోసం కాదని, బీఆర్‌ఎస్ నేతల కమీషన్ల కోసమని విమర్శించారు. ఆ ప్రాజెక్టు మీద తెచ్చిన అప్పుకు ఏటా వడ్డీల రూపంలో రూ.16వేల కోట్లు కడుతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అప్పులను, తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నీటిని 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అప్పటి నీటి పారుదల మంత్రి హరీశ్ లిఖితపూర్వకంగా కేంద్రానికి తెలియజేశారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో తెలంగాణకు న్యాయం జరిగేదాకా పోరాడతామని అన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 04:35 AM