Registration: జూన్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
ABN, Publish Date - Jul 03 , 2025 | 03:58 AM
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు జూన్ నెలలో ఆదాయం తగ్గింది. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే.. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రూ.20 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది.
గత ఏడాదితో పోలిస్తే 20 కోట్లు తక్కువ
గ్రేటర్ లోనూ తగ్గిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు జూన్ నెలలో ఆదాయం తగ్గింది. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే.. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రూ.20 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. 2024 జూన్‌లో 1.03 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అవ్వగా.. ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో డాక్యుమెంట్ల సంఖ్య 94 వేలకు పడిపోగా.. ఆదాయం రూ.980 కోట్లుగా నమోదైంది. గత ఏడాది మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో.. చాలా మంది వినియోగదారులు రిజిస్ట్రేషన్లను జూన్‌కి వాయిదా వేసుకోవడం వల్ల.. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య, ఆదాయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది అదనంగా జరిగిన రిజిస్ట్రేషన్ల కారణంగా ఆదాయం పెరిగిందని, ఆ కారణంగా ఈ ఏడాది ఆదాయం తగ్గినట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్యను పరిశీలిస్తే రంగారెడ్డిని మినహాయిస్తే మిగతా మూడు జిల్లాల్లో రిజిస్ట్రేన్ల సంఖ్య, ఆదాయం తగ్గింది. హైదరాబాద్ జిల్లాలో గతఏడాది జూన్ కన్నా ఈ ఏడాది జూన్‌లో 500, మేడ్చల్-మల్కాజిగిరిలో 1,500, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వెయ్యి చొప్పున రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఆదాయం విషయానికి వస్తే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో చెరో రూ.30కోట్ల చొప్పున.. సంగారెడ్డి జిల్లాలో రూ.40కోట్ల మేర తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం గత ఏడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్‌లో రూ.120కోట్ల మేర ఆదాయం పెరిగింది. బుద్వేల్‌లోని హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూన్ నెలలో అధికంగా జరగడమే రంగారెడ్డి జిల్లాలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Updated Date - Jul 03 , 2025 | 03:58 AM