BC Reservation: పార్లమెంటు వేదికగా ‘బీసీ’ వాణి!
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:50 AM
స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల రిజర్వేషన్‌ను 42శాతానికి పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. పార్లమెంటు వేదికగానే ఈ అంశాన్ని వినిపించాలని నిర్ణయించింది.
21న మళ్లీ ఢిల్లీకి రేవంత్‌రెడ్డి
3 రోజుల పాటు అక్కడే మకాం
ప్రధానితో భేటీ కానున్న సీఎం!
నేడు గవర్నర్ వద్దకు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల రిజర్వేషన్‌ను 42శాతానికి పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. పార్లమెంటు వేదికగానే ఈ అంశాన్ని వినిపించాలని నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లోనే ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు 21వ తేదీనే ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంతోపాటు దాని ఆవశ్యకతను వివరించనున్నారు.
పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచేందుకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదించాలని, వాటిని షెడ్యూల్-9లో చేర్చాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కులగణనలో తేలిన వివరాలను కూలంకశంగా వివరించి.. రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్‌ను మంగళవారం గవర్నర్‌కు నివేదించనున్నట్టు తెలిసింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపితే.. రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Updated Date - Jul 15 , 2025 | 03:50 AM