ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Student Suicide: ఇద్దరు కేజీబీవీ విద్యార్థినుల ఆత్మహత్య

ABN, Publish Date - Jul 16 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.

మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఒకేరోజు 3 ఘటనలు.. అన్నీ కేజీబీవీల్లోనే!

  • తరగతి గదిలో ఉరివేసుకున్న విద్యార్థిని

  • ఇంట్లో ఉరివేసుకున్న మరో అమ్మాయి

  • భవనంపై నుంచి దూకిన మరోవిద్యార్థిని

  • ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఇబ్బందులు

మునగాల/భానుపురి/పరిగి/ కేటీదొడ్డి/ వరంగల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంకో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. 3 ఘటనలూ ఒకే రోజున జరగడం.. ముగ్గురూ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో చదువుతున్నవారే కావడం విషాదకరం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతుల కుమార్తె తనూష మహాలక్ష్మి (15).. నడిగూడెంలోని కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి 10 గంటల వరకు స్టడీ హవర్‌ క్లాసులో చదువుకుంది. తర్వాత తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌ గదికి వెళ్లి నిద్రించింది. మంగళవారం ఉదయం తనూష కనిపించకపోవటంతో విద్యార్థులు పాఠశాల సిబ్బందికి చెప్పారు. అంతా కలసి ఆమెకోసం వెతకగా.. పదో తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. విషయం తెలుసుకుని పాఠశాలకు వచ్చిన తనూష తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెకు 10 రోజుల క్రితం జ్వరం రావటంతో ఇంటికి తీసుకువెళ్లామని, జ్వరం తగ్గటంతో పాఠశాల వద్ద దించి వెళ్లామని తనూష తండ్రి చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు వస్తే.. మంగళవారం పొద్దున టిఫిన్‌ తీసుకుని రా డాడీ అని చెప్పిందని, కానీ ఆమె మృతివార్త విని గుండెల్లో పిడుగుపడిందని బోరుమన్నారు. తనూజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వేధింపులు భరించలేక.. బడికి వెళ్లక..

ఓ యువకుడి వేధింపులు భరించలేక వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం యబాజీగూడకు చెందిన కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యబాజిగూడకు చెందిన పద్మమ్మ, జంగయ్య దంపతుల రెండో కుమార్తె నవీంద్ర (16) పాలమాకుల కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. తండ్రి చనిపోగా, తల్లి కూలిపనులకు వెళుతూ పిల్లలను పోషించుకుంటోంది. అదే గ్రామానికి చెందిన నవీన్‌ అనే యువకుడు పాఠశాల వద్దకు వెళ్లి నవీంద్రను కలిసేందుకు తరచు ప్రయత్నించేవాడు. ఈ అంశం ప్రిన్సిపాల్‌ దృష్టికి వెళ్లడం, ఇబ్బందికరంగా మారడంతో.. నవీంద్రను పాఠశాల నుంచి పంపించి వేశారు. దీనితో ఆమె ఇంటి దగ్గరే ఉంటోంది. సోమవారం తల్లి వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చే సరికి.. ఇంటి దగ్గర ఉన్న షెడ్డులో నవీంద్ర ఉరివేసుకుంది. నవీన్‌ వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి తల్లి పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటిపై బెంగతో.. మానసికంగా కుంగి!

నారాయణపేట జిల్లా భూత్పూర్‌కు చెందిన సాయిశ్రుతి గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం పాఠశాలలోని మొదటి అంతస్తు నుంచి ఆమె కిందకు దూకింది. గాయపడిన ఆమెను పాఠశాల సిబ్బంది వెంటనే గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. వెన్నెముకకు తీవ్రగాయమైనట్టు గుర్తించి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు. పాఠశాల స్పెషలాఫీసర్‌ పద్మావతి మాట్లాడుతూ.. సాయిశ్రుతి కొన్ని రోజులుగా ఇంటి విషయాలతో మానసికంగా కుంగిపోతోందని పేర్కొన్నారు. ఆమె భోజనం కూడా సరిగా చేయడం లేదని తెలిసిందన్నారు. ఈ క్రమంలో నీరసంతో కళ్లు తిరిగి, భవనంపై నుంచి కిందపడినట్టు అనిపిస్తోందన్నారు.

గురుకులాల్లో ఏమిటీ సమస్య?

రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలలు, 495కేజీబీవీ, 267ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 6.5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల గురుకుల పాఠశాలల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. కొన్నేళ్లుగా గురుకులాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు కుటుంబాలకు దూరంగా ఉండటం, అనారోగ్యానికి గురైతే పట్టించుకునేవారు లేకపోవడం, మానసికంగా అందని సాంత్వన వంటివాటితో.. హాస్టల్‌లో ఉండలేక, ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గురుకులాల్లో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో లోపాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహిం చి 45 మంది విద్యార్థినుల అస్వస్థతకు కారణమయ్యారంటూ నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వేదాద్రిని కలెక్టర్‌ ఇలాత్రిపాఠి సస్పెండ్‌ చేశారు.

Updated Date - Jul 16 , 2025 | 04:04 AM